Friday, May 17, 2024

సిద్దరామయ్య వల్లే కాంగ్రెస్‌ను వీడాం: మాజీ బిజెపి మంత్రులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటకలో 2019లో కాంగ్రెస్-జెడి(ఎస్ సంకీర్ణ ప్రభుత్వం నుంచి తాము వైదొలగకుండా ఆపడానికి సిద్దరామయ్య ఎటువంటి ప్రయత్నం చేయలేదని ఇద్దరు మాజీ బిజెపి మంత్రులు బుధవారం ఆరోపించారు. తదుపరి ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనున్నట్లు ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రులు కె సుధాకర్, ఎస్‌టి సోమశేఖర్ ఈ మేరకు ట్వీట్ చేశారు.

2019లో 15 మంది ఇతర ఎమ్మెల్యేలతో కలసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి ముందు సుధాకర్, సోమశేఖర్ కాంగ్రెస్‌లో ఉన్నారు. ఆ తర్వాత 2019లో 17 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో చిక్కబళ్లాపూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా సుధాకర్ ఎన్నిక కయ్యారు. బిజెపి ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా ఆయన పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుధాకర్ ఓటమి పాలయ్యారు. 2019లో కాంగ్రెస్‌ను వీడిన సోమశేఖర్ ఉప ఎన్నికల్లో యశ్వంత్‌పూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా గెలుపొంది సహకార మంత్రిగా పనిచేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఆయన గెలుపొందారు.

2018లో కాంగ్రెస్-జెడి(ఎస్) సంఈకర్ణ ప్రభుత్వానికి హెచ్‌డి కుమారస్వామి సారథ్యం వహించగా సన్వయ కమిటీ చైర్మన్‌గా సిద్దరామయ్య వ్యవహరించారు. తమ సమస్యలను సిద్దరామయ్య దృష్టికి తీసుకురాగా తన నిస్సహాయతను ఆయన వ్యక్తం చేస్తూ ప్రభుత్వంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని, తన నియోజకర్గంలోని పనులే ఆగిపోయాయని చెప్పేవారని సుధాకర్ తెలిపారు. అంతేగాక 2019 లోక్‌సభ ఎన్నికల వరకు వేచి ఉండాలని, ఎన్నికల ఫలితాల తర్వాత కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఒక్కరోజు కూడా కొనసాగేందుకు అనుమతించబోమని సిద్దరామయ్య చెప్పారని సుధాకర్ గుర్తు చేశారు.

తమ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను, మద్దతుదారులను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌ను వీడి ఉప ఎన్నికలకు తాము వెళ్లవలసి వచ్చిందని ఆయన చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వ కాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమస్యలనే సిద్దరామయ్య పట్టించుకోలేదంటూ సోమశేఖర్ విమర్శించారు. ఈ కారణం వల్లే తాము కాంగ్రెస్‌ను వీడి బిజెపి తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేయవలసి వచ్చిందని, ఇది ఎవరూ కాదనలేని వాస్తవమని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News