*బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రభుత్వం యోచన
మన తెలంగాణ / హైదరాబాద్ : రానున్న బడ్జెట్‌లో నిరుద్యోగులకు ప్రతి నెలా ‘భృతి’ సమకూర్చే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఒకవైపు ఉపాధి అవకాశాలను కల్పించడంపై దృష్టి పెడుతూనే.. అవి వారికి అందేంత వరకు ప్రతి నెలా భృతిని చెల్లించడంపై కసరత్తు చేసి వివరాలతో కూడిన నివేదికను సమర్పించాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులకు సిఎం సూచించినట్లు తెలిసింది. ఇటీవల బడ్జెట్‌కు సంబంధించి అధికారులతో జరిగిన సమీక్ష సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. నిరుద్యోగులకు స్పష్టమైన నిర్వచనం ఇవ్వడంతో పాటు వారిని గుర్తించడానికి అవసరమైన మార్గదర్శకాలను, విధివిధానాలను రూపొందించడంపై ముసాయిదాను తయారుచేయాల్సిందిగా సూచించినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు, వారికి ప్రతీ నెలా ఎంత వరకు భృతి ఇవ్వవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది తదితరాలన్నింటినీ ఆ నివేదికలో పొందుపర్చాల్సిందిగా సూచించినట్లు సమాచారం. ప్రస్తుతానికి ఈ ఆలోచన ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. అన్ని సెక్షన్ల ప్రజలను ఏదో ఒక పథకం రూపంలో ప్రభుత్వం చేరువైనా నిరుద్యోగుల విషయంలో ఉన్న అసంతృప్తిని తొలగించే ఉద్దేశంతో ‘భృతి’ రూపంలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. అన్ని జిల్లాల నుంచి వివరాలు తెప్పించుకోవడంతో పాటు సమగ్ర కుటుంబ సర్వేలోని వివరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావిస్తోంది. చదువుతో పాటు వయసును కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రైవేటు కంపెనీలతో సహా ఎక్కడా ఏ పనీ చేయకుండా ఉండడం, ‘పే రోల్స్’, ప్రావిడెంట్ ఫండ్ లాంటివాటిల్లో పేర్లు నమోదు కాకుండా ఉండడం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో లబ్ధి పొందకుండా ఉండడం… ఇలా కొన్ని అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్రం మొత్తం మీద సుమారు పదిహేను లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనా వేస్తున్న అధికారులు నెలకు రెండు వేల రూపాయల చొప్పున భృతి కల్పించినట్లయితే ప్రతీ నెలా ప్రభుత్వంపై సుమారు రూ. 3000 కోట్ల మేరకు భారం పడవచ్చని ప్రాథమిక అంచనా. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నెలకు రూ. 3000 చొప్పున నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. ఆ పార్టీకి హామీకి తగ్గకుండా ఉండాలని అధికార పార్టీ భావించినట్లయితే ఈ భారం మరో రూ. 1500 కోట్ల మేరకు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్ తయారీ పనులు దాదాపు ప్రారంభమైన నేపథ్యంలో తుదిరూపు ఇవ్వడానికి ముందుగానే దీనిపై ప్రభుత్వం ఒక స్పష్టతకు వచ్చి ఆ మేరకు నిధుల కేటాయింపు చేయాలని భావిస్తోంది. ఎలాగూ రానున్నది ‘సంక్షేమ బడ్జెట్’ అని స్వయంగా ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించినందున నిరుద్యోగ భృతికి కూడా చోటు లభించే అవకాశం ఉంది.