Thursday, June 13, 2024

ఏడున్నా ఇడనే మూడుముళ్లు..ఏడడుగులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పెళ్లి సంబరాలు స్వదేశంలోనే నిర్వహించుకోవాలని భారతీయ జంటలు కోరుకుంటున్నాయి. విదేశాలలో తూతూ మంత్రపు పెళ్లిళ్ల కన్నా దేశంలోనే ఆర్బాటపు తాళికట్టు శుభవేళకు విశేషం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఉద్యోగ ఉపాదికి పరాయి దేశం వెళ్లినా, జీవితంలో కీలకమైన కల్యాణ ఘట్టం వేదిక స్వదేశమే అయితీరాలని అత్యధికులు నిర్ణయించుకుంటున్నారు. ఈ కీలక విషయాన్ని తాము జరిపిన పూర్తి స్థాయి అధ్యయనంలో వివాహాల వేడుకల రూపకర్త పార్థిప్ త్యాగరాజన్ తెలిపారు. ఆయన సొంతంగా వెడ్డింగ్ సూత్ర డాట్‌కామ్ నిర్వహిస్తున్నారు. భారత్‌లో అయితే పెళ్లి వేడుక చిరస్మరణీయంగా ఉంటుంది. మదిలో స్థానం దక్కించుకునే తన భాగస్వామికి గుర్తుండిపొయ్యే సుమధుర ఘట్టాలు అనేకం తామువీడి వచ్చిన భారత్‌లోనే పుష్కలంగా ఉన్నాయని యువత నమ్ముతోంది. ఇప్పుడు దూర తీరంలో , ఏడు సముద్రాల, ఖండాల ఆవల ఉన్న సొంత దేశంలో పలు కలల సుందర వేదికలు ఉంటాయి.

రుచికరమైన వంటకాలు, ఆత్మీయులు, రాజరికం ఉట్టిపడే వస్త్రాలు, నగలు ధగధగలు అన్నింటికి భారతదేశం వేదిక అవుతుందని అత్యధికం నమ్మకంతో ఉందని పెళ్లిళ్ల నిర్వాహక నిపుణులు తెలిపారు. దేశంలోనే పెళ్లిళ్లు ఇతర వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని, కళ్యాణవేదికలను ఇండియాలోనే ఎంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తమ మన్ కీ బాత్‌లో ఉద్బోధించారు. అయితే తాము ఉంటున్న ప్రాంతానికి దూరంగా కలకాలం నిలిచి ఉండేలా తమ వైవాహిక ఘట్టం జరిగితే బాగుంటుందని కోరుకునే వారు ఎక్కువగానే ఉన్నారు. కానీ విదేశాల్లో కన్నా భారతదేశంలోనే మూడుముళ్ల బంధానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నట్లు వెడ్డింగ్ సంస్థలు జరిపిన సర్వేలలో తేల్చారు. అత్యధిక స్థాయిలో సంపాదన ఉండే వారిలో పదిశాతం వరకూ భారత్‌ను పెళ్ళికి వేదికగా మల్చుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద కుటుంబాల వివాహాలు ఎక్కువగా రాజస్థాన్, గోవా, మహాబలిపురం, కేరళ వంటి ప్రాంతాలలో అట్టహాసంగా జరుగుతున్నాయి. ముంబై, ఢిల్లీ పరిసరాలలోని కొన్ని ప్రాంతాలను కూడా ఎంచుకుని కూడా పలువురు తమ జీవితంలో కీలక ఘట్టాలను నిర్వహించుకుంటున్నారని త్యాగరాజన్ చెప్పారు.

సెలబ్రిటీల పెళ్లితంతు అత్యధికం ఇక్కడే
ఇటీవలి సంవత్సరాలలో పరిశీలిస్తే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ , దీపికా పడుకునే రణ్‌బీర్ సింగ్‌ల పెళ్లి ఇటలీలో జరిగాయి. కాగా కైరా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, మరో జంట కత్రినా కైఫ్, వికి కౌశల్ ఇండియాలోనే ఒక్కటయ్యారు. అయితే స్వస్థలాలకు దూరంగా ఈ వేడుకలు జరిగాయి. సవాయ్ మాధోపూర్‌లోని బర్వారా కోట, జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లు వేదికలు అవుతున్నాయి. జోథ్‌పూర్‌లోని ఉమైద్ భావన్ రాజభవనం నటి ప్రియాంక చోప్రా, యుఎస్ సింగర్ నిక్కి జోనాస్ పెళ్లి విడిది అయింది.
విదేశాలలో పెళ్లి వేడుకల ఖర్చు రూ 50000 కోట్లు
ప్రతి ఏటా దాదాపు 5 వేల వరకూ వివాహాలు విదేశాలలో ఇక్కడివారివి జరుగుతున్నాయి. వీటికి మొత్తం కలిపితే వ్యయం దాదాపు రూ 50000 కోట్ల వరకూ ఉంటుంది. ఈ విషయాన్ని ఆలిండియా ట్రేడర్స్ కాన్ఫెడరేషన్ ( సైట్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్‌వాలా తెలిపారు. దేశీయంగా జరిగే పెళ్లిళ్ల ఖర్చులతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని విశ్లేషణలో తేలింది.

ఈ ఏడాది పెళ్లిసీజన్‌లో రూ 4.7 లక్షల కోట్ల ఆదాయం
ట్రేడర్స్ సమాఖ్య అంచనాల మేరకు చూస్తే ఇప్పటి పెళ్లిళ్ల సీజన్‌లో పెళ్లిళ్ల నిర్వాహక పరిశ్రమకు మొత్తం రూ 4.7 లక్షల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ఈ సీజన్‌లో మొత్తం మీద 38 లక్షల వరకూ వివాహాలు ఉన్నాయి. దేశంలో వివాహాల విషయంలో ఇది రికార్డు. గత ఏడాది ఇదే సీజన్‌లో మొత్తం మీద 32 లక్షల వరకూ పెళ్లిళ్లు జరిగాయి. దీని ద్వారా దక్కిన ఆదాయం రూ 3.75 లక్షల కోట్లు. పెళ్లిళ్లకు వేదికలు భారతదేశంలోనే ఉంటే , దేశ సాంప్రదాయక విలువలు, వైవాహిక వ్యవస్థల ఘనత చాటుకోవడం జరుగుతుంది. ఇదే దశలో దేశంలో వివాహ సంబంధిత వ్యాపారాలకు వెన్నుదన్ను ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది. అంతేకాకుండా భారీ స్థాయిలో తాత్కాలిక , శాశ్వత ఉద్యోగ ఉపాధికి దారితీస్తుందని సమాఖ్య అధ్యక్షులు ఖండేల్వాల్ తెలిపారు. గత కొద్ది సంవత్సరాల తీరు చూస్తే పెళ్లిళ్లకు అయ్యే ఖర్చులు పెరిగాయని వెడ్డింగ్ వైర్ సంస్థ డైరెక్టరు అన్నం జుబైర్ తెలిపారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉదయ్‌పూర్, జైపూర్, గోవా, డెహ్రాడూన్‌లలో జరుగుతున్నాయని ఆమె వివరించారు. ఇంతకు ముందటి వరకూ సగటున చూస్తే ఒక్క పెళ్లికి తక్కువలో తక్కువ రూ 20 లక్షల వరకూ ఖర్చు అయ్యేది. కాగా పలు కారణాలతో ఇప్పుడు ఒక్కో వివాహానికి పలు కోట్ల వరకూ ఖర్చుపెడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News