మనతెలంగాణ, సిటిబ్యూరోః యాప్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిలకలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు డ్రగ్స్ విక్రేతలు, ఎనిమిది మంది వినియోగదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 100 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్, పది మొబైల్ ఫోన్లు, తూనిక యంత్రం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.15,00,000 ఉంటుంది. ఈస్ట్‌జోన్ డిసిపి బాలాస్వామి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కర్నూలు జిల్లాకు చెందిన ఎం. రామకాంత్ అలియాస్ కిరణ్ చిలకలగూడలోని ఐడియల్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు, అచ్చంపేటకు చెందిన ముడావత్ ప్రసాద్ మీర్‌పేటలో ఉంటూ వ్యాక్యూమ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు ఇద్దరు కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. వీరి వద్ద ఎపిలోకి కృష్ణా జిల్లాకు చెందిన కరిచెర్ల వినయ్ కుమార్ అలియాస్ విన్ను మాదాపూర్‌లో ఉంటున్నాడు, సెక్స్ వర్కర్, సైదాబాద్‌కు చెందిన డాక్టర్ ఆతిఫ్ అబ్దుల్ సమీ మలక్‌పేటలోని ఇండో యుఎస్ ఆస్పత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్నాడు.
నల్గొండ జిల్లాకు చెందిన కొత్తపల్లి మోషా అలియాస్ మోజెస్, నగరంలోని ముషీరాబాద్‌కు చెందిన బల్లం వంశీ కృష్ణ, చౌటుప్పల్‌లో ఉంటున్న కేతవత్ రాజు నాయక్ అలియాస్ నాయక్, మిర్యాలగూడకు చెందిన షేక్ సమీర్ ఐటి రిక్రూటర్ కర్మాన్‌ఘాట్‌లో ఉంటున్నాడు, సికింద్రాబాద్, వారిసిగూడకు చెందిన అడేపు సత్య సురేష్ బాబు అలియాస్ సురేష్, మంధులా రామకాంత్ అలియాస్ కిరణ్, ముడావత్ ప్రసాద్ డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. గ్రిండర్ యాప్‌లో ఇద్దరు నిందితులు డ్రగ్స్ విక్రయిస్తున్నారు. ఇది డేటింగ్ యాప్ కావడంతో ఇందులో చాలామంది స్వలింగ సంపర్కులు ఉన్నారు, వారిలో చాలామందికి హెచ్‌ఐవి పాజిటివ్ ఉంది. యాప్‌లో నిందితులు రహస్య కోడ్‌లు ఉపయోగిస్తు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ముఠాకు నైజీరియన్ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించి అదుపులికి తీసుకున్నారు. బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ నుంచి ఇద్దరు నిందితుల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి యాప్ ద్వారా విక్రయిస్తున్నారు.
యాప్ ద్వారా డ్రగ్స్ ఆర్డర్ ఇచ్చిన వారికి ఇంటి వద్దే డెలివరీ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు ఎం. రామకాంత్ అలియాస్ కిరణ్ ఇందిరా పార్క్, సంజీవయ్య పార్క్, పరేడ్ గ్రౌండ్స్, బస్ స్టాప్‌లు వంటి బహిరంగ ప్రదేశాలకు వెళ్లేవాడు. తర్వాత గ్రిండర్ యాప్ ద్వారా స్వలింగ సంపర్కలను కలిసేవాడు. స్టామినా పెంచుకోవడానికి ఎండిఎంఏ డ్రగ్స్ వాడటం ప్రారంభించాడు. రెండేళ్ల క్రితం నుంచి డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. జూలై 2024లో ముడావత్ ప్రసాద్‌ను చిలకలగూడ పోలీసులు ఎన్‌డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత నుంచి మళ్లీ డ్రగ్స్ విక్రయించడం ప్రారంభించాడు. బెంగళూరులో ఉన్న నైజీరియన్‌ను సంప్రదించి అతడి వద్ద నుంచి ఎండిఎంఏ డ్రగ్స్‌ను గ్రాముకు రూ. 4,000 చొప్పున కొనుగోలు చేసి, ముడావత్ ప్రసాద్ సహాయంతో గ్రాముకు రూ. 7,000, 8,000 చొప్పున విక్రయిస్తున్నాడు. పోలీసులకు సమాచారం రావడంతో అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. వారు ఇచ్చిన సమాచారంతో వినియోగదారులను అదుపులోకి తీసుకున్నారు.