Friday, April 26, 2024

పట్టణ జనం: ప్రైవేటు భారం

- Advertisement -
- Advertisement -

స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల కారణంగా మౌలిక సదుపాయాల మీద చేస్తున్న ఖర్చు నానాటికీ తగ్గుతున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు నిధుల బదలాయింపు పెరిగినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల మొత్తం రాబడి 201118లో జిడిపిలో ఒక శాతం లోపుగానే ఉంది. స్వంత వనరుల రాబడి తక్కువగా, నానాటికీ తగ్గుతున్నది, దానికి సేవలకు వసూలు చేస్తున్న మొత్తాలు తక్కువ. స్వంత వనరుల రాబడి (ఒఎస్‌ఆర్)లో ఇంటి పన్ను అతి పెద్ద భాగమైనా తోటి దేశాలతో చూస్తే చాలా తక్కువ, ఈ మొత్తం జిడిపిలో 0.15 శాతం కాగా మధ్య తరహా ఆదాయ దేశాల్లో 0.3 నుంచి 0.6 శాతం వరకు ఉంది.

రానున్న పదిహేను సంవత్సరాలలో (20212036) మన దేశంలోని పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పనకు 840 బిలియన్ డాలర్లు (2020 ధరల ప్రకారం (రూపాయి విలువ 73 చొప్పున) లేదా రూ. 61.4 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని ప్రపంచ బాంకు అధ్యయనం సిఫార్సు చేసింది. ఇది జిడిపిలో 1.18 శాతానికి సమానం. గత దశాబ్దిలో జిడిపిలో 0.6 శాతం ఖర్చు చేశారు. నవంబరు 14న ఈ నివేదికతో పాటు ఒక ప్రకటనను ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు వివిధ దేశాల మీద నివేదికలను రూపొందించేందుకు కొందరిని ఎంపిక చేస్తుంది. వాటిని తనవిగా చెప్పుకోదు. దీనికి కూడా అదే చెప్పింది. దేశాలు రుణాలు, ఇతర అవసరాల కోసం వచ్చినపుడు సూచనల పేరుతో వాటిని రుద్దుతుంది. ప్రభుత్వాలు వాటిని తమ విధానాలుగా ముద్ర వేసి అమలు చేస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సిఎంగా ఉండగా జరిగింది అదే. తాజా నివేదికను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఏమి చేస్తాయో చూడాల్సి ఉంది. పారిశ్రామిక పెట్టుబడుల నుంచి పూర్తిగానూ, సేవా రంగాల నుంచి పాక్షికంగా గత మూడు దశాబ్దాలుగా తప్పుకుంటున్న ప్రభుత్వాలు ప్రైవేటు పెట్టుబడుల మీదే ఆధారపడి అందుకు అనువుగా విధానాలను రూపొందిస్తున్నాయి.

ఈ నివేదికను కూడా అదే విధంగా రుద్దే అవకాశం ఉంది. ప్రపంచ బ్యాంకులోని ధనిక దేశాల్లో ఉండే పెట్టుబడి సంస్థలకు మార్కెట్ అవసరం, అందునా మన దేశం పెద్దదిగా ఉండటం, సంస్కరణలను వేగంగా అమలు జరుపుతానని ప్రధాని నరేంద్ర మోడీ 2014 నుంచి చెప్పటం, ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయకుండా (లాభాలు వస్తున్న విశాఖ ఉక్కును అమ్మేస్తామని పదే పదే చెప్పటం అందుకు చక్కటి ఉదాహరణ) కొన్ని రంగాల్లో అమలు జరుపుతున్న పూర్వరంగంలో ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని పట్టణ స్థానిక సంస్థల తీరుతెన్నుల గురించి నివేదికలో పేర్కొన్న అంశాల సారాంశం ఇలా ఉంది. 2021లో 47 కోట్లుగా ఉన్న పట్టణ జనాభా 2036 నాటికి 60 కోట్లకు, మొత్తం జనాభాలో 40 శాతానికి పెరుగుతుంది.

840 బిలియన్ డాలర్ల అంచనాలో నీటి సరఫరా, వర్షపు నీరు, మురుగునీటి పారుదల, చెత్త యాజమాన్యం, రోడ్లు, వీధి దీపాలకు గాను 450 బి.డాలర్లు, రవాణా సదుపాయాలకు 300 బి. డాలర్లు అవసరమవుతాయని అంచనా.గతంలో కేంద్ర ప్రభుత్వం 2012 నుంచి 2032 వరకు 20 సంవత్సరాల్లో మౌలిక వసతులు, సేవల కల్పనకు 560 బిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరమని అంచనా వేసింది. మెకెన్సీ నివేదిక ప్రకారం 2000 14 సంవత్సరాలలో చైనా జిడిపిలో 2.8 శాతం చేసింది. ఒక అంచనా ప్రకారం 2010లో తలసరి 116 డాలర్లు ఖర్చు చేసింది. చైనా మాదిరి పట్టణీకరణకు ఇతర దేశాల్లో జిడిపిలో నాలుగు శాతం ఖర్చు పెట్టాలని ప్రపంచ బాంకు చెప్పింది.గత దశాబ్దిలో సగటున ఏటా 10.6 బి.డాలర్లు మాత్రమే భారత్‌లో పెట్టుబడులు పెట్టారు.

స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల కారణంగా మౌలిక సదుపాయాల మీద చేస్తున్న ఖర్చు నానాటికీ తగ్గుతున్నది. ఆర్థిక సంఘాల సిఫార్సుల మేరకు నిధుల బదలాయింపు పెరిగినప్పటికీ పట్టణ స్థానిక సంస్థల మొత్తం రాబడి 201118లో జిడిపిలో ఒక శాతం లోపుగానే ఉంది. స్వంత వనరుల రాబడి తక్కువగా, నానాటికీ తగ్గుతున్నది, దానికి సేవలకు వసూలు చేస్తున్న మొత్తాలు తక్కువ.

స్వంత వనరుల రాబడి (ఒఎస్‌ఆర్)లో ఇంటి పన్ను అతి పెద్ద భాగమైనా తోటి దేశాలతో చూస్తే చాలా తక్కువ, ఈ మొత్తం జిడిపిలో 0.15 శాతం కాగా మధ్య తరహా ఆదాయ దేశాల్లో 0.3 నుంచి 0.6 శాతం వరకు ఉంది. ఓయిసిడి దేశాల్లో 1.1 శాతం, అమెరికా, కెనడా, బ్రిటన్‌లో 23 శాతం వరకు ఉంది. అనేక దేశాల్లో ఇతర పన్నుల కంటే ఆస్తి పన్ను వేగంగా పెరుగుతోంది. నిర్వహణ ఖర్చుల కంటే కూడా సేవా రుసుములు తక్కువగా ఉండటానికి విధానపరమైన నిర్ణయాలే కారణం. కొన్ని పెద్ద పట్టణాలతో సహా నీరు, మురుగునీటి పారుదల రుసుము వసూలు ఖర్చులో సగం కూడా లేదు. ఇటీవలి సంవత్సరాలలో మూడింట రెండు వంతులు మాత్రమే బడ్జెట్ కేటాయింపులలో మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తున్నారు. స్మార్ట్ సిటీస్, అమృత్ పథకాల కింద ఆమోదించిన మొత్తాలలో కేవలం ఐదో వంతు మాత్రమే గడచిన ఆరు సంవత్సరాల్లో ఖర్చు చేశారు.

విధానపరమైన, రాజకీయ, ఆర్ధిక విధాన నిర్ణయాలు రాబడి స్థాయిలను ఆచరణను ప్రభావితం చేస్తున్నాయి. ప్రైవేటు పెట్టుబడులకు ఇవి ఆటంకంగా ఉన్నాయి. భారీ పెట్టుబడులను ఇముడ్చుకోగల స్థితి లేదు. అవసరమైన పెట్టుబడులకు ప్రోత్సాహకాలతో పాటు తిరిగి చెల్లించే విధంగా పన్నులు, వినియోగ చార్జీలను పెంచాల్సి ఉంది. వీటన్నింటికీ ద్రవ్య, సంస్థాపరమైన ప్రాథమికంగా ఆటంకంగా ఉన్నాయి. వీటిని తొలగించటానికి వ్యవస్థాగతమైన సంస్కరణలు తేవాలి. అది ఎంతో కష్టం ఎందుకంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. భారత పూర్వపరాలను చూసినపుడు ఇది పెద్ద సవాలుగా ఉంటుందని రుజువైంది. కొన్ని నగరాల్లోనైనా స్వల్ప, మధ్య కాల ప్రైవేటు వాణిజ్య పెట్టుబడులకు అవకాశం కల్పించేందుకు పూనుకోవాలి.

భారత్‌లో పట్టణాల మౌలిక సదుపాయాలకు అవసరమైన పెట్టుబడుల్లో కేవలం ఐదు శాతమే ప్రైవేటు పెట్టుబడులు సమకూరుతున్నాయి. గుజరాత్‌లో కేవలం ఒక శాతమే ఉండగా తమిళనాడులో 12 శాతం ఉన్నాయి. ఇవి కూడా ప్రభుత్వ సంస్థల నుంచి తీసుకున్నవే. పదిహేనవ ఆర్థిక సంఘ సిఫార్సుల మేరకు 2025 నాటికి జిడిపిలో 0.32 శాతం షరతులు లేని మొత్తాలను పట్టణ సంస్థలకు ఇవ్వాలి. చక్కగా రూపొందించిన షరతులతో కూడిన మొత్తాలతో కూడా ఫలితాలను మెరుగుపరచవచ్చు. కేంద్రం, రాష్ట్రాల స్థాయి లో మరింత స్థిరమైన, సూత్రాలతో కూడిన, షరతులు లేని నిధుల బదలాయింపు పద్ధతిని పాటించాలి. ప్రస్తుతం సగం నిధులు షరతులతో కూడిన నిధుల బదలాయింపు జరుగుతోంది. పట్టణాల్లో ద్రవ్య పునాది విస్తరణ, రుణ యోగ్యత పెంపుదలకు రాబడి ఆటంకాలను తొలగించాలి.

ప్రస్తుతం తక్కువగా ఉన్న ఆస్తి పన్ను, వినియోగ, సేవా రుసుములను గణనీయంగా పెంచాలి. గణనీయంగా వాణిజ్య రుణాలు తీసుకొనే విధంగా స్వంత వనరులు ప్రతి ఐదు సంవత్సరాలకు రెట్టింపు పెరిగే విధంగా పెంపుదల ఉండాలి. పైన పేర్కొన్న అంశాలన్నీ ప్రపంచ నివేదికలో పేర్కొన్నవే. ఈ సిఫార్సుల సారం ఒక్కటే. పట్టణాలలో మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులను వాణిజ్య సంస్థల నుంచి తీసుకోవాలి. వాటిని తీర్చేందుకు వీలుగా పట్టణ స్థానిక సంస్థలకు రాబడి వనరుల పెంపుదల, అందుకోసం జనం నుంచి వసూలు చేసేందుకు అవసరమైన సంస్కరణలను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు చేపట్టాలి. ఈ నివేదికను తు.చ తప్పక అమలు జరిపితే ఎన్నో రెట్ల భారం పౌరుల మీద పడుతుంది. రాజును చూసిన కళ్లతో అన్నట్లుగా ధనిక దేశాలను చూసి అక్కడి మాదిరి మన దేశంలో కూడా అమలు జరపాలని ప్రపంచ బ్యాంకు బృందం చెప్పింది. అక్కడి మాదిరి మన దేశంలో కూడా జనాలకు రాబడి ఉంటే ఇప్పటికంటే ఎక్కువ మొత్తాలను సేవలకు చెల్లించేందుకు ఇబ్బంది ఉండదు. తమ ఇండ్ల మీద హెలికాప్టర్లు దిగేందుకు అవసరమైన సౌకర్యాలను సమకూర్చుకుంటున్న అపర కుబేరులు ఒక వైపు ఉంటే వారి పక్కనే ఉండే మురికి వాడల్లో ఎండకు, వానకు రక్షణగా ప్లాస్టిక్ షీట్లను అమర్చుకొనే పేదరికం మరొక వైపు కనిపిస్తున్నది. మన దేశంలోని పట్టణాల్లో ఈ తేడా మరింత స్పష్టంగా కనిపిస్తున్నది.

అనేక దేశాల్లో ధనికుల మీద మన కంటే ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నారు. మన దేశంలో వారికి అనేక రాయితీలు ఇస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టణాల్లో ఇంటి పన్ను పెంచారు. ఎవరి చెత్తను వారు తొలగించేందుకు చెత్త పన్ను విధించారు. అదెక్కడా పన్ను రూపంలో కనిపించదు, చెత్త సేకరణకు వచ్చే వారికి ఇచ్చే మొత్తాలుగా ఉంటాయి. త్వరలో గ్రామాలకూ దీన్ని వర్తింపచేయాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. పట్టణీకరణ వేగంగా పెరుగుతున్న కారణంగా మౌలిక సదుపాయాలపై వత్తిడి, కొరత ఏర్పడుతున్నది. వాటిని ఉపేక్షిస్తే మరిన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ నివేదికలో 2021 నుంచి అమలు జరపాలని చెప్పటాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి ముందే అందచేసి ఉండాలి.

ఇప్పటికే రెండు సంవత్సరాలు గడిచాయి. 2024లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల ముందు కేంద్రంలో, మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బిజెపి పట్టణ జనాభా మీద విపరీత భారాలను మోపి ఓట్లడిగే సాహసానికి పూనుకోదన్నది స్పష్టం. అందువలన ఎన్నికల తరువాత వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏదైనా భారాల బండను జనం మీద మోపటం ఖాయమని చెప్పవచ్చు. 2020 సంవత్సర ధరల ఆధారంగా ఖర్చు అంచనా వేశారు. రూపాయి విలువ 73 నుంచి 82కు పతనం కావటం, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరిస్తే 840 బి.డాలర్లు లేదా రూ. 61 లక్షల కోట్ల అంచనా ఇంకా ఎంత పెరుగుతుందో చెప్పలేము.

ఎం కోటేశ్వరరావు
8331013288

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News