మొత్తానికి భారత్- పాకిస్తాన్ ఘర్షణకు తెరదించిన ఘనతను అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్నారు. ‘ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. సరైన సమయంలో విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించినందుకు రెండు దేశాలకూ ధన్యవాదాలు’ అంటూ తన ట్రూత్ సోషల్‌లో ట్రంప్ చేసిన పోస్ట్ సభ్యదేశాలనే కాదు, మన దేశంలోని రాజకీయ పక్షాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తింది. భారత్- పాకిస్తాన్ ఘర్షణలో తలదూర్చబోమంటూ కాల్పుల విరమణకు సరిగ్గా రెండు రోజుల ముందు అమెరికా ఉపాధ్యక్షుడు స్వయంగా చేసిన ప్రకటన ఏ గాలికి కొట్టుకుపోయిందో తెలియదు. ట్రంప్ ప్రకటన వెలువడిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి సైతం తాము ఇరు దేశాల ప్రధానులతోను, జాతీయ భద్రతా సలహాదారులతోనూ చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
ఉద్రిక్తతలకు తెరదించని పక్షంలో ఇరు దేశాలతో వాణిజ్యం నిలిపేస్తానంటూ తాను తేల్చిచెప్పడంతోనే అవి దిగివచ్చాయని, వాణిజ్యాన్ని తాను వాడినట్లుగా ఇతరులెవరూ వాడలేదని ట్రంప్ చెప్పుకున్నారు. నిజమే, వియ్యానికైనా, కయ్యానికైనా వాణిజ్యమే ఆయనకు ట్రంప్ కార్డు. ఇప్పుడు అదే కార్డును ఉపయోగించి, భారత్- పాక్‌లతో వాణిజ్య సంబంధాలు బలోపేతం చేసుకోబోతున్నారు. స్వదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆయన సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తున్నారు. సుంకాల కొరడా ఝళిపించి, అనేక దేశాలను వాణిజ్య చర్చలకు రప్పించేలా చేయగలిగారు. రష్యాతో యుద్ధానికి కాలు దువ్విందంటూ ఉక్రెయిన్‌ను తప్పుబట్టి, ఇప్పటివరకూ అమెరికా అందిస్తున్న సహాయాన్ని నిలిపివేస్తామంటూ బెదిరించి, ఆ దేశంలో అరుదైన ఖనిజాల తవ్వకాన్ని గుత్తకు తీసుకున్నారు.
కాల్పుల విరమణ తమకు అంగీకారమేనంటూ రష్యా- ఉక్రెయిన్ చేసిన తాజా ప్రకటన దరిమిలా, ఈ ఘనత కూడా ట్రంప్ ఖాతాలోనే పడటం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే, రష్యాతోనూ ఆయన నేరుగా వాణిజ్య ఒప్పందాలకు ఎగబడతారనడంలో సందేహం లేదు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు అధికార పగ్గాలు చేపట్టిందే తడవు దేశదేశాలనూ బెదిరించి మరీ వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం పనిగా పెట్టుకున్న ట్రంప్ మహాశయుడు చైనా కొమ్ములు మాత్రం వంచలేకపోయారు. దాంతో బతిమాలి, బుజ్జగించి బీజింగ్‌ను దారికి తెచ్చుకున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. పోటాపోటీగా విధించుకున్న సుంకాలను తగ్గించుకునేందుకు ఇరుదేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా అంగీకారం కుదరడానికి ట్రంప్ ఓ మెట్టు దిగిరావడమే కారణం.
రేపోమాపో ఇరాన్‌తోనూ ఇదే విధంగా ఆయన వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. అణు ఒప్పందానికి తలొగ్గాలని, లేనిపక్షంలో ఏకాకిని చేసి, ఏ సహాయమూ అందకుండా చేస్తామంటూ ఆ దేశాన్ని దారికి తెచ్చుకునేందుకు అమెరికా కుయుక్తులు పన్నుతోంది. విచిత్రమేమంటే, ఈ ఘర్షణలో ట్రంప్ మహాశయుడు భారత్‌తో సమానంగా పాకిస్తాన్‌ను చూడటం. ఉగ్రవాదానికి పాకిస్తాన్ పాలుపోసి పెంచిందన్న నగ్నసత్యం ఆయనకు తెలియనిదేమీ కాదు. ట్విన్ టవర్స్‌పై దాడికి మూలకారకుడైన ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయమిచ్చి ఆదుకున్నది దాయాది దేశమే. పాకిస్తాన్‌లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారన్నది చేదు నిజం. పహల్గాంలో అమాయక ప్రజల ప్రాణాలు తీసింది కూడా పాక్ ఉగ్రవాదులే.
ఇవన్నీ తెలిసినా ప్రస్తుత ఘర్షణలో భారత్‌కు ఎంత ప్రాధాన్యమిచ్చారో అంతే ప్రాధాన్యాన్ని పాకిస్తాన్‌కూ ఇవ్వడం వెనుక కారణాలు వేరు. క్రమక్రమంగా చైనా గుప్పిట్లోకి వెళ్లిపోతున్న దాయాది దేశాన్ని మళ్లీ తన అధీనంలోకి తెచ్చుకోవడం, వీలైతే అప్పులిచ్చి ‘ఆదుకోవడం’ ఆయన ప్రధాన వ్యూహంగా కనబడుతున్నది. భారత్ వద్దు వద్దంటున్నా పాకిస్తాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి తాజాగా బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయడం వెనుక అమెరికా హస్తం ఉందన్న వార్తలు కూడా వినవస్తున్నాయి. ఇది చాలదన్నట్లు కశ్మీర్ విషయంలోనూ మధ్యవర్తిత్వం నెరిపేందుకు ట్రంప్ ఉత్సాహపడుతున్నారు. ఇరుదేశాలకు చెందిన ఈ వివాదంలో ఇతరుల జోక్యం సహించేది లేదంటూ భారత్ పదేపదే తెగేసి చెబుతున్నా, పట్టించుకోకపోవడం ట్రంప్ తెంపరితనానికి నిదర్శనం. ఒకప్పటిలా పాకిస్తాన్‌తో అంటకాగాలని అగ్రరాజ్యం ఆశిస్తే, ఆసియాలో ప్రబల ఆర్థిక శక్తిగా చైనాకు పోటీగా ఎదుగుతున్న భారత్‌ను దూరం చేసుకున్నట్లే. అదే జరిగితే చైనాను దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియాలో పాగా వేయాలన్న అమెరికా కల నెరవేరడం జరగని పని.