Wednesday, October 9, 2024

ఎవరు జర్నలిస్టులు..ఎవరు కారు?

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో 2008లో పరిష్కారం కావాల్సిన ఒక చిన్న సమస్యకు పదహారేళ్ల తరువాత గత ఆదివారం శుభం కార్డు పడింది. ఈ పదహారేళ్ళలో ఉమ్మడి రాష్ట్రంలో, విభజిత రెండు తెలుగు రాష్ట్రాలలో అయిదుగురు ముఖ్యమంత్రులకు దక్కని ఒక మంచి అవకాశం ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి దక్కింది. ఆ అయిదుగురిలో నలుగురు ముఖ్యమంత్రులు ఈ సమస్యను ఒకవేళ పరిష్కరించాలని నిజాయితీగా అనుకున్నా సాధ్యమ య్యే పరిస్థితులు అప్పట్లో లేవు. సమస్య న్యాయస్థానాల విచారణలో ఉన్నందున వారు వివశులు. అయిదో ముఖ్యమంత్రికి అవకాశం దొరికినా రెండేళ్లపాటు పనికిరాని సందేహాలతో లేదా ఈ సమస్య పరిష్కారం వల్ల లబ్ధి పొందే వారిప ట్ల ఉన్న చులకన భావం వల్లనో, వ్యతిరేకభావం వల్లనో, చెప్పుడు మాటలు వి న్నందువల్లనో మంచి అవకాశం కోల్పోయారు. ఇప్పటికే అందరికీ అర్థం అయి ఉండాలి విషయం ఏమిటో.

ఇది తెలుగు రాష్ట్రాల జర్నలిస్టుల గృహవసతికి సంబంధించిన సమస్య. రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్లాదిమంది ప్రజానీకం ఉంటే కొన్ని వేలమందిది పెద్ద చర్చించాల్సిన సమస్యా అనే వాళ్ళు ఉండవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. జర్నలిస్టులతో సహా సమాజంలోని కొన్ని వర్గాలను ప్రభుత్వాలు ఇంత ప్రత్యేకంగా ఎందుకు చూడాలి అనే అభ్యంతరం ఎప్పుడూ ఉంది. దాని మీద చర్చించవచ్చు. ఇక్కడ మాట్లాడుకుంటున్నది కొన్ని వర్గాల గురించి, కొన్ని రాజకీయ పక్షాలు, నాయకుల వైఖరి గురించి.సరే, వార్తా సేకరణ ద్వారా ప్రైవేట్ యాజమాన్యాల నిర్వహణలో ఉన్న పత్రికల కోసం, మీడియా సంస్థల కోసం పనిచేసే జర్నలిస్టులకు ప్రభుత్వాలు ఏ సౌ కర్యమైనా ఎందుకు కల్పించాలి అన్న వాదన మీద చర్చ జరుగుతూనే ఉంటుం ది. జరగనిద్దాం. సమాజంలోని అన్నిరంగాల మాదిరిగానే మీడియాలో కూడా కాంట్రాక్ట్ పద్ధతి ప్రవేశించిన తరువాత ఈ రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత కానీ, సరయిన వేతన వ్యవస్థ కానీ లేకుండాపోయాయి.

వర్కింగ్ జర్నలిస్టులు, ఇతర వార్తా పత్రికల ఉద్యోగులు, కార్మికుల కోసం ఉద్దేశించిన వర్కింగ్ జర్నలిస్టుల చట్టానికి మంగళం పాడి కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ పేరిట తెచ్చిన కొత్త చట్టాలు ఇంకా అమలులోకి రావడానికి చాలా ముందే ఈ దేశంలో మీడియా యాజమాన్యాలన్నీ తమ సిబ్బందికి చట్టబద్ధమయిన చెల్లింపులు, సౌకర్యాలు అందకుండా చేశాయి. అంతకుముందు కూడా యాజమాన్యాలు వర్కింగ్ జర్నలిస్టుల చట్టం అమలు కానీ, అరుదుగా కేంద్రం నియమించిన వేజ్ బోర్డుల సిఫార్సుల అమలుకానీ సక్రమంగా చేసింది ఎన్నడూ లేదు. అటు కేంద్రప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుని మీడియా యాజమాన్యాల మీద చర్యలు తీసుకునే పని చేయలేదు. ఎక్కడో ఒకటి రెండు మినహాయింపులు ఉండవచ్చు. మెజారిటీ జర్నలిస్టులు, మీడియా సిబ్బంది అరకొర వేతనాలతో, ఉద్యోగ భద్రత లేక దు ర్భరమయిన పని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు ప్రభుత్వాలు చేసే సాయాన్ని చూడాల్సి ఉంటుంది. ఇతర వృత్తులకంటే భిన్నమైంది కాబట్టి ప్రభుత్వాలు ఇదొక సోషల్ ఆబ్లిగేషన్‌గా జర్నలిస్టులకు, వారి కుటుంబాలకు వైద్య సౌకర్యం, పింఛన్ సౌక ర్యం, ప్రయాణ రాయితీలు తదితర సహాయాలు చేస్తుంటాయి. సమాచార సేకరణ కోసం విలేఖరులకు ప్రభుత్వం (రాష్ట్రాలలో సమాచార, పౌర సంబంధాల శాఖల ద్వారా, కేంద్రంలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ద్వారా) ఇచ్చే అక్రెడిటేషన్ (గుర్తింపు ) మాత్రం ప్రభుత్వాలు బాధ్యతగా ఇవ్వాలి, జర్నలిస్టులూ దా న్ని బాధ్యతగా స్వీకరించాలి.కోర్టులలో నలిగి నలిగి చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ తీర్పుతో హైదరాబాద్‌లో 11 వందలమంది జర్నలిస్టులకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన 70 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఆదివారం జర్నలిస్టులకు చెందిన జవహర్ లాల్ నెహ్రూ సహకార గృహ నిర్మాణ సంఘానికి అప్పగించారు. జస్టిస్ రమణకు, డాక్టర్ రాజశేఖర్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ జర్నలిస్ట్ కుటుంబాలన్నీ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి.

ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం గురించి చర్చించుకోవాలి. జర్నలిజంలో (ఇప్పుడు మీడియా అంటున్నాం) నెలకొన్న విపరీత ధోరణులను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. వాటిమీద చర్చ జరగాలని కోరారు. నిజమయిన జర్నలిస్టులను తాము గౌరవిస్తామని, వారికి ప్రభుత్వం తరఫున అందవలసిన సౌకర్యాలు, రాయితీలు అందించడానికి తమ ప్రభుత్వం వెనకాడబోదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలలో ఒకటి మీడియా -రాజకీయాలు. వా ర్తా పత్రికలు మాత్రమే నడిచిన కాలంలో కూడా కొందరు యజమానులు, కొద్దిమంది జర్నలిస్టులకు రాజకీయాభిప్రాయాలు ఉండేవి. అయితే అవి వారు రాసే వార్తలను ఎన్నడూ ప్రభావితం చేసేవి కాదు. సత్యాన్వేషణలో పత్రికలు ఎన్నడూ తమ రాజకీయ అభిప్రాయాలు, తమ భావజాలం ప్రభావితం చేయకుండా జాగ్రత్త పడేవారు. రాజకీయ పార్టీలు పత్రికలు పెట్టడం, 24 గంటల వార్తా ఛానళ్ళు ప్రారంభించడం మొదలయిన తరువాత పరిస్థితి మారింది. ఈ క్రమంలోనే జర్నలిస్టుల స్వేచ్ఛ యాజమానుల స్వేచ్ఛగా కూడా మారిన విషయం అందరికీ తెలిసిందే.

