Sunday, December 3, 2023

ముగిసిన మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ పోలింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీలకు శుక్రవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడా చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ పోలింగ్ సమయం ముగిసే సమయానికి రికార్డు స్థాయిలో 71.11 శాతం పోలింగ్ నమోదయింది. అలాగే చత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌లో భాగంగా 70 స్థానాలకు పోలింగ్ జరగ్గా సాయంత్రం 5 గంటల వరకు67.34 శాతం పోలింగ్ నమోదయింది. మారుమూల ప్రాంతాలతో సహా అన్ని పోలింగ్ కేద్రాలనుంచి సమాచారం అందిన తర్వాత ఈ పోలింగ్ శాతాలు మరింత పెరగవచ్చని ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. చత్తీస్‌గఢ్‌లో తొలి విడత కింద 20 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడి మృతి
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌నగర్ నియోజకవర్గంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుడొకరు చనిపోయారు. దీంతో రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇండోర్ జిల్లా మొహోవా ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణల్లో అయిదుగురు గాయపడ్డారు. అలాగే కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పోటీ చేస్తున్న మోరేనా జిల్లాలోని దిమాని నియోజకవర్గంలో జరిగిన ఘర్షణలో ఇద్దరు గాయపడ్డారు. ఈ చిన్నపాటి ఘర్షణలు మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పిసిసి అధ్యక్షుడు కమల్‌నాథ్ , లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ , పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

నక్సల్స్ మందుపాతరకు ఐటిబిపి జవాను బలి
కాగా చత్తీస్‌గఢ్‌లోని గరియాబండ్ జిల్ల్లాలో నక్సల్స్ అమర్చిన మందుపతరకు ఐటిబిపి జవాను బలి అయ్యారు. పోలింగ్ సిబ్బందికి ఎస్కార్గ్ వెళ్లిన భద్రతా జవాన్లు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఈ జిల్లాలోని బింద్రానవగఢ్ నియోజకవర్గంలోని తొమ్మిది పోలింగ్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగిసింది. ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ తన నియోజకవర్గం పటాన్‌దుర్గ్‌లోని కురుద్ధి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకోగా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆయన సతీమణి రాయపూర్‌లోని సివిల్ లైన్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 958 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News