Friday, September 22, 2023

2024కు గుదిబండ కానున్నాడా!

- Advertisement -
- Advertisement -

నేడు దేశంలో ఎన్నికలను ఎదుర్కోవడంలో అసామాన్యమైన సాధన సంపత్తులను సమీకరించుకొని, ప్రచారం జరపడంతో పాటు వ్యవస్థలను అనుకూలంగా మలచు కోవడంలో బిజెపికి సాటిరాగల రాజకీయ పక్షం గాని, కూటమి గాని లేదని అందరూ అంగీకరిస్తారు. తమకు ఎదురులేదనే అటువంటి అహంకారమే ఒకొక్కసారి పెను ప్రమాదాలను తీసుకొస్తుందని మరచిపోతున్నారు. కర్ణాటకలో సొంత పార్టీ కార్యకర్తే ఒక కాంట్రాక్టు పనిలో బిల్లు చెల్లింపుకు సొంత పార్టీలో కీలకనేత 40 శాతం కమీషన్ డిమాండ్ చేయడంతో దిక్కులేక ఆత్మహత్యకు పాల్పడిన కథనం వెలుగులోకి వచ్చిన్నప్పుడు బిజెపి అప్రమత్తమై, తగు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఉంటె ఎన్నికల ఫలితాలు మరో విధంగా ఉండే అవకాశం ఉండెడిది.
కానీ, పార్టీలో ఒక వర్గం విశేషమైన ప్రజాభిమానం గల మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్డ్యూరప్ప ప్రాబల్యాన్ని కట్టడి చేసేందుకు కేఎస్ ఈశ్వరప్ప తగిన నేత అనే సంకుచిత భావనతో వెనుకవేసుకు రావడంతో కాంగ్రెస్‌కు ఓ ప్రచార అస్త్రం అందించినట్లయింది. అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలో అనుకోని విధంగా అవినీతి ఆరోపణలు గల వ్యక్తులను వెంటవేసుకు వచ్చినట్లయింది.

ఇప్పుడు ఢిల్లీలో అదే జరుగుతుంది. తాము లైంగిక వేధింపులకు గురయ్యామని భారత్‌కు అంతర్జాతీయ పోటీలలో పతకాలు సాధించిన మహిళా రెజ్లర్లు దీర్ఘకాలంగా ఆందోళన చేస్తుంటే కేవలం ఒక ఎంపీని కాపాడుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది.
సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు మహిళా రెజ్లర్లు ఫిర్యాదులపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ లు కూడా నమోదు చేయకపోవడం గమనిస్తే నిర్భయ దుర్ఘటన జరిగిన దశాబ్దం తర్వాత కూడా ఢిల్లీలో మన ఆడపడుచులు ఏవిధమైన దుస్థితికి గురవుతున్నారో అనే ఆవేదన కలుగుతుంది. ఇప్పుడు బైటకు వచ్చిన ఆ రెండు ఎఫ్‌ఐఆర్ లను గమనిస్తే ఎంత అసభ్యంగా, అవమానకరంగా వారిపట్ల ఎంపీ బ్రిజ్ భూషణ్ ప్రవర్తించారో వెల్లడవుతుంది.

మన దేశంలో మహిళలు చాలావరకు లైంగిక వేధింపులను తమ కుటుంబం సభ్యులు, సన్నిహితులు నుండి, తాము పనిచేసే చోటనే ఎదుర్కొంటున్నారు. సామాజిక న్యూనతాభావంతో మూడొంతుల మంది జరిగిన వేధింపుల గురించి ఎవ్వరితో చెప్పుకోలేక పోతున్నారు. అటువంటిది సాహసించి, ఇప్పటికైనా వీరు తమకు జరిగిన అన్యాయాన్ని వెల్లడి చేసినందుకు వారిని అభినందించి, వారికి బాసటగా నిలవాల్సింది పోయి సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా దారుణమైన కథనాలు వ్యాప్తి చేస్తుండడం సిగ్గుచేటైన విషయం.
ఈ నాడు పార్టీ అధినేతల నుండి కన్నెర్ర ఎదురవుతుందని బీజేపీలో ఎవ్వరూ ఈ సంఘటనపై బైటకు మాట్లాడలేకపోవచ్చు. చివరకు మహిళలు కూడా నోరు మెదప లేకపోవచ్చు. కానీ వారిలో చాలామంది అవమానకరంగా భావిస్తున్నారని మాత్రం గ్రహించాలి. ఈ విషయమై మీడియా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి పరిగెత్తుకొంటూ వెళ్లిన సంఘటన వారిని ఈ సంఘటన ఎటువంటి ఇరకాట పరిస్థితిలోకి నెట్టిందో వెల్లడి చేస్తుంది.

చివరకు బీజేపీ మహిళా ఎంపీ ప్రీతవ్‌ు ముండే ధైర్యం చేసి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో తాను భాగస్వామ్యురాలునే అయినప్పటికీ.. రెజ్లర్లతో ప్రభుత్వం సరైన రీతిలో సంప్రదింపులు జరపలేదని అంగీకరించాల్సి వస్తుందని పేర్కొనడం గమనార్హం. భారీ ఎత్తున నిరసన జరుగుతున్నప్పుడు, దానిపై ఏ ప్రభుత్వమైనా దష్టి పెట్టాలని ఆమె స్పష్టం చేశారు.
ఒకపార్లమెంట్ సభ్యురాలిగా కాకుండా, ఓ మహిళగా ఈ అభ్యర్థన చేస్తున్నానని, ఎవరైనా మహిళ అలాంటి ఫిర్యాదు చేస్తే, అప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలని, ఆ తర్వాత ఆ ఫిర్యాదుపై సత్యాన్వేషణ చేపట్టాలని ఆమె కేంద్ర ప్రభుత్వంకు హితవు చెప్పారు. ఈ విధంగా బైటపడి మాట్లాడిన ఏకైక బిజెపి ఎంపీ ఆమె కావచ్చు. కానీ ఆ పార్టీలో సున్నితత్వంగల అనేక మంది నేతలు ఇదేవిధంగా ఆలోచిస్తున్నారని గ్రహించాలి.
పైగా, తనకు మద్దతుగా అయోధ్యలో లక్ష మందితో భారీ ర్యాలీ జరిపేందుకు బ్రిజ్ భూషణ్ సన్నాహాలు చేసుకుంటుంటే, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం గమనార్హం. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహితం ఆయన వ్యవహారం పట్ల అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇప్పుడు కేవలం రైతు నాయకులు మాత్రమే రెజ్లర్లకు మద్దతుగా ముందుకు వచ్చారు. తాజాగా 1983లో భారత్ కు తొలి ప్రపంచ కప్ సాధించిన కపిల్ దేవ్ బృందం బాసటగా నిలిచారు. తాము సాధించుకున్న మెడల్స్ ను గంగలో కలిపివేసే ప్రయత్నం పిల్లచేష్ట అన్నట్లు సున్నితంగా మందలించారు కూడా. కానీ, రాను రాను పలు వర్గాలు వారికి బాసటగా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
బేటి బచావో, ఉజ్వల వంటి పలు కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారత కోసం గత తొమ్మిదేళ్లుగా మోదీ ప్రభుత్వం ఎన్నెన్నో కార్యక్రమాలు చేబడుతున్నదని ప్రచారం చేసుకొంటున్న సమయంలో తాము లైంగిక వేధింపులకు గురయ్యామని అంటూ మన దేశం గర్వించే రెజ్లర్లు వీధుల్లోకి రావలసి రావడం, వారి ఆవేదన అరణ్యరోదనగా మిగిలిపోతూ ఉండటం విచారం కలిగిస్తుంది.
ఇంకా విచారణ పూర్తి చేసి, కోర్టుకు నివేదిక సమర్పించకుండానే లైంగిక వేధింపులు జరిగిన్నట్లు ఆధారాలు ఇవ్వలేకపోయారని ఢిల్లీ పోలీసులు ప్రకటించడం గమనిస్తే వారెన్ని వత్తిడులలో పనిచేస్తున్నారో స్పష్టం అవుతుంది. దేశ రాజధానిలో మూడేళ్ళ క్రితం జరిగిన అల్లర్ల సమయం నుండి ఢిల్లీ పోలీసుల పనితీరు విమర్శలకు దారితీస్తుంది.

తెలంగాణ మహిళా గవర్నర్ పట్ల ఓ ప్రజాప్రతినిధి అనుచితంగా మాట్లాడారని వెంటనే షో కాజ్ నోటీసు జారీ చేసిన జాతీయ మహిళా కమిషన్ తమకు దగ్గరలోనే మహిళా రెజర్లు న్యాయం కోసం ఆందోళన చేస్తుంటే కనీసం వారి వద్దకు వెళ్లి సానుభూతి వ్యక్తం చేసే ప్రయత్నం చేయనే లేదు. మనదేశంలో హక్కుల సంఘాలు ఏవిధంగా పనిచేస్తున్నాయో ఇంతకన్నా మరో ఉదాహరణ అవసరం లేదు.
ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళన అంతర్జాతీయంగా భారతీయుల పరువు ప్రతిష్టలను మంటగలిపే ప్రమాదం ఉందని గ్రహించాలి. మొదట గత జనవరిలో వారు తమ ఆందోళనను వ్యక్తం చేసినప్పుడు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ పిలిపించి విచారణ జరిపించి, తగు చర్య తీసుకొంటామని హామీ ఇస్తే వారు సహనంతో వేచి ఉన్నారు. కానీ మంత్రి చెప్పిన విచారణ నివేదికను ఇప్పటివరకు బైట పెట్టలేదు. దానితో వారు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయవలసి వచ్చింది.

ఎవరైనా తార్కికమైన అంశాలపై ఆందోళనలు చేపట్టినప్పుడు ప్రభుత్వ పెద్దలు పట్టించుకొక పోవడం, తీరా అవి అదుపు తప్పుతున్నాయనుకొన్నప్పుడు పశ్చాత్తాప పడటం ఒక వరవడిగా మారుతుంది. రైతుల ఉద్యమం సయమంలో అదే జరిగింది. ఖలిస్తాని మద్దతుదారులు ఆ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. చివరకు రైతు చట్టాలను ఉపసంహరించుకున్నారు.
మన క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై పతకాలు గెలుచుకున్నప్పుడు వారిని ఆహ్వానించి, వారికి తేనీరు ఇచ్చి, వారితో ఫొటోలు దిగి అభినందించే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు తాము అవమానానికి గురయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తుంటే పిలిచి, కనీసం మంచి చెడు మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎంతో హుందాగా ఉండెడిది. ఈ దేశంలోని మహళలు అందరికి ప్రధాని అండగా ఉన్నారనే భరోసా కలిగెడిది.

వాస్తవానికి రెజర్లు మొదట్లో తమ నిరసనలకు రాజకీయ నాయకులు ఎవ్వరూ వచ్చి మద్దతు ఇవ్వొద్దని అభ్యర్ధించారు. ఆ విధంగా తమ ఆందోళనకు రాజకీయ రంగు పులుముకోవడం పట్ల అయిష్టత వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం నిర్లిప్తతో వ్యవహరించి, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడనుకొన్నప్పుడు ఇతరుల మద్దతు కోసం ఎదురు చూసే పరిస్థితి ఏర్పడింది.
ఏదేమైనా రెజ్లర్ల ఆవేదనను రాజకీయ అంశాల ప్రాతిపదికను దృష్టిలో ఉంచుకొని కాకుండా, మన ఆడపడుచుల ఆత్మగౌరవం, వారిలో భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా పరిగణలోకి తీసుకోవాలి. హోమ్ మంత్రి అమిత్ షా వంటివారు చొరవ తీసుకొని ఒక పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో కర్ణాటకలో మాదిరిగా దేశవ్యాప్తంగా రాజకీయంగా కూడా మూల్యం చెల్లించే పరిస్థితి ఏర్పడవచ్చని తెలుసుకోవాలి.

చలసాని నరేంద్ర
9849569050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News