ముఖ్యమంత్రి ప్రస్తావించింది ఇదే విషయం. రాజకీయ నడిపే మీడి యా సంస్థలు లేదా ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉండాలన్న యావలో పడి అధికారంలో ఉన్న పార్టీల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా అసత్యాలు రాసే, అభూత కల్పనలు ప్రదర్శించే మీడియా సంస్థలు ఇప్పుడు ఎక్కువయిపోయా యి. తమకు రాజకీయాలు ఉన్నాయని, ఫలానా రాజకీయ నాయకుడి సిద్ధాంతాలు తమ మీడియాకు ఆదర్శం అని చెప్పుకునే మీడియా సంస్థలు కొంచెం నయం. వాళ్ళు ఏం రాస్తారో, ఏం చూపిస్తారో పాఠకులకు, వీక్షకులకు తెలు సు కాబట్టి ప్రమాదం తక్కువ. కమ్యూనిస్ట్ పార్టీలకు మీడియా సంస్థలు ఉన్నా యి. అవి వాటి రాజకీయ సిద్ధాంతాల ప్రచారానికి, భావవ్యాప్తికి కట్టుబడి ఉం టాయి. వాటివల్ల కూడా ప్రమాదం లేదు. ఈ విషయం ముఖ్యమంత్రి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించారు. స్వతంత్రులమని, నిష్పక్షపాతంగా ఉంటామని బయటికి చెప్పుకుని ఒక రాజకీయ పక్షాన్ని అధికారంలోకి తేవడానికో, దించేయడానికో పచ్చి అబద్ధాలు రాసే, చూపే, చెప్పే పత్రికలూ, ఛానళ్ళవల్లనే సమాజానికి ప్రమాదం. వాటితో ప్రజలు, ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించిన ఇంకో ధోరణి సామాజిక మాధ్యమాల పేరిట చెలరేగిపోతున్న యూట్యూబ్ ఛానళ్ళు. ఎక్కడయినా మినహాయింపులు ఉంటాయి. ఎక్కడో కొన్ని ఇటువంటి ఛానళ్ళు జాతీయస్థాయిలో కానీ, ప్రాంతీ య స్థాయిలోకానీ బాధ్యత గల జర్నలిస్టులు, పౌరులు, మేధావులు నిర్వహించేవి తప్ప మిగతావన్నీ రాజకీయ ప్రేరేపితమయినవి, వ్యక్తుల, సంస్థల ప్రతిష్ఠలను దిగజార్చే విధంగానే వ్యవహరిస్తాయి. వీటికి ఏ బాధ్యతా, జవాబుదారీతనమూ ఉండదు. ఇవి దేశమంతటా వేలు, లక్షల సంఖ్యలో పుట్టుకొచ్చాయి. ఇవన్నీ మీడియా కిందకు వస్తాయా, ప్రభుత్వాలు కల్పించే సౌకర్యాలకు వీరం తా అర్హులు అవుతారా?వర్కింగ్ జర్నలిస్టుల చట్టంలో నిర్దేశించిన విధంగా ఎవరయితే జర్నలిజం ప్ర ధాన కలిగి ఉంటారో (whose principal a vocation is journalism) అటువంటి వారే ప్రభుత్వం నుండి సంక్రమించే అక్రెడిటేషన్ తదితర సౌకర్యాలకు అర్హులు కావాలి. ఆ అర్హత గలవారు ఎవరో మీరే తేల్చండని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బాధ్యతను జర్నలిస్టుల మీద, వాటి సంఘ బాధ్యుల మీద, మీడియా అకాడమీ మీద పెట్టారు. తమను సమర్ధించే వారి సంఖ్యను పెంచుకోవాలనే ఆలోచనతో కాకుండా వృత్తి గౌరవాన్ని ఇనుమడింప చేసే విధంగా వారంతా వ్యవహరించాలని అన్యాపదేశంగానే అయినా ము ఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇక్కడ కొన్ని సూచనలు చేయాలి. వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వాల నుండి లభించే సౌకర్యాలను అక్రెడిటేషన్‌తో ముడిపెట్టి చూస్తున్న కారణంగానే పరిస్థితి అదుపుతప్పి వేల సంఖ్యలో వాటికోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవకతవకలకు, అక్రమాలకు కూడా అవకాశం కలుగుతున్నది. ఉదాహరణకు వయోధిక పాత్రికేయులు ఉన్నారు. వారికి కావలసింది వృద్ధాప్యంలో వైద్య సౌకర్యం, గౌరవప్రదంగా పెన్షన్, గృహవసతి, అరుదుగా చేసే ప్రయాణానికి రాయితీ. అక్రెడిటేషన్‌తో సంబంధం లేకుండా 60 ఏళ్లు దాటి పదవీ విరమణ చేసిన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం సహాయం చేయవచ్చు. ఇటువంటి కొన్ని పథకాలు ఇతర రాష్ట్రాలలో ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆ పథకాలను కూడా పరిగణనలోనికి తీసుకుంటే బాగుంటుంది. ఇట్లా వర్కింగ్ జర్నలిస్టులలోని ఇతర వర్గాలకు కూడా ఇదే విధంగా ప్రభుత్వ సహాయం అందించే అవకాశం ఉంది. అక్రెడిటేషన్ అనేది సమాచార సేకరణ నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు, మంత్రులు, ముఖ్యమంత్రులు కొలువు తీరే సెక్రటేరియట్ వంటి చోట్లకు శాసనసభ సమావేశాలకు అడ్డంకులు లేకుండా విలేఖరులు వెళ్ళడానికి ఉద్దేశించినదన్న విషయం అందరూ మరిచిపోయారు కాబట్టి గుర్తు చేయాల్సి వస్తున్నది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో (ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కానీ వేరే పార్టీలు అధికారంలో ఉండగా జర్నలిస్టులకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు) ఈ సౌకర్యం కల్పించడానికి అక్రెడిటేషన్‌ను అర్హతగా చూడలేదు ఎప్పుడూ. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ ఒకసారి సీనియర్ సంపాదకులు, జర్నలిస్టులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా పరిస్థితిని సమీక్షించి నివేదికలు తెప్పించుకుని నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతి ప్రసంగం ద్వారా ఆశించిన సత్ఫలితాలు సమకూరుతాయి.

దేవులపల్లి అమర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News