Wednesday, October 9, 2024

సంజయ్, మీకు ఇస్లామోఫోబియా వ్యాధి పట్టుకుంది: ఓవైసీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మదర్సాలు తమ విద్యార్థులకు ఏకె-47 రైఫిల్స్ ఉపయోగించడంలో తర్ఫీదునిస్తున్నాయని సంజయ్ కుమార్ వ్యాఖ్యానించినందుకు ఆయన తప్పు పడుతూ విరుచుకుపడ్డారు. మజ్లీస్ ