Wednesday, May 15, 2024

పమాదస్థాయిని దాటిన యమునానది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాల్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలకు దేశ రాజధాని ఢిల్లీ సహా రాజస్థాన్, పంజాబ్ , హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు విలవిలలాడుతున్నాయి. ఎగువ రాష్ట్రాలనుంచి వరదనీటిని వదిలిపెడుతుండడంతో దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదస్థాయి (205.33 మీటర్లు)ని మించి ఉప్పొంగి ప్రవహిస్తోంది.

మంగళవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని పాతరైల్వే వంతెన వద్ద యమునా నది నీటిమట్టం 206.28 మీటర్లుగా ఉంది.మంగళవారం సాయంత్రానికి ఇది మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. నది ఉధృతితో ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అక్కడి ప్రజలను ఖాళీ చేయించే ప్రక్రియను చేపట్టారు. అలాగే పాత రైల్వే వంతెనపై రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.

బుధవారంనుంచి వరద ఉధృతి తగ్గుముఖం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీలో ఈ నది అత్యధిక వరద ముప్పు 207.49 మీటర్లు. ప్రస్తుతానికి ఆ మారు చేరే అవకాశం లేదని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వైపు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మంగళవారం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఏది ఏమయినా మరో రెండు రోజుల పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News