Thursday, May 2, 2024

ప్రధానమంత్రి మోడీ ఎన్నికల వరాలు

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి పసుపు బోర్డు,
కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు

మన తెలంగాణ/ హైదరాబాద్/ మహబూబ్‌నగర్ బ్యూరో : రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో రూ. 13,500 కోట్లు విలువ చేసే జాతీయ రహదారులు, రైల్వే తదితర అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. ‘కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. పసుపుపై పరిశోధనలూ పెరిగాయి. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమానికి మేం కట్టుబడి ఉన్నాం. ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటుతో రాష్ట్ర పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని ప్రధాని వెల్లడించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో సమ్మక్క- సారక్క ట్రైబల్ యూనివర్సిటీ పేరుతో దీనిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హెచ్‌సీయూ మారుస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో నిర్మించే ఐదు టైక్స్‌టైల్స్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే పార్క్ వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మధ్య అనుసంధానం పెరుగుతుంది‘ అని మోడీ వెల్లడించారు.
రూ. 13,500 కోట్లు విలువ చేసే పనులకు శ్రీకారం..
రూ.3397 కోట్ల అంచనా వ్యయంతో 108 కిలో మీటర్ల పొడవునా ఎన్‌హెచ్163 జి నాగపూర్, విజయవాడ జాతీయ రహదారిలో భాగంగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు నాలుగు వరుసల జాతీయ రహదారికి ప్రధాని శంకుస్థాపన చేశారు. అదే విధంగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నాలుగు వరసల జాతీయ రహదారి నిర్మాణంకు రూ.3007 కోట్ల అంచనాతో 90 కిలో మీటర్ల వరకు రహదారికి శంకుస్దాపన చేశారు. ఈ రహదారి వలన ప్రయాణ ఖర్చుతో పాటు దాదాపు 178 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. రూ .1932 కోట్ల అంచనా వ్యయంతో 425 కిలోమీటర్ల పొడవునా కృష్ణపట్నం నుండి హైదరాబాద్ వరకు బహుళ ఉత్పత్తుల పైపులైన్ పనులకు శంకుస్దాపన చేశారు. దీంతో పెట్రోల్, డీజిల్ పంపిణీ చేసే అవకాశం ఉంది. రూ,2457 కోట్ల అంచనా వ్యయంతో 50 కిలోమీటర్ల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగులైన్ల జాతీయ రహదారిని ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రూ.81 కోట్ల వ్యయంతో విద్యార్దుల మౌలిక సదుపాయాల కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు. రూ. 505కోట్ల వ్యయంతో చేపట్టిన జక్లేర్ నుంచి కృష్ణ వరకు నిర్మాణం కొత్త రైల్వే లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. హసన్ నుంచి చర్లపల్లి వరకు ఎల్‌పిజి గ్యాస్ పైపులైన్‌ని రూ. 2166 కోట్ల అంచనాతో 650 కిలో మీటర్ల వరకు నిర్మాణం చేపట్టారు. ఈ పైపులైన్‌ను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. హైదరాబాద్.( కాచిగూడ)నుంచి రాయచూర్ . హైదరాబాద్ వరకు నూతన రైలును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. నారాయణపేట జిల్లాలో చేనేత ప్రోత్సాహం అందిస్తామని ప్రధాని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపి బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని వస్తే ముఖ్యమంత్రి కలవట్లేదు : కిషన్‌రెడ్డి
రాష్ట్రంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ కలవటం లేదని బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పైగా తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ‘తెలంగాణకు అండగా ఉంటామని ప్రధాని మోడీ భరోసా ఇచ్చారు. రైల్వేలు, హైవేల నిర్మాణంలో రాష్ట్రానికి కేంద్రం అండగా ఉంది. ఎరువులపై సబ్సిడీ రూపంలో రైతులకు కేంద్రం వేల కోట్లు ఇస్తోంది. హైదరాబాద్ చుట్టూ కేంద్రం నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుతో రాష్ట్రం రూపురేఖలు మారతాయి. రీజనల్ రింగ్ రోడ్డు చుట్టూ రైల్వే లైన్ కూడా నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం కేంద్రం రూ.26 వేల కోట్లు కేటాయించింది‘ అని కిషన్ రెడ్డి వెల్లడించారు.- గిరిజన వర్సిటీ, పసుపు బోర్డు ఇచ్చిన మోడీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.
శంషాబాద్‌లో ప్రధానికి ఘన స్వాగతం..
మహబూబ్‌నగర్ జిల్లాలో అధికారిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నా ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డిజిపి అంజనీకుమార్‌లు విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

PM Modi 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News