Thursday, June 13, 2024

ఓటింగ్ శాతం తగ్గడం దేనికి సంకేతం..!

- Advertisement -
- Advertisement -

భారత ఎన్నికల కమిషన్ వివరాల ప్రకారం 19 ఏప్రిల్ 2024న నిర్వహించిన 102 ఎంపి పార్లమెంట్ స్థానాలకు తొలి విడత పోలింగ్‌లో 66.14% మంది ఓట్లువేయగా, ఇదే నియోజకవర్గాల్లో 2019 లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం 69.4గా నమోదు అయింది. అదే విధంగా 26 ఏప్రిల్ 2024న జరిగిన రెండవ విడత 88 ఎంపి స్థానాల ఎన్నికల్లో 66.71% మంది ఓట్లు వేయగా, ఇదే స్థానాల్లో 2019లో 69.2 శాతం ఓటర్లు ఓట్లు వేశారు. 07 మే 2024న నిర్వహించిన 3వ విడత ఎన్నికలు 93 ఎంపి స్థానాలకు నిర్వహించగా అందులో 64.4%, 13 మే 2024న 4వ విడతలో 96 స్థానాలకు నిర్వహించగా 67.25 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించగా ఇదే స్థానాలకు 2019లో 67.33 శాతం మంది తమ ఓట్లు వేశారు.

2019లో నిర్వహించిన ఎన్నికల్లో మొత్తంగా 67.4 శాతం మంది తమ ఓట్ల హక్కును వినియోగించుకున్నారు. 2024లో మొత్తం ఓటింగ్ శాతం 2019 ఓటింగ్ శాతానికి (67.4 శాతం) చేరడం కష్టంగానే తోస్తున్నది. 2019 సాధారణ ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో తొలి విడతలో 3.26%, 2వ విడతలో 2.49%, 3వ విడతలో 2.93% ఓటింగ్ తగ్గడం మన ఓటర్ల నిరాసక్తతకు, ప్రజాస్వామ్యంపై అపనమ్మకం, క్యూలో నిలబడటానికి ప్రతికూలంగా తీవ్ర వేసవితాపం పెరగడం, పట్టణ ప్రజలు ఓటింగ్ రోజును హాలీడేగా భావించడమనే పలు కారణాలు కావచ్చని విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. యుపిలోని జియాబాద్ పట్టణంలో 49.88%(2019లో 55.88% ), బెంగళూరు సెంట్రల్‌లో 54.06% (2019లో 54.31%), దక్షిణ బెంగళూరులో 53.17% (2019లో 53.69%) మాత్రమే నమోదు కావడం పట్టణ ఓటర్ల విచిత్ర ప్రవృత్తిని ప్రదర్శిస్తున్నది.

బెంగళూరు రూరల్‌లో 68.3%, బెంగళూరు అర్బన్‌లో 64.90% ఓటింగ్ జరగడం గమనించారు. ఇప్పటి వరకు జరిగిన మూడు విడతల ఎన్నికల్లో సగటున 3% ఓటింగ్ శాతం తగ్గడం పట్ల భారత ఎన్నికల కమిషన్ విచారాన్ని వ్యక్తం చేయడంతో పాటు తగ్గిన ఓటింగ్ శాతం ఫలితాలను కూడా ప్రభావితం చేస్తాయనటంలో అతిశయోక్తి లేదు. నగరాల్లో ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలు సైతం ఏ విధమైన ప్రభావాలను చూపలేకపోవడం బాధాకరం. 2019 ఎన్నికల్లో 30 కోట్ల భారతీయ ఓటర్లు, ముఖ్యంగా వలస ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. భారత్‌లోనే అత్యధిక ఓటర్లు కలిగిన యుపిలో 3వ విడతలో57.34% మాత్రమే నమోదుకావడంతో పాటు ప్రతి ఏటా తక్కువ ఓటింగ్ శాతం నమోదు అవుతున్నది.

వలస కార్మికులకు తమ గ్రామాల్లో ఓటు హక్కు ఉండడం, ఓటింగ్ రోజు వేతనంతో కూడిన సెలవులు లేకపోవడం, గ్రామాలకు వెళ్లడానికి రవాణా ఖర్చులు లేకపోవడం లాంటి పలు కారణాలు తక్కువ ఓటింగ్ శాతం నమోదుకు దారి తీస్తున్నాయి. రిమోట్ పద్ధతిలో వలస ఓటర్లకు తాము ఉన్న ప్రాంతం నుంచే ఓటు వేయడానికి అనుమతులు ఉండాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు తీవ్ర రూపం దాల్చుతాయని వాతావరణ శాఖ ప్రకటించడం కూడా రానున్న ఎన్నికల్లో తక్కువ ఓటింగ్ శాతం నమోదు కావచ్చని ఊహిస్తున్నారు. 17వ సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం ఇలాగే తక్కువగా నమోదు కావడం గమనిస్తున్నాం. 1951-52లో నిర్వహించిన తొలి పార్లమెంట్ ఎన్నికల్లో దేశఓటింగ్ శాతం 45.67% మాత్రమే నమోదైంది.

1951 -52 తర్వాత నిర్వహించబడిన 16 సాధారణ ఎన్నికల్లో గరిష్టంగా 2019లో 67.4% వరకు మాత్రమే నమోదు, మొత్తంగా 9 సార్లు ఓటింగ్ 60% దాటడం గమనార్హం. 2014లో నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతం 66.44గా రికార్డు అయింది. తక్కువ ఓటింగ్ శాతం నమోదు అయినప్పుడు అధికార పార్టీలకు నష్టం వాటిల్లుతుందనే వాదనలతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల స్ఫూర్తికి విఘాతాలుగా కూడా వివరించబడుతున్నాయి. పాలక పార్టీపై సదాభిప్రాయం ఉన్న ఓటర్లు కొందరు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో విఫలమవుతున్నట్లు, జడత్వాన్ని ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఎలాగూ గెలుస్తామని ధీమాతో ఉన్న అధికార పార్టీ కార్యకర్తల ప్రచార నిర్లక్ష్యం, తొలిసారి ఓటు వేయాల్సిన నవయువత కూడా ఓటింగ్ శాతం పడిపోవడానికి ఆజ్యంపోస్తున్నది.

చివరి విడతల ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసే నవ యువతతో పాటు ఇతర ఓటర్లకు అవగాహన కల్పించడం, ఓటు విలువను అవగతంచేయడం, ఓటు వేసే స్వీప్ పద్ధతులను ప్రచారం చేయడం, ప్రజాస్వామ్య విలువలను తెలియజేయడం, ప్రజాస్వామ్యానికి ఓటరే పట్టుకొమ్మ అని వివరించడం నిరంతరం కొనసాగాలి. ఓటు హక్కుతో నిజాయితీ కలిగిన నాయకులను ఎన్నుకోవాలని, నోటాకు ఓటు వేయవద్దని, అభ్యర్థుల్లో ఉత్తములకు తమ ఓటును వేయాలని ఓటరు మహాశయులకు హితబోధ చేద్దాం. ప్రపంచంలోనే అతి పెద్ద భారత ప్రజాస్వామ్యానికి పట్టాభిషేకం చేద్దాం.

బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News