ఇంగ్లండ్ బౌలర్లపై ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ విరుచుకుపడ్డారు. విధ్వంసకర బ్యాటింగ్ తో చుక్కలు చూపించాడు. టి20 సిరీస్ లో భాగంగా సౌతాంప్టన్ వేదికగా అతిథ్య ఇంగ్లండ్ తో బుధవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్ లో హెడ్ దనాదన్ ఇన్నింగ్స్ తో అలరించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కింది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్(59) భారీ షాట్లతో చెలరేగాడు. సామ్ కరన్ వేసిన ఒక ఓవర్లో వరుసగా 3 సిక్సర్లు, 3 ఫోర్లు కొట్టి 30 పరుగులు పిండుకున్నాడు. అయితే..ఇంగ్లండ్ బౌలర్లు మిగతా బ్యాట్స్ మెన్లను కట్టడి చేశారు. దీంతో ఆసీస్ 19.3 ఓవర్లలో 179 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 19.2 ఓవర్లలో కేవలం 151 పరుగులకే కుప్పకూలింది. దీంతో తొలి టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ కు ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ దక్కింది.