రాష్ట్రానికి చేరని 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా
కేంద్రం, రాష్ట్రం మధ్య లేఖల, మాటల యుద్దం
పార్లమెంటులో అబద్ధ్దాలు చెప్పారన్న మంత్రి తుమ్మల
ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందన్న బిజెపి అధ్యక్షుడు రామచంద్రరావు
రైతుల్లో పెరుగుతున్న యూరియా నైరాశ్యం
కేంద్ర మంత్రులు జెపి నడ్డా, అనుప్రియ పటేల్‌కు లేఖలు రాసిన రాష్ట్ర ప్రభుత్వం
మన తెలంగాణ / హైదరాబాద్ : కేంద్ర, రాష్ట్రాల మధ్య యూరియా సరఫరా అంశం రాజకీయం క్రీడగా మారుతోంది. కేటాయింపుల మేరకు యూరియాను సరఫరా చేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం ఆక్షేపిస్తుండగా, ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. వాస్తవానికిడ రాష్ట్రాలకు యూరియా కేటాయింపులు చేస్తూ గత ఫిబ్రవరి 17వ తేదీన కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది. రాష్ట్రాలకు ఖరీఫ్ సీజన్ కోసం యూరియా, డిఎపి, ఎంవోపి, కాంప్లెక్స్, ఎస్‌ఎస్‌పి సరఫరాల కోసం కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఐదు జోన్లుగా విభజించింది. వాటిల్లో సౌత్ జోన్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ ఉన్నాయి. యూరియా కేటాయింపులు జరిగిన సౌత్ జోన్ రాష్ట్రాల్లో అత్యధికంగా కర్నాటక 1,117.00 టన్నుల కేటాయింపులు ఉండగా, రెండో స్థానంలో తెలంగాణ 980.00 టన్నుల కేటాయింపులున్నాయి. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 622.00 టన్నుల వరకు ఉంది. డిఎపి కేటాయింపుల్లో మాత్రం తెలంగాణ 240.00 టన్నులతో మూడో స్థానంలో ఉంది. కాంప్లెక్స్ వాడకంలో, ఎస్‌ఎస్‌పి వాడకంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
రాష్ట్రంలో వానాకాలం(ఖరీఫ్) సాగు పంటలకు రైతాంగం ఎక్కువగా యూరియా వినియోగించడం పరిపాటి. యూరియా కొతర కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దక్షణాది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. యూరియా కేటాయింపులు, సరఫరాల మధ్య అంతరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రానికి లేఖలు రాసింది.
ప్రస్తుత వానాకాలం(ఖరీఫ్) సీజన్ కోసం రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ఏడాది ఎప్రిల్ నుంచి జులై వరకు కేంద్ర ప్రభుత్వ కేటాయింపుల ప్రకారం 6.60 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా జరగాల్సి ఉంది. కానీ, కేంద్ర ప్రభుత్వం 4.36 లక్షల మెట్రిక్ టన్నులు వరకు యూరియాను సరఫరా చేసింది. జులై నెల వరకు కేటాయింపుల ప్రకారం సరఫరా కాని 2.24 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కలుపుకొని, ఆగస్టు నెల కోటాతో కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది.
యూరియా కేటాయింపులు, సరఫరా అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనూ ప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఆక్షేపించారు. ప్రజాస్వామ్య వేదిక పార్లమెంట్ లో కూడా కేంద్రం తప్పుడు లెక్కలు సమర్పించడం రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీయడమేనని ఆయన అన్నారు. రాష్ట్రానికి 9.80 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించి, పార్లమెంట్ లో మాత్రం 20.20 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో యూరియా కొరత అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జెపి నడ్డా కు లేఖ రాశారు. ఇటీవల ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రి తుమ్మల కేంద్ర మంత్రులు జెపి నడ్డా, నిర్మాలా సీతారామన్ లను స్వయంగా కలుసుకుని యూరియా కొరత అంశాన్ని వారి దృష్టికి తీసుకువచ్చారు.