Saturday, September 30, 2023

పేపర్ లీకేజీ కేసులో టిఎస్‌పిఎస్‌సి సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

పేపర్ లీకేజీ కేసులో ఆ 37 మందిని డీబార్.. టిఎస్‌పిఎస్‌సి సంచలన నిర్ణయం
అరెస్ట్‌ల సంఖ్య వంద దాటే అవకాశం
పారదర్శకత ఉండాలని, మోసాలు, అవినీతికి తావుండకూడదనే కఠిన నిర్ణయం
హైదరాబాద్: టిఎస్‌పిఎస్‌సి సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ కేసులో అరెస్టైన వారిపై కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్న 37 మంది అభ్యర్థులను డీబార్ చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయించింది. పేపర్ లీకేజీ కేసులో సిట్ అరెస్టు చేసిన 37 మందిని భవిష్యత్తులో టిఎస్‌పిఎస్‌సి పరీక్షలు రాసేందుకు అనుమతించమని స్పష్టంచేసింది. అయితే కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అభ్యంతరం ఉంటే రెండ్రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మందికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో అరెస్టుల సంఖ్య 50కి చేరువలో వుండగా.. ఈ సంఖ్య 100 దాటుతుందని సిపి సివి ఆనంద్ వ్యాఖ్యానించారు. బ్లూ టూత్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్ వాడి కొందరు ఎఇఇ ఎగ్జామ్ రాసినట్లు సోమవారం విచారణలో వెల్లడైంది. ఉద్యోగ నియామక పరీక్షల్లో పారదర్శకత ఉండాలని, మోసాలు, అవినీతికి తావుండకూడదని టిఎస్‌పిఎస్‌సి ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పేపర్ లీకేజీ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఆఫీసర్ శ్రీనివాస్ ప్రస్తుతం లీవ్ లో ఉండగా సివి ఆనంద్ ఆ కేసును తాత్కాలికంగా పర్యవేక్షిస్తున్నారు. టిఎస్‌పిఎస్‌సి పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు సమాధానాలు తెలుసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఇ) టెక్నాలజీ వినియోగించినట్లు సిట్ గుర్తించింది. లీకేజీకి పాల్పడిన అభ్యర్థులు చాట్‌జిపిటిను వినియోగించినట్లు విచారణలో తేలింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కోసం పేపర్లు కాపీ చేసిన తర్వాత నిందితులలో ఒకరు సమాధానాల కోసం ఎఐ సాంకేతికతను ఉపయోగించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ముగ్గురు అభ్యర్థులు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లతో పరీక్షా కేంద్రంలోకి రాగా ఎఐ టెక్నాలజీ ద్వారా సమాధానాలను గుర్తించి వారికి పంపిణీ చేసినట్లు గుర్తించారు.

డిఇ రమేశ్‌ను సిట్ అరెస్టు చేయడంతో ఈ విషయాలు వెలుగుచూశాయి. రమేష్ లీక్ అయిన మూడు ప్రశ్న పత్రాలను కాపీ చేసి, వాటిలో రెండింటికి సమాధానాలు పొందడానికి చాట్‌జిపిటి టెక్నాలజీని వినియోగించాడని సిట్ గుర్తించింది. జనవరి 22, ఫిబ్రవరి 26న నిర్వహించిన రెండు పరీక్షలకు హాజరైన ఏడుగురు అభ్యర్థులకు ఈ సమాధానాలు అందించడానికి రమేష్ ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం. మొత్తం ఏడుగురు బ్లూ టూత్ చెవిలో పెట్టుకుని పరీక్ష హాల్ కు వచ్చారు. పరీక్ష మొదలైన 10 నిమిషాల తర్వాత ఎగ్జామినర్ పేపర్ల ఫోటోలను తీసి రమేష్‌కు పంపినట్లు సిట్ తేల్చింది. మరో చోట తన నలుగురు స్నేహితులతో కూర్చున్న రమేష్, సరైన సమాధానాల కోసం చాట్‌జిపిటిని ఉపయోగించాడు. ఆన్సర్స్ ను అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఏడుగురు ఒక్కొక్కరు అర్హత సాధించేందుకు రూ.40 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించారని సిట్ అనుమానిస్తోంది.

మార్చి5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షకు రమేశ్‌కు చాట్‌జిపిటి ఉపయోగించాల్సిన అవసరం రాలేదని, ముందే లీకైన పేపర్‌ను పూల రవికిషోర్ నుంచి అందినట్లు సిట్ తేల్చింది. ఈ ప్రశ్నపత్రాన్ని రమేష్ 30 మందికి పైగా 25 లక్షల నుంచి 30 లక్షలకు అమ్మినట్లు పోలీసుల విచారణలో తెలిసినట్లు సమాచారం. మరోవైపు లీకేజీపై సిట్ తుది నివేదిక వచ్చిన తర్వాతే పరీక్షలు పూర్తైన 3 ఉద్యోగ నోటిఫికేషన్ల ఫలితాలు విడుదల చేయాలని టిఎస్‌పిఎస్‌సి నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు వెల్లడయ్యే వరకు వేచిచూడాలని టిఎస్‌పిఎస్‌సి భావిస్తోంది. కాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఫలితాలు విడుదలైన కొన్ని రోజులకు ఆ ఫలితాలను టిఎస్‌పిఎస్‌సి రద్దు చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు, ఎఇ, ఏఇఇ, డిఎఒ ఎగ్జామ్ పేపర్లు లీకైనట్లు సిట్ అధికారులు గుర్తించారు. కొన్ని పరీక్షలను నిర్వహణకు ముందే వాయిదా వేసి, కొత్త ఎగ్జామ్ తేదీలను కమిషన్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News