Wednesday, September 11, 2024

కాల్పుల విరమణ చర్చలలో మేము పాల్గొనం: హమాస్

- Advertisement -
- Advertisement -

గాజా: ఖతార్‌లో జరగనున్న కాల్పుల విరమణ చర్చలలో తాము పాల్గొనబోమని హమాస్ అధికారికంగా ప్రకటించింది. కాల్పుల విరమణకు సంబంధించి ఖతారీ రాజధానిలో గురువారం తిరిగి ప్రారంభమయ్యే చర్చలలో తమ గ్రూపు పాల్గొనడం లేదని హమాస్ రాజకీయ బ్యూరో సభ్యుడు సుహేల్ హిందీ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి అందిన ప్రతిపాదన ఆధారంగా జులై 2న జరిగిన ఒప్పందానికి కట్టుబడి ఉంటామని ఇజ్రాయెల్ నుంచి స్పష్టమైన హామీని హమాస్ కోరినట్లు ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ నుంచి హామీ లభిస్తే ఒప్పందాన్ని అమలుచేసేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. గాజాలో కాల్పుల విరమణపై చర్చించేందుకు ఖతార్‌కు పూర్తి అధికారాలతో ఒక ప్రతినిధి బృందాన్ని పంపేందుకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన కొద్ది గంటల్లోనే హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది.

ఈజిప్టు, ఖతార్, అమెరికా నుంచి వచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం జరగవలసి ఉంది. ఆగస్టు 14, 15 తేదీలలో కైరో లేదా దోహాలో చర్చల పునరుద్ధరణ జరగాల్సి ఉంది. అపరిష్కృత సమస్యలు, గాజాలో మానవతాపరమైన పరిస్థితిని చర్చించడమే ఈ సమావేశం ఉద్దేశమని ఈజిప్టు ప్రకటించింది. గాజా కోసం బైడెన్ ఇచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదన అమలుకు ఒక ప్రణాళికను అందచేయవలసిందిగా ఈజిప్టు, ఖతార్, అమెరికా ప్రతినిధులను హమాస్ గతంలో కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News