Saturday, April 20, 2024

కోర్టు రూమ్‌గా మారిన యుపి అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ఒక ఎంఎల్‌ఎ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆరుగురు పోలీసులకు ఒక రోజు జైలు శిక్ష విధించింది. దీనికోసం అసెంబ్లీ కోర్టు రూమ్‌గా మారింది. 2004 సెప్టెంబర్ 15న విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా కాన్పూర్‌లో నిరసనలు జరిగాయి. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించే బృందానికి బిజెపి ఎంఎల్‌ఎ సలీల్ విష్ణోయ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. దీంతో శాసన సభ తనకు కల్పించిన హక్కులకు భంగం కలిగించారంటూ ఆయన అసెంబ్లీలో ఫిర్యాదు చేశారు. కాగా దాదాపు రెండు దశాబ్దాల తర్వాత యుపి అసెంబ్లీ ఆయన ఫిర్యాదుపై చర్యలు చేపట్టింది. సోమవారం ప్రివిలేజ్ కమిటీ సమావేశమై విష్ణోయ్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు శిక్ష విధించాలని నిర్ణయించింది.

దీంతో నాడు కాన్పూర్ నగర్ పోలీసు స్టేషన్‌లో సిఐగా ఉండి ప్రస్తుతం రిటైరయిన అబ్దుల్ సమద్, నాటి కిద్వాయ్ నగర్ ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ శుక్లా, నాడు ఎస్‌ఐగా ఉన్న త్రిలోక్ సింగ్, కానిస్టేబుళ్లు చోటే సింగ్, వినోద్‌మిశ్రా, మెహర్బన్ సింగ్‌లకు సమన్లు పంపించారు. మరో వైపు ప్రిfrలేజ్ కమిటీ సిఫార్సు చేసిన శిక్షలను అమలు చేయడానికి శుక్రవారం అసెంబ్లీ కోర్టుగా మారింది. ఎంఎల్‌ఎ విష్ణోయ్‌పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఆరుగురు పోలీసులకు ఒక రోజు శిక్ష విధించే తీర్మానాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి సురేశ్ ఖన్నా ప్రవేశ పెట్టగా, స్పీకర్ సతీష్ మహానా తీర్పును ప్రకటించారు. అసెంబ్లీకి హాజరయిన ఆరుగురు పోలీసులు నాటి ఘటనపై విచారం వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కోర్టులో ముద్దాయిలను బోనులో నిలబెట్టిన విధంగా ఆరుగురు పోలీసులను వరసగా నిలబెట్టారు. శిక్షలో భాగంగా ఆ ఆరుగురు పోలీసులను అసెంబ్లీలోని ఓ గదిలో శుక్రవారం అర్ధరాత్రిదాకా ఉంచారు. వారికి ఆహారం, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News