Saturday, June 1, 2024

ఎన్నికల సంఘం అనుమతితో బదిలీలు, పదోన్నతులు

- Advertisement -
- Advertisement -

విద్యాశాఖ కార్యదర్శి హామి : యుఎస్‌పిసి, జాక్టో స్టీరింగ్ కమిటీ
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉపాధ్యాయుల పదోన్నతులకు న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోవడంతో పదోన్నతులు, బదిలీలు, బదిలీ అయిన వారి విడుదలకు ఎన్నికల కమీషన్ అనుమతితో వీలైనంత త్వరగా షెడ్యూల్‌ను విడుదల చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం హామినిచ్చినట్లు యుఎస్‌పిసి, జాక్టో స్టీరింగ్ కమిటి ప్రకటించింది. ఈ ప్రక్రియను పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి చేయటానికి అంగీకరించినట్లు కమిటి నేతలు తెలిపారు.

గురువారం ఎంఎల్‌సి అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రిని కలిసి పాఠశాలల పునః ప్రారంభానికి ముందే విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించి నిర్దిష్టమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని సిఎం వెంటనే విద్యాశాఖ కార్యదర్శికి ఫోన్ చేసి చెప్పారు. సిఎం సూచన మేరకు ఎంఎల్‌సి నర్సిరెడ్డి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుఎస్‌పిసి), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి( జాక్టో) నాయకులు మధ్యాహ్నం సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశంని కలిసి చర్చలు జరిపారు. 2010 ఆగస్టు 23 కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్ తో నిమిత్తం లేకుండా పదోన్నతులు ఇవ్వాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున, ప్రధానోపాధ్యాయులకు, పాఠశాల స్థాయి మారిన సందర్భంలో మాత్రమే టెట్ అవసరమని ఎన్‌సిటిఈ వివరణ ఉత్తర్వులు ఇచ్చినందున పదోన్నతులకు గల ఆటంకాలన్నీ తొలగిపోయాయి.

ఈ నేపథ్యంలో నిలిచిపోయిన ప్రక్రియను ప్రారంభించాలని కోరగా అంగీకరించారని నేతలు తెలిపారు. ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని బదిలీ అయి రిలీవ్ కాకుండా ఉన్న ఉపాధ్యాయులను వెంటనే విడుదల చేస్తామని బర్రా వెంకటేశం స్పష్టం చేసినట్లు తెలిపారు. మోడల్ స్కూల్స్, ఆశ్రమ, గురుకుల పాఠశాలల్లో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పునః ప్రారంభంలోగా చేపడతామనిచెప్పారని, సిఎం సూచన మేరకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడతానని చెప్పారన్నారు. పాఠశాలల్లో సర్వీసు పర్సన్స్ నియామకం, ఉచిత విద్యుత్తు పై నిర్ణయం తీసుకున్నామన్నారు. పర్యవేక్షణాధికారుల పదవుల భర్తీ పై న్యాయ సలహాలు తీసుకుని ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.
పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, ప్రమాణాల మెరుగుదలకు ఉపాధ్యాయులను సంఘ నాయకులు మోటివేట్ చేయాలని సూచించారు.

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నే రీతిలో ఉన్నాయని, ఢిల్లీ మోడల్ ను తెలంగాణలో అమలు జరపాలనుకుంటున్నట్లు వెంకటేశం చెప్పారని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులను పాఠశాలల సందర్శనకు ఢిల్లీ తీసుకువెళ్ళే ఆలోచన ఉందని చెప్పినట్లు తెలిపారు. ఈ సమావేశంలో యుఎస్‌పిసి, జాక్టో నాయకులు కె జంగయ్య, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి, జి సదానందం గౌడ్, ఎం రాధాకృష్ణ, యు పోచయ్య, కొమ్ము రమేశ్, కె కృష్ణుడు, జాడి రాజన్న, బి కొండయ్య, ఎస్ హరికృష్ణ, జె వెంకట్రావ్, చావ రవి, పి నాగిరెడ్డి, ఎం సోమయ్య, వి శ్రీను నాయక్, గీతాంజలి, వెంకన్న, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News