Tuesday, July 16, 2024

వ్యవ‘సాయం’ ఇంతేనా !

- Advertisement -
- Advertisement -
2020నాటికి రెట్టింపు ఆదాయం ఏది
కేంద్రాన్ని నిలదీసిన మంత్రి నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ పట్ల వివక్ష చూపుతూ రాష్ట్రవ్యవసాయ రంగానికి ఏ మాత్రం అండగా నిలవకుండా వివిధ పథకాలకు రుణాలు ఇవ్వడం కూడా సాయం అనిపించుకుంటుందా అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో చేసిన ప్రకటనలపై శనివారం మంత్రి నిరంజన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.ఢిల్లీలో స్క్రిఫ్టు సిద్దం చేస్తే హైదరాబాద్ లో మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి దాన్నే చదివి వినిపించారన్నారు.

వ్యవసాయ రంగానికి రూ.20 లక్షల కోట్ల రుణ వితరణ, రూ.23,948 వేల కోట్ల గొర్రెల రుణం కేంద్రం గొప్పతనమా , ఒక కేంద్రమంత్రి రుణాలను గొప్పగా చొప్పుకోవడం సమంజసమా , అని ప్రశ్నించారు.ఎరువుల సబ్సిడీ అనాదిగా వస్తున్నదే అని, బీజేపీ పాలనలో ఎరువుల సబ్సిడీ తగ్గించగా, ఎరువుల వినియోగం పెరిగిందన్నారు.రూ.6300 కోట్లతో ప్రారంభించిన రామగుండం యూరియా ఫ్యాక్టరీ నుండి అరబస్తా యూరియా రైతులకు ఉత్పత్తి చేశారా , దానిని వాణిజ్య మార్కెట్‌లోకి పంపించారా అని ప్రశ్నించారు. మరి ఇందులో కేంద్రం రైతాంగానికి చేసిన మేలేంటో చెప్పాలన్నారు. వాస్తవాలను మరుగున పరుస్తూ కేంద్రమంత్రి రైతులను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

దేశంలో 11 కోట్ల మంది ఉన్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారు సంఖ్య 3 కోట్లకు పడిపోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రైతుబంధును అనుసరిస్తున్న కేంద్రం కేవలం రైతులకు ఇచ్చింది రూ.9500 వేల కోట్లు మాత్రమే అన్నారు. 38 లక్షల మంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన రైతులను 29 లక్షలకు తగ్గించారన్నారు.ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద నాలుగేళ్లలో కేవలం రూ.9 వేల కోట్లు ఇచ్చి రైతుబంధు కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.65 వేల కోట్లు ఇచ్చిన విషయాన్ని మరిచిపోతున్నారన్నారు. ఫసల్ భీమా యోజన భీమా కంపెనీల ప్రయోజనాల కోసమే అని, ప్రీమియం ఎక్కువ .. పరిహారం తక్కువ అన్నట్టుగా ఉందన్నారు. పెంచిన మద్దతుధరల గురించి కాదు పెరిగిన సాగు ఖర్చుల గురించి మాట్లాడాలన్నారు.

పెంచిన డీజిల్, పెట్రోల్ ధరలతో రైతాంగం నడ్డి విరిచారన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అన్న కేంద్రప్రభుత్వం రైతుల సాగు ఖర్చులు రెట్టింపు చేసిందన్నారు.రాష్ట్రాల వారీగా సాగు ఖర్చులను బట్టి మద్దతుధర ప్రకటించాల్సిన కేంద్రం రాష్ట్రాల విజ్ఞప్తులను పక్కనపెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నదన్నారు. సాగునీటి ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయహోదా ఇవ్వాలని ఒక్కరోజైనా మీ ప్రభుత్వాన్ని కోరారా అని ప్రశ్నించారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇచ్చి నిధులు కేటాయిస్తే ఒక్క తెలంగాణ బీజేపీ నేతా మాకూ కావాలని అడిగిన పాపాన పోలేదన్నారు. మద్దతుధర కింద పండిన పంటలో నూటికి కేవలం 25 శాతం పంటలు మాత్రమే సేకరిస్తూ కేంద్రం భారం రాష్ట్రాల మీద నెడుతున్నదని ఆరోపించారు. ధాన్యం సేకరణ నుండి ఎఫ్ సీఐని, పత్తి సేకరణ నుండి సీసీఐని కేంద్రం కనుమరుగు చేసిందని, భారం మొత్తం రాష్ట్రాల మీద నెట్టిందన్నారు. ఎరువుల వినియోగం, పంటలమార్పిడి మీద కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళిక లేదన్నారు. దానిని అమలుచేస్తున్న రాష్ట్రాలకు ఒక ప్రోత్సాహం లేదన్నారు.కిషన్ రెడ్డి మీడియా సమావేశం ఆత్మస్తుతి పరనింద మాదిరిగా సాగిందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News