Sunday, April 28, 2024

ఎన్‌సిపి రూ.70 వేల కోట్ల స్కామ్ ఏమయింది?

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఎన్‌సిపి రూ.70 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిదంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యల లక్ష్యంగా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివసేన (యుబిటి) అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే మంగళవరం ప్రధానిపై ప్రశ్నలవర్షం కురిపించారు. పుణెకు చెందిన ఓ ట్రస్టు ప్రధాని నరేంద్ర మోడీని తిలక్ జాతీయ అవార్డు కోసం ఎంపిక చేయడంతో పాటుగా ఆగస్టు 1న జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్‌పవార్‌ను ఆహ్వానించిన ఒక రోజు తర్వాత ఉద్ధవ్ థాక్రే ప్రధానిపై ఈ దాడి చేయడం గమనార్హం.

ఈ అవార్డుల ప్రదానోత్సవానికి ఆహ్వానించిన ప్రముఖుల్లో ఎన్‌సిపిపై తిరుగుబాటు చేసి శివసేన బిజెపి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిపోయిన అజిత్ పవార్ కూడా ఉండడం గమనార్హం. రూ.70 వేల కోట్ల స్కామ్ ఏమయింది? వేదికపైన ఎవరుంటారు? ఎన్‌సిపి మీతో ఉందా?’ అని ఉద్ధవ్‌థాక్రే విలేఖరుల సమావేశంలో ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. భోపాల్‌లో గత నెల జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఎన్‌సిపిపై రూ.70 వేల కోట్ల కుంభకోణాల ఆరోపణలున్నాయని అన్నారు.

ఈ కుంభకోణాల్లో అజిత్ పవార్‌కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలున్న మహారాష్ట్ర సహకార బ్యాంకు స్కామ్, నీటిపారుదల కుంభకోణం, అక్రమ మైనింగ్ కుంభకోణం లాంటివి ఉన్నాయి. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దర్యాప్తు ఏజన్పీలను దుర్వినియోగం చేస్తోందని ఉద్ధవ్ థాక్రే దుయ్యబట్టారు.‘ కాలం చాలా దుర్మార్గమైంది. అది వాళ్లకు వ్యతిరేకంగా మారినప్పుడు దానినుంచి తప్పించుకోవడం వాళ్లకు కష్టమవుతుంది’ అని ఆయన అన్నారు.

లోక్‌మాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 1న పుణెలో ప్రధాని నరేంద్ర మోడీకి లోక్‌మాన్య తిలక్ జాతీయ అవార్డును అందజేయనున్నట్లు, శరద్‌పవార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారని ట్రస్టు అధ్యక్షుడు దీపక్ తిలక్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మహారాష్ట్ర గవర్నర్ రమేశ్ బైస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్‌పవార్ తదితరులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వారిలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News