Saturday, November 2, 2024

విఆర్‌ఒలను తిరిగి విధుల్లోకి తీసుకుంటాం

- Advertisement -
- Advertisement -

విఆర్‌ఓలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకోనుందని, మళ్లీ వారిని తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించినట్టు రెవెన్యూ శాఖ మంత్రి పాంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. సియోల్‌లో ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో విఆర్‌ఓల అంశంపై ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. అందుకే విఆర్‌ఓ వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. దీంతోపాటు ధరణి పోర్టల్ పేరును కూడా మార్చుతున్నామని ఆయన ప్రకటించారు. ధరణి పేరుతో ఇష్టానుసారం దోచుకున్న వారిని తప్పకుండా జైలుకు పంపుతామని ఆయన వ్యాఖ్యానించారు.

గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి…
పదేళ్ల పాలనలో బిఆర్‌ఎస్ పార్టీ చేసిన అనేక కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళిలోపే టపాసులా పేలుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని ఫోన్ ట్యాపింగ్, ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. వారిని అరెస్టు చేయాలా? లేదా జీవిత కాలం జైళ్లో పెట్టాలా? అనేది చట్టం చూసుకుంటుందని మంత్రి తెలిపారు. ఆస్తుల రికవరీ కూడా చట్టమే చూసుకుంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. అది ప్రభుత్వ నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. తాతలు, తండ్రుల ఆస్తుల్లాగా చట్టాలను అతిక్రమించి వారు ఫలితాలు అనుభవించారని ఆయన ఆరోపించారు. తాము సియోల్ నుంచి హైదరాబాద్‌లో దిగేలోపే ఆ టపాసులు పేలుతాయని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News