Thursday, April 18, 2024

సాగునీటి రంగం సర్వనాశనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం తప్ప మిగతా నేతలందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, తమ పాలన చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీ డియాతో మాట్లాడుతూ నల్గొండ లోక్‌సభ ఎన్నిక ల్లో బిఆర్‌ఎస్, బిజెపిలకు డిపాజిట్ కూడా రాదన్నారు. 14 ఎంపి సీట్లు తప్పకుండా గెలుస్తామని ఆ యన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ తర్వాత అర్హులైన వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లను వదిలే ప్రసక్తి లేదని, వంద శాతం తన ఫో న్ కూడా ట్యాప్ చేశారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ట్యాపింగ్ వెనక ఎంత పెద్ద నాయకులు ఉన్నా శిక్ష పడుతుందన్నారు. కూతురు కవిత ఒక కేసులో ఇరుక్కుపోయిందని, గొర్రెల స్కాంలో కొం దరు ఇరుక్కుపోయారని, ఇక ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఇరుకుతారోనని బిఆర్‌ఎస్ వాళ్లకు భ యంగా ఉందన్నారు. రూ. 40 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని, తెలంగాణలో తాగునీటి స మస్య, కరెంట్ సమస్య లేదన్నారు. కెసిఆర్ మాదిరిగా ఫాంహౌజ్‌లో పండుకునే అలవాటు తమకు లేదన్నారు.

ప్రతి రోజు సచివాలయానికి వస్తున్నామని, ప్రతి సమస్యపై వారం, పదిరోజులకొకసారి సమీక్ష చేస్తున్నామన్నారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు దబాయింపు చేశారని, బిఆర్‌ఎస్‌కు మళ్లీ అధికారం కల్ల అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యా ఖ్యానించారు.కెసిఆర్ ఆదివారం మీడియాతో మా ట్లాడిన ప్రతి మాట అబద్దమే అని, ఆయన డిప్రెషన్, ఫస్ట్రేషన్‌లో ఉన్నారంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మాజీ సిఎం అబద్ధాలు చెప్పడాన్ని ప్రజలు గమనించాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఆదివారం కెసిఆర్ స్పీచ్ విన్నాక ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడుతున్నారని అనిపించిందన్నారు. ఓడిపోవడమే కాదు, పార్టీ మిగలదన్న భయం కెసిఆర్‌లో మొదలైందన్నారు. పొంకనాలకు పోయి జాతీయ పార్టీ అన్నారని, ఇంత తొందరగా ఏ పార్టీ కుప్ప కూలిపోలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిఆర్‌ఎస్ మిగలదన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు ఔట్ డేటెడ్ టెక్నాలజీ అని భద్రాద్రి పవర్ ప్రాజెక్టు వల్ల ప్రజలకే భారమన్నారు.

ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం
రాష్ట్రంలో ఒక్క నిమిషం కూడా పవర్ పోవడం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 24 గంటల విద్యుత్ సరఫరా చేసేందుకు ఖర్చు గురించి ఆలోచించడం లేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్టీపిసికి సహకారం అందించలేదని ఆయన ఆరోపించారు. ఎన్టీపిసికి సహకరించి ఉంటే 4,000ల మెగావాట్ల విద్యుత్ ఉచితంగా వచ్చేదన్నారు. కరెంట్ విషయంలో గులాబీ పార్టీ ఏదో గొప్పలు సాధించామని చెప్పడం అబద్ధమని మంత్రి విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఒక్కో ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.

కెసిఆర్‌కు ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత ఉందా?
కెసిఆర్‌కు ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ నీటి పారుదల రంగాన్ని సర్వనాశనం చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కమీషన్ల కోసం ప్లాన్, డిజైన్లు లేకుండా ప్రాజెక్టులు నిర్మించారన్నారు. కాళేశ్వరం గురించి కెసిఆర్ మాట్లాడేందుకు సిగ్గుపడాలన్నారు. బిఆర్‌ఎస్ కట్టిన ప్రాజెక్టు ఆ పార్టీ హయాంలోనే కూలిపోయిందన్నారు. ఒక్క పిల్లరే కదా కుంగిందని కెసిఆర్ అంటున్నారని, అమెరికాలో బ్యారేజీ కుంగలేదా అని కెసిఆర్ ఎదురు ప్రశ్నిస్తున్నారని, కాళేశ్వరం కోసం విద్యుత్ ఖర్చే ఏడాదికి రూ.10,000ల కోట్లు అవుతుందని, ప్రాజెక్టును కెఆర్‌ఎంబికి అప్పగించేందుకు కెసిఆర్ ఒప్పుకున్నారని మంత్రి- ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

మిషన్ భగీరథ ఫెయిల్
వర్షాలు తక్కువ పడడంతో ప్రాజెక్టుల్లో నీళ్లు తక్కువ ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ కోసం గత ప్రభుత్వం రూ.45,000ల కోట్ల అప్పులు తెచ్చారని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. మిషన్ భగీరథ మొత్తం ఫెయిల్ అయిందని ఆయన విమర్శించారు. అది కమీషన్ల భగీరథగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. కెసిఆర్, జగన్ దోస్తీ వల్ల ఎపి అక్రమంగా రోజుకు 10 టిఎంసీలు తరలించిందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ రోజూ నీళ్లు తరలిస్తున్నా కెసిఆర్ మాట్లాడలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆనాడు నోరు మెదపని ఆయన, ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కెసిఆర్, జగన్ కలిసి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై కుట్ర చేశారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు పంట బీమా ఇవ్వలేదన్నారు. దేశంలోనే పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆయన చెప్పారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చాక పంట బీమాను రద్దు చేశారని, గులాబీ పార్టీ హయాంలో పంట నష్టం జరిగితే పంట బీమా ఇవ్వలేదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News