మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయిని అని, మన ఆయుష్షును పెంచుతుందని ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో అధ్యయనాల్లో తేలింది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి ? మనలో చాలా మందిలో మెదిలే ప్రశ్నే ఇది. అయితే రోజుకు 7 వేల అడుగులు వేస్తే ఆయుర్దాయం పెరుగుతుందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది.న క్యాన్సర్, డయాబెటిస్, డిప్రెషన్ లాంటి అనేక వ్యాధుల ముప్పు తగ్గుతుందని పేర్కొంది. రోజుకు 10 వేల అడుగులు నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని గతంలో పలు అధ్యయనాలు తేల్చాయి. అయితే అలా నడవలేని వారు రోజుకు 7 వేల అడుగులు వేసినా గణనీయమైన ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయని లాన్సెట్ తెలియజేసింది. రోజుకు 7 వేల అడుగులు వేయడం వల్ల మరణం ముప్పును తగ్గించుకోవచ్చు. రోజుకు 2 వేల అడుగులతో పోలిస్తే 7 వేల అడుగులు వేసే వారికి మరణ ముప్పు 47 శాతం తగ్గుతుంది.
రోజులకు 7 వేల అడుగులు వేసే వారిలో డిప్రెషన్ ముప్పు 22 శాతం, డిమెన్షియా ముప్పు 38 శాతం, క్యాన్సర్ వచ్చే అవకాశం 6 శాతం, కాన్సర్ మరణాల ముప్పు 37 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది. అంతేగాక హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 25 శాతం, టైప్ 2 డయాబెటిస్ ముప్పు 14 శాతం మేర తగ్గుతుందని తెలుస్తోంది. 2014 నుంచి 2025 మధ్య నిర్వహించిన 88 సర్వేల ఆధారంగా లాన్సెట్ ఈ అధ్యయనాన్ని ప్రచురించింది. ఈ సర్వేల్లో ప్రపంచ వ్యాప్తంగా 1.6 లక్షల మంది పాల్గొన్నారు. యూకే, ఆస్ట్రేలియా, స్పెయిన్ , నార్వే వంటి దేశాల్లో పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ముగ్గురు పెద్దవాళ్లలో ఒకరు వారి శరీర బరువుకు తగినంత ఫిజికల్ యాక్టివిటీ చేయట్లేదు. దీనివల్లే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. నడక అనేది ఆరోగ్యకర జీవనానికి చాలా అవసరమని, ఈ విషయంపై విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడం అవసరమని అభిప్రాయపడుతున్నారు.