Saturday, May 4, 2024

మేడే స్ఫూర్తితో వర్గ ఉద్యమాలు నిర్మిద్దాం!

- Advertisement -
- Advertisement -

ప్రతి సంవత్సరం మే 1ని మేడేగా ప్రపంచ వ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం పోరాడుతామని కార్మికులు ప్రదర్శనలు, సభలు జరుపుతూ ఐక్యతను చాటుతారు. పాలకులు, పెట్టుబడిదారుల కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తామని శపథం చేస్తారు. 19వ శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభమైన పారిశ్రామిక విధానం వలన కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. వారికి నిర్ణీత పని గంటలు పని లేకపోవటం, ఎటువంటి హక్కులూ లేక పోవటం, రోజులో 14 నుండి 15 గంటల నిర్బంధ పనివేళలు అమలు జరగటం కార్మికుల దుర్భర పరిస్థితికి అద్దం పట్టింది. పనికి వెళ్లినవాళ్లు ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తారో తెలియదు.

ఇలాంటి పరిస్థితి వేలాది మంది కార్మికులను పొట్టన పెట్టుకుంది. ఇందుకు పారిశ్రామికవేత్తల ధనదాహమే కారణం. దుర్భర పరిస్థితుల నుంచి బయటపడాలనే ఆలోచన కార్మికుల్లో ప్రారంభమైంది. ఆ ఆలోచన లో భాగమే 1884 అక్టోబర్ 7న అమెరికాలోని చికాగో నగరంలో నిర్వహించిన కార్మిక సదస్సు సంఘటిత వాణిజ్య వ్యాపార సంస్థల కార్మిక సంఘాలు ఇందుకు నడుం బిగించాయి. పీడనకు వ్యతిరేకంగా, ఎనిమిది గంటల పని కోసం ఉద్యమించాలని అవగాహన సదస్సులో ఏర్పడింది. ఇందుకు కార్మిక సంఘాలు సన్నాహాలు ప్రారంభించాయి. సమ్మెకు సిద్ధమైనాయి. 1886 మే1 ఉదయం 10 గం. అమెరికా అంతటా సమ్మెసైరన్ మోగింది.13 వేల పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి.3 లక్షల మంది కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె ప్రారంభమైన 24 గం. తర్వాత కార్మికుల సంఖ్య 4 లక్షలకు చేరింది.చికాగో నగరంలో 40 వేల మంది కార్మికులు తమ కుటుంబాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. అనేక దేశాల్లో ఎర్ర జండాలు రెపరెపలాడాయి. ప్రభుత్వాలు బెంబేలుపడ్డాయి. పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పెట్టుబడిదారుల కనుసైగలతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు కార్మికులు నేలకొరిగారు.

కాల్పులకు వ్యతిరేకిస్తూ 1886 మే 4న ‘హే’ మార్కెట్ కార్మికులతో నిండిపోయింది. ఖబడ్దార్ మమ్ములను కాల్చి చంపుతారా అంటూ కార్మికుల ఆగ్రహావేశాల మధ్య సభ ప్రారంభమైంది. సభపై పోలీసులు దాడి చేయటంతో కార్మికులు తిరగబడ్డారు.చాలా మంది తలలు పగిలాయి, చేతులు, కాళ్లు తెగిపడ్డాయి. మార్కెట్ ప్రాంతం కార్మికుల రక్తంతో తడిచిపోయింది. ఏడుగురు పోలీసులు, ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కార్మిక నాయకులపై కేసులు బనాయించి 7 గురికి మరణశిక్ష, 8 మందికి 15 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించారు. చికాగో కార్మికుల పై పోలీసుల హింసాకాండను ఖండిస్తూ అనేక దేశాల్లో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి. కార్మికుల అమరత్వం 8 గంటల చట్టానికి నాంది పలికింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలనలో భారత కార్మికులు కూడా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. రోజుకి 12 నుండి 25 గం. పని చేశారు. ఎటువంటి హక్కులు లేవు. పరిస్థితులను మెరుగుపర్చుకునే ఆలోచనకు వచ్చారు. చికాగో కార్మికుల పోరాటానికి ముందే భారత కార్మికులు 8 గం. పని దినం డిమాండ్ చేశారు.

భారతీయ రైల్యే కార్మికులు 1862లో 8 గం. పని డిమాండ్ చేస్తూ మొట్టమొదటి సమ్మె చేశారు. సమ్మెపై వలస పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. కొందరు కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు.మద్రాస్ ప్రెసిడెన్సీలో 1882-90 మధ్య 25 సమ్మెలు జరిగాయి. బెంగాల్ జూట్ మిల్లుల్లో జరిగిన సమ్మెలు చాలా ముఖ్యమైనవి. 1905లో భారత ప్రభుత్వ ముద్రణాలయ కార్మికులు నెల రోజులు సమ్మె చేశారు. చారిత్రక విజయం సాధించారు. నవంబర్ 18, 1907లో బెంగాల్ లోని అసన్సోల్‌లో తమ డిమాండ్ల సాధన కోసం రైల్వే కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మె దేశవ్యాప్తంగా విస్తరించింది. బాలగంగాధర్ తిలక్‌పై విచారణను వ్యతిరేకిస్తూ 1908 లో బొంబాయిలోని కాటన్, గ్రీవ్స్ మిల్లు కార్మికులు పని నిలిపి వేశారు. భారతదేశ శ్రామికవర్గం చేసిన మొట్టమొదటి రాజకీయ సమ్మె ఇది. అన్ని బట్టల మిల్లులు, రైల్వేవర్క్‌షాప్‌ల కార్మికులు 1920 సమ్మె చేశారు. బ్రిటిష్ వలస పాలకులు సైన్యాన్ని ప్రయోగించి అణచివేతకు పూనుకోగా 16 మంది కార్మికులు చనిపోయారు, 50మంది గాయపడ్డారు.

నెహ్రూ దగ్గర నుంచి మోడీ వరకు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు జరుపుతూనే ఉన్నారు. సామ్రాజ్యవాదుల, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలు కాపాడుతూనే ఉన్నారు. రాజీవ్ గాంధీతో ప్రారంభమై నూతన ఆర్ధిక విధాలు మన్మోహన్ సింగ్ పాలనలో తీవ్రమై ప్రపంచ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయడంతో పరిపూర్ణమైంది. ఎటువంటి మినహాయింపు లేకుండా మోడీ ప్రభుత్వం నూటికి నూరు శాతం పెట్టుబడిదారీ విధానాలను అమలు జరుపుతున్నది. అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు చొరబడ్డాయి. పి.వి నరసంహరావు, మన్మోహన్ సింగ్ పాలనలో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ మోడీ పాలనలో పరాకాష్ఠకు చేరి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను అమ్మకానికి పెట్టారు. 49 పరిశ్రమలను కారుచవకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టారు. బడా వ్యాపార వేత్తలు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను మొండి బకాయిల పేరుతో రద్దు చేశాడు. బిజెపి పార్టీ మొదటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలు కలిగి ఉంది.

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News