Thursday, May 15, 2025

పిల్లర్ నీటి గుంతలో మునిగి ఇద్దరు పిల్లలు మృతి

- Advertisement -
- Advertisement -

ఉప్పల్ హెచ్‌ఎండిఏ లేఅవుట్ (భగాయత్) ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంత ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉప్పల్ కురుమ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన పుట్టపోగుల వెంకటేష్- సుజాత భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు మణికంఠ (14), అర్జున్ (8), ఒక కుమార్తె లోకేశ్వరి (10) ఉన్నారు. ఎక్కడ పని ఉంటే అక్కడికి పిల్లలతో కలిసి అక్కడికి వెళ్లి పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. ప్రస్తుతం వీరు ఉప్పల్ మూసీ సమీపంలో బ్రిడ్జి నిర్మాణంలో ఓ కాంట్రాక్టర్ వద్ద కూలి పని చేస్తున్నారు. మంగళవారం తల్లిదండ్రులు వెంకటేష్ సుజాత పనికి వెళ్లగా ఇంట్లో ఉన్న అన్నా తమ్ముళ్లు మణికంఠ, అర్జున్ సాయంత్రం షాప్‌కు వెళ్తున్నామని సోదరి లోకేశ్వరికి చెప్పి బయటకు వెళ్లారు. కొద్ది దూరంలోనే జైన్ కమ్యూనిటీకి చెందిన ఆత్మగౌరవ భవన నిర్మాణం పిల్లర్ నీటి గుంతల వద్ద ఆగారు.

శుభ్రంగా ఉన్న నీటిని చూసి బట్టలు విప్పి ఈతకు ఉపక్రమించారు. ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యారు. సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ పరిసర ప్రాంతాలలో వెతికారు. జాడ తెలియకపోవడంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. స్పందించిన పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా పెట్రోలింగ్ వాహనంలో వెతికినా ప్రయోజనం లేకపోయింది. బుధవారం ఉదయం తల్లిదండ్రులు తిరిగి పిల్లల కోసం వెతుకుతుండగా అర్జున్ మృతదేహం నీటిలో లభ్యమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మరో బాలుడు మృతదేహం కోసం ఎల్బీనగర్ ఫైర్ స్టేషన్ అధికారి పి. శ్రీధర్ పర్యవేక్షణలో రెస్క్యూలో ఫైర్ ఎస్డిఆర్‌ఎఫ్, పోలీస్, డిఆర్‌ఎఫ్ బృందాలు విస్తృతంగా గాలించగా మణికంఠ మృతదేహం లభ్యమైంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఉప్పల్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News