Tuesday, April 30, 2024

విదేశాంగ విధానం వివేకమైనదేనా?

- Advertisement -
- Advertisement -

నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర- దక్షిణ కొరియాల మధ్య యుద్ధ వాతావరణం, అందుకు కారమైన అమెరికా విధానం, తైవాన్ స్వతంత్ర దేశమంటూ చైనాకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న అమెరికా, పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడి, అందుకు అమెరికా మద్దతు, ఇరాన్ పై అమెరికా బెదిరింపులు, చైనా- అమెరికాల మధ్య వైరం, భారత్- చైనాల మధ్య సరిహద్దుల వివాదం, సైనిక ఘర్షణలు, భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ప్రజల భయానికి కారణాలుగా ఉన్నాయి. సోవియట్ యూనియన్ పతనం తర్వాత అమెరికా ప్రపంచ అగ్రరాజ్యంగా కొనసాగుతూ వచ్చింది. పుతిన్ రష్యా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆర్థిక సంక్షోభం నుండి బయటపడి అమెరికాతో పోటీకి దిగి బ్రెజ్నవ్ కాలం నాటి ఒక అగ్రరాజ్యగా మారి అమెరికాతో అనేక విషయాల్లో పోటీపడటం ప్రారంభించింది.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో భాగమే. అంతేకాకుండా ఈ యుద్ధం పెట్టుబడిదారీ దేశాల మధ్య వైరుధ్యాలను కూడా పెంచింది. మరోసారి ప్రపంచాన్ని యుద్ధ జ్వాలల భయానికి గురి చేస్తున్నది. అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో భారత దేశం ఎలాంటి పాత్ర పోషిస్తున్నది, అది దేశ ప్రయోజనాలను కాపాడుతుందా, ప్రమాదంలోకి నెడుతుందా అన్నది ప్రజలకు అవగాహన అవసరం.1947 ఆగస్టులో అధికార మార్చిడి జరిగిన తర్వాత భారత్ తొలి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ప్రమాణ స్వీకారం చేశారు. బ్రిటన్ నాయకత్వాన వున్న కామన్వెల్త్‌లో సభ్యత్వం స్వీకరించి వలస పాలకుల ఎడల విశ్వాసం ప్రకటించారు. వలస పాలకుల విదేశాంగ విధానం స్థానంలో అలీన విధానాన్ని కొనసాగిస్తానని, తూర్పు- పశ్చిమం మధ్య సమాంతరంగా విదేశాంగ విధానం ఉంటుందని, పెట్టుబడిదారీ, సోషలిస్టు ఆర్ధిక విధానాలు దేశంలో అమలు జరుపుతామని నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది.

ఆ కాలంలో అమెరికా సామ్రాజ్యవాద, ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా స్టాలిన్ నాయకత్వాన సోవియట్ యూనియన్ సోషలిస్టు ఆర్ధిక విధానాలు విజయవంతంగా అమలు జరుపుతూ ఉండడం, చైనాలో మావో నాయకత్వాన విప్లవం విజయం అంచుకు చేరటం, అనేక దేశాల ప్రజలు మార్క్సిజం, సోషలిస్టు ఆర్ధిక విధానాలకు ఆకర్షితులై తమ దేశాల్లో కూడా అలాంటి ఆర్ధిక విధానాలు అమలు జరపాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు ప్రారంభంచారు. భారత దేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు.ఈ నేపథ్యం నుండి వచ్చిందే అలీన విధానం. నెహ్రూ సోషలిస్టు ఆర్ధిక విధానాలను వ్యతిరేకించకపోవడానికి, సోవియట్ యూనియన్‌తో స్నేహంగా వుండడానికి అదే కారణంగా వున్నది. అలీన విధానం అంటేనే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించక పోవడం, సోషలిస్ట్ ఆర్ధిక విధానాలను పూర్తిగా సమర్ధించకపోవడం.

దేశ విభజన తర్వాత కశ్మీర్ ప్రధాన సమస్యగా దేశం ముందుకు వచ్చింది. ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్రం కావాలనే డిమాండ్లతో కశ్మీర్ ప్రజల పోరాట నేపథ్యంలో భారత యూనియన్‌లో హిందూ రాజు కశ్మీర్‌ను విలీనం చేశాడు. విలీనం సందర్భంగా ప్రజాభిప్రాయ నిర్ణయం ద్వారా కశ్మీర్ సమస్య పరిష్కారం చేస్తామని నెహ్రూ ప్రభుత్వం ప్రకటించింది. భారత్ -పాకిస్తాన్ మధ్య కశ్మీర్ సమస్య తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రజాభిప్రాయ సేకరణను భారత పాలకులు పక్కన పెట్టారు. పాకిస్తాన్ అత్యధికంగా అమెరికాపై ఆధారపడి దాని ఆధిపత్య ధోరణులకు మద్దతు ఇచ్చింది. 1954లో అమెరికా పాకిస్తాన్‌ను సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ (సెంట్) ఒప్పందంలో మిత్ర దేశంగా చేర్చుకుంది. పాకిస్తాన్‌ను ఎదుర్కోవడానికి సోవియట్ యూనియన్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. అమెరికా సామ్రాజ్యవాదం, ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న మార్క్సిజాన్ని చూసి తీవ్రంగా భయపడుతూ దాన్ని అడ్డుకోవడానికి నీచమైన విధానాలు అవలంబించింది.

కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాలుగా స్టాలిన్ నాయకత్వాన వున్న సోవియట్ యూనియన్, మావో నాయకత్వాన వున్న చైనాలపై ఇతర దేశాలను రెచ్చగొట్టి ఆ దేశాలతో సంబంధాలు విచ్ఛిన్నం చేయజూసింది. దాని వ్యూహంలో భాగంగా భారత చైనాల మధ్య ఏర్పడిన సరిహద్దు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం వున్నా అమెరికా దాన్ని అమలు కాకుండా చేసింది. చైనాపై నెహ్రూ ప్రభుత్వంలో శత్రుభావాన్ని సృష్టించి ఆయుధాలు సరఫరా చేస్తాను యుద్ధం చేయమని పరోక్షంగా ప్రేరేపించింది. దాని ఫలితమే 1962లో భారత -చైనా యుద్ధం. దాని పర్యవసానాలు అందరికీ తెలిసిందే. ఈ యుద్ధంలో భారత దేశాన్ని అమెరికా పూర్తిగా సమర్ధించి ఆయుధాలు సరఫరా చేయగా, స్టాలిన్ మరణం తర్వాత రాజకీయ, ఆర్థిక విధానాల్లో మార్పు చెందిన సోవియట్ యూనియన్ తటష్ట వైఖరి అంటూనే పరోక్షంగా నెహ్రూ ప్రభుత్వాన్ని సమర్ధించింది. ఈ యుద్ధానికి ముందు 1955లో నెహ్రూ సోవియట్ యూనియన్ సందర్శించడం, ఆ తర్వాత సోవియట్ పార్టీ కార్యదర్శి కృశ్చెవ్ భారత్‌లో పర్యటించడం అనే నేపథ్యం ఉంది.

అత్యధిక జనాభా గల రెండు దేశాల ప్రజల మధ్య సుదీర్ఘ కాలంగా శత్రుభావం ఏర్పడడానికి ఈ యుద్ధం కారణమైంది. భారత్- చైనా యుద్ధం తర్వాత 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ఎడల అమెరికా ద్వంద్వ వైఖరి అవలంబించుతూ పాకిస్తాన్‌కు అనుకూలంగా వ్యవహరించింది. రష్యా శాంతి దూత పాత్ర చేపట్టి తాష్కండ్‌లో సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ రెండు దేశాల మధ్య ఒప్పందం జరిగి యుద్ధం ముగిసింది. భారత్‌కు బయలుదేరడానికి సిద్ధమవుతూ లాల్ బహుదూర్ శాస్త్రి అక్కడే మరణించారు. శాస్త్రి తర్వాత ఇందిరా గాంధీ ప్రధాని పదవి చేపట్టారు. ఆమె పాలనలో రష్యాతో అనేక సైనిక ఒప్పందాలు జరిగాయి. 1969లో రష్యా సోషల్ సామ్రాజ్యవాదంగా మారింది. 1970లో ఇండియా -సోవియట్ మధ్య జరిగిన స్నేహ, సహకార ఒప్పందం చాలా ముఖ్యమైనది. ఈ ఒప్పందం ద్వారా ఈ రెండు దేశాల్లో ఆంతరంగిక సంక్షోభాలను, విదేశీ దురాక్రమణలను సంయుక్తంగా ఎదుర్కోవడం ఈ ఒప్పందం ముఖ్యలక్ష్యం.

ఈ ఒప్పందం జరిగిన తర్వాత పాకిస్తాన్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తూర్పు పాకిస్తాన్‌లో ప్రత్యేక దేశం కోసం ముజిఫర్ రహమాన్ నాయకత్వాన ఆంతరంగిక తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ పోరాటానికి ఇందిరా గాంధీ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. తూర్పు పాకిస్తాన్ నుంచి భారత దేశంలోకి శరణార్ధులు రావడం సమస్యగా మారిందనే పేరుతో తిరుగుబాటుకు మద్దతుగా ఇందిరా గాంధీ భారత సైన్యాలను పంపింది. రష్యా అందుకు పూర్తి మద్దతు ప్రకటించింది. పాకిస్తాన్‌కు మద్దతుగా అమెరికా 7వ నౌకాదళాన్ని, బ్రిటన్ ఈగెల్‌ను సముద్ర జలాల్లోకి పంపాయి. అందుకు వ్యతిరేకంగా రష్యా యుద్ధ నౌకలు ప్రవేశించాయి. యుద్ధంలో పాకిస్తాన్ ఓడిన ఫలితంగా 1971లో బంగ్లాదేశ్ ఎర్పడింది. పాకిస్తాన్‌లో ఏర్పడిన ఆంతరంగిక సమస్యను ఆ దేశ ప్రజలు పరిష్కరించుకోవాలి. ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో భారత్ జోక్యం అంతర్జాతీయ నియమాలకు విరుద్ధమని అనేక దేశాలు పేర్కొన్నాయి.

ఈ యుద్ధం సోవియట్ సోషల్ సామ్రాజ్యవాదుల ప్రపంచ ఆధిపత్య ధోరణులను, భారత పాలకుల ప్రాంతీయ ఆధిపత్య విధానాలను తెలియచేసింది. కలసి మెలసి వుండాల్సిన రెండు దేశాల ప్రజల మధ్య శత్రుపూరిత విద్వేసాలు నేటికీ కొనసాగడానికి కారణమైంది. ఈ యుద్ధం సోషల్ సామ్రాజ్యవాదుల ప్రపంచ ఆధిపత్య విధానాలకు, భారత పాలకులు ప్రాంతీయ ఆధిపత్య ధోరణుల ఆకాంక్షను తెలియ చేసింది. 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత రాజీవ్ గాంధీ పాలనలోనూ సోవియట్‌తో సత్సంబంధాలు కొనసాగాయి. 1986లో రాజీవ్ గాంధీ గోర్బచేవ్‌ను కలసినప్పుడు ఆసియా సామూహిక భద్రతా ఏర్పాటు ప్రతిపాదన వచ్చింది. రాజీవ్ గాంధీ సరళీకరణ ఆర్థిక విధాల వైపు మొగ్గుచూపుతూ అమెరికాతో సంబంధాలు మరింత మెరుగుపర్చుకున్నారు. 1991లో రష్యా వివిధ దేశాలుగా విడిపోయిన కాలంలో పివి నరసింహరావు ప్రభుత్వం అమెరికా వైపు మొగ్గు చూపుతూనే, రష్యాతో సంబంధాలు కొనసాగాయి.

అనేక ఒప్పందాలు కూడా జరిగాయి. ప్రతి దేశం తన దేశ రక్షణకు కావాల్సిన చర్యలు తీసుకుంటుంది. భారత దేశం కూడా తీసుకోవాలి. రక్షణ అనేది స్వయం శక్తిపై ఆధారపడి ఉండాలి. ఏదో ఒక అగ్రరాజ్యంపై దేశ రక్షణ ఆధారపడకూడదు. భారత్ పాలకులు దేశ రక్షణ విషయంలో అలాంటి విధానాలు అవలంబించడం లేదు. వివిధ దేశాలతో ఉన్న సరిహద్దుల సమస్యలను సామరస్య పూర్వకంగా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో పరిష్కారం చేసుకోవాలి. అగ్ర రాజ్యాలతో రక్షణ ఒప్పందాలు దేశానికి, ప్రజలకు ప్రమాదం. అలాంటి రక్షణ ఒప్పందాలను రద్దు చేసుకోవాలి. అలాంటి విధానాలే దేశ, ప్రజల రక్షణకు పునాది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News