Tuesday, January 31, 2023

ఇంట గెలిస్తేనే విశ్వగురువు

- Advertisement -

‘The Vishwaguru, at its most useful, is a MEDIATOR. The world is wracked with conflicts: Russia versus the West, North versus South. The Vishwaguru is above all conflict, and is therefore the ideal mediator, the non-aligned that aligns the world, the swing state that stabilises it, the bridging power that unites it. Its own conflicts don’t need mediators, since the Vishwaguru is mediation itself. In a world wracked by great power hypocrisy, the mediator stands for the common good ‘.
–Pratap Bhanu Mehatha
Indian political scientist
గత ఏడెనిమిదేండ్లుగా భారతీయ రాజకీయ పరిభాషలో తరుచూ వినిపిస్తున్న పదం విశ్వగురువు. అంటే యావత్ప్రపంచానికి అన్నివిషయాల్లో దిశానిర్దేశం చేయగల ప్రభావశీల దేశంగా ఏకైక క్రియాశీల శక్తికి పర్యాయ పదం విశ్వగురువు. ప్రధానమంత్రి మొదలు ఇతర ప్రభుత్వపెద్దల నోట వినపడుతున్నమాట భారత్ విశ్వగురు స్థానంలో వెలుగొందడం. అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించి 2047కల్లా అంతర్జాతీయంగా అనుసరణనీయ దిక్సూచిగా దేశం ఎదగాలని కోరుకోవడంలో కించిత్ పునరాలోచన భారతీయులెవరికీ ఉండదు, ఉండరాదు.ఎందుకంటే వందల ఏండ్లు బానిసత్వంలో మగ్గి, మహోజ్వల స్వాతంత్య్ర పోరాటంలో నెగ్గి పారతంత్య్రం నుంచి బయటపడ్డాం.

ఆశయాల పునాదుల మీద స్వంత రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎనమిదో దశకానికి చేరుకున్నాం. అయితే, స్వావలంబన, సుస్థిరతల్లో ఇంకా తన్లాడుతూనేవున్నాం. వెనకటికి మన తాతలు తండ్రులు ఆరుగాలం కష్టించి పండిన ధాన్యాన్నంతా దొరలకూ షావుకార్లకూ కొలిచినట్టు, ఇప్పుడు ప్రపంచ పరపతి సంస్థల్లో తెచ్చిన అప్పులకు సామాన్యుల శ్రమనంతా వడ్డీగా ధారపోస్తున్నాం. డాలర్ ముందు రూపాయి విలువ నానాటికీ పతనం అవుతోంది. పేదల వలసలు నగరాలకు, పెద్దోల్ల మేధోవలసలు విదేశాలకూ ఉద్ధృతమైనాయి. బ్యాంకులు విస్తరించి, ఖాతాదారుల సంఖ్య లావాదేవీల ప్రవాహం పెరిగిన మాట వాస్తవమే కానీ ఆర్థిక అసమానతలు అంతరాలు పెను ముప్పుగా పరిణమించిందీ నిజమే.

ఇటీవల వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన సమ్మిళితాభివృద్ధి సూచీలో 79 అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో మన దేశం 60వ స్థానంలో ఉంది. మనపొరుగు దేశాలైన చైనా 15, నేపాల్ 27, బంగ్లాదేశ్ 36, పాకిస్థాన్ 52వ స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అంటే పాకిస్థాన్ కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాం. అంతే కాదు ప్రపంచంలో రెండవ అతిపెద్ద అసమానతలు కలిగిన దేశం మనదేనని ’ఫోరం’ నివేదిక పేర్కొంది. మరి,ఏమీ మనం సాధించింది ఏమీ లేదా అంటే ఉంది.కానీ, సాధించాల్సిందీ మరెంతో ఉంది.సంప్రదాయికతను వెనక్కి తోసి సాంకేతికత పరుగులు తీస్తుంది.పాశ్చాత్యీకరణ తెరముందుకొచ్చింది. సమాచార సాంకేతిక విప్లవం విభిన్న రూపాల్లో పల్లెలకూ చేరువై యూరపు, యుఎస్ ఏ లతో దేశం పోటీపడుతుంది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయులూ ఉన్నారు. ఇది మరో పార్శ్వం. ఈ నేపథ్యంలో నే ’ విశ్వగురు ’ పదస్మరణం పూనుకొచ్చింది.గతం శప్తమై బాధా తప్తమై ఉండొచ్చు, వర్తమానం ఒకింత సంక్లష్టమై ఉండొచ్చుగాక, భవిష్యత్తు సస్యశ్యామలంగా ఉజ్వలంగా ఉండాలన్న ్సంకల్పం మంచిదే.కానీ, ప్రణాళికలు లేకుండా పరిశ్రమలు ప్రాజెక్టులు అమలు కాకుండా విశ్వగురు హోదా ఒక ఎండమావి.

ఐడెంటిటీ, ఇంటిగ్రిటీ రెండూ ఏ దేశానికైనా రెండు కళ్లవంటివి. కల్చర్, ప్రోగ్రెస్ రెండూ ఆత్మా గుండెల వంటివి. విశ్వగురు మాట చర్చకొచ్చినప్పుడల్లా మనం ఐడెంటిటీకి, కల్చర్ కు విధానం పరంగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాం. ప్రోగ్రెస్ నూ ఇంటిగ్రిటీని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఐడెంటిటీ గొప్పదే, ఐతే విడదీసి చూసేది. ఇంటిగ్రిటీ కష్టమే,ఐతే కలిపి ఉంచేది. కల్చర్ విలువల ఆధారంగా కొనసాగేది. ప్రోగ్రెస్ నైపుణ్యాల బాటన పయనించేది. మొన్న హైదరాబాద్ లో కేశవ్ మెమోరియల్ విద్యార్థుల ఇంటరాక్షన్ లో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము విలువల విద్య, నైపుణ్య విద్య రెండింటి అవసరాన్ని నొక్కి చెప్పారు. భావిపౌరుల సమక్షంలో మాన్య రాష్ట్రపతి మదనపడిన తీరు చూస్తే ’ యుస్‌ఏ మనకు మోడల్ కాదు, మన ఇండియానే మోడల్ కావాలి ఏం చేంద్దాం’ అని యువత భుజస్కంధాల మీదకే విశ్వగురు నానుడి భారాన్ని వదిలారు.బతకడానికి ఒక చోట ఒక ఇల్లు చాలు, మరి కోట్లు వెచ్చించి ఎందుకు రతనాల మేడలు పలుచోట్ల కడుతున్నారు? సమయానికి పిడికెడు మెతుకులు తిని,ఆరడుగుల నేల మీద నిదురించే మనుషులు బిలియన్ల డబ్బును పోగేసి ఏం చేసుకుంటారు! అంటూ పరోక్షంగా ధనిక స్వామ్యం దుర్మార్గాలపై రాష్ట్రపతి తన నిరసన తెలుపకనే తెలిపారు.

విలువలను నమ్ముకున్న వాళ్లకు నైపుణ్యాల కొరత ఉంది.నైపుణ్య వంతుల్లో విలువలకు చోటు లేదనే బాధ దేశాధినేత మాటల్లో స్పష్టమైంది.అందుకే మీలోంచి ఎవరైనా ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారని కూడా విద్యార్థులను అడిగారు. ఆ ప్రశ్నలో ఏమీలేని నిరుపేదలకోసం, అట్టడుగు వర్గాలకోసం, ఆదివాసీల కోసం అధికార పక్షం ఏం చేయాల్సివుందో పిల్లలతో చెప్పించారు.విశ్వగురు కాబోయే ముందు ఇంట గెలవాలన్నదే ఇవాళ దేశం ముందున్న సమస్య .నారాయణమ్మ కళాశాలలోనూ టెక్నాలజీ ప్రాసంగికతను వివరిస్తూ సామాజిక న్యాయపు వెలితిని శ్రీమతి ముర్ము ఎత్తిచూపారు. సమాజంలోని అంతరాలే అంతః సంఘర్షణకు దారితీస్తున్నాయని, శాంతి భద్రతలకూ విఘాతం కలుగుతోందని, వీటి పరిష్కారం యువత సాధించే విద్యాపరమైన విజయాలమీదనే ఆధారపడివుందని రాష్ట్రపతి ఛాత్రులతో మాటామంతీ పంచుకొని ప్రేరణ కల్పించారు.

కారణం వీళ్లు అనలేం కానీ, కల్చర్ ఆరాధనా పద్ధతుల్లో, నైపుణ్యాలు వ్యాపార సామ్రాజ్యంల్లో మూర్ఖంగా తిష్టవేసుకు కూర్చున్నాయి.వర్క్ కల్చరే నిజమైన కల్చర్ అని, వర్క్ ఫోర్సే నిజమైన సైన్యం అనే విషయాన్ని అందరం విస్మరించాం. వర్క్ ఫోర్స్ కు ఆవిష్కరణలు జతగూడక మానవ వనరులు వ్యర్థమయ్యే పరిస్థితి. దేశం విశ్వ గురువు హోదాను పొందడం అనేది ఎంతో విలువైన లక్ష్యం అయినప్పటికినీ అది ఇప్పుడే అవసరం లేదంటారు ప్రముఖ పాత్రికేయులు నితిన్ శ్రీధర్.
దేశాభివృద్ధిని ప్రస్తావిస్తూ ఈయన ‘Let me be blunt: India cannot be a Vishwa Guru until India becomes a strong global power, to which the world will look up to and is ready to listen to. Without power there is no influence, and without influence, there can be no impact, no respect ‘ అంటాడు. విశ్వగురువు కంటే మొదట భారత్ శక్తివంతమైన దేశంగా రూపొందాలనేది పై వ్యాఖ్య అంతరార్థం.

ఎందుకంటే ఆయన మాటల్లోనే చెప్పాల్సి వస్తే భారత్ విశ్వగురువు కావాలని మిగతా ప్రపంచం ఎదురు చూస్తుండవచ్చు, విశ్వగురువు పదాన్ని సహ ప్రాపంచీకులు వల్లెవేస్తే వినడానికి ఇక్కడి కులీనులూ సిద్ధపడి ఉండవచ్చు.అయితే శక్తి లేకుండా ప్రభావం ఉండదు, ప్రభావం లేకుండా ఇతరులను ప్రభావితం చేయడమూ ఉండదు.ఈ రెండూ లేకుండా దేశానికి ఏ హోదా వచ్చినా, ఎవరైనా ఇచ్చినా దానికి ఏ గౌరవమూ ఉండదు. శాస్త్రసాంకేతికంగా శక్తి వంతంగా ఉండి, ప్రపంచానికంతటికీ తయారీ అందించగలిగే అగ్రగామి పరిశ్రమలు నడచి, రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించి, ప్రపంచం మొత్తానికి ఇష్టంగా ఉపాధి కల్పనల భూమిగా ఉంటూ ప్రతీ అభివృద్ధి సూచికలో అగ్రస్థానం పొంది, ప్రతీ భవిష్యదావిష్కరణల్లో శ్రేష్ఠిగా అత్యాధునిక ప్రమాణాలను సృష్టించగలిగినపుడే ఇండియాకు విశ్వగురువు స్థాయి సార్థకమనిపించుకుటుంది.

అట్లా కాకుండా పేదరికం, కాలుష్యం, నిరక్షరాస్యత, అవినీతి, అసమానత, లింగ వివక్ష, ఉగ్రవాదం, మతతత్వం, నిరుద్యోగం, ప్రాంతీయవాదం, కులతత్వం, మద్యపానం, మాదకద్రవ్యాల వినియోగం, మహిళలపై హింస, బాలకార్మిక వ్యవస్థ, పోషకాహార లోపం వంటి ప్రధాన సమస్యలు ఎక్కడివి అక్కడే ఉంటే విశ్వగురు శబ్దాన్ని ఏ వేదిక మీంచి ఎంతటి మూర్తిమంతులు, శ్రీమంతులు ఉచ్చరించినా అది అతిశయోక్తి, పదాడంబరమే అవుతుంది తప్ప మరొకటి కాదు. అయితే విజిగీష తప్పెన్నటికీ కాదు, విద్య విజ్ఞాన శాస్త్రాల వికాసం ద్వారానే ’విశ్వగురువు’ సాధ్యం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles