ఇంఫాల్: మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలో పూల ఉత్సవాన్ని కవర్ చేస్తున్నప్పుడు ఓ టివి జర్నలిస్టుపై కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. నాగాలాండ్‌కు చెందిన హార్న్‌బిల్ టివి జర్నలిస్టు దీప్ సైకియా చంకలు, కాళ్లపై తుపాకీ గాయాలయ్యాయని వారు వివరించారు. నాగా ప్రాబల్యం ఉన్న జిల్లాలోని లై గ్రామంలో శనివారం సాయంత్రం ఈ సంఘటన జరిగిందని, సైకియా జిన్నియా పూల పండుగను కవర్ చేస్తుండగా ఇది జరిగిందని వారు తెలిపారు. అస్సాంలోని జోర్హాట్‌కు చెందిన సైకియాను మొదట సేనాపతి జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు, తర్వాత మెరుగైన చికిత్స కోసం నాగాలాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు ఎయిర్‌గన్‌తో పాటు గన్‌మ్యాన్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా జర్నలిస్టుపై దాడి వెనుక గల ఉద్దేశ్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. నాగాలాండ్ ముఖ్యమంత్రి యంతుంగో పాటన్ కొన్ని రోజలు క్రితం పాటన్ వోఖా జిల్లాలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో సైకియా రిపోర్టింగ్ తీరును తీవ్రంగా విమర్శించారు. కాగా సైకియాపై జరిగిన దాడిని హార్న్‌బిల్ టివి ఎడిటర్ డుంతోనో మెక్రో ఖండించారు. నిష్పాక్షిమైన విచారణతో నేరాన్ని నిర్ధారించాలని ఆయన కోరారు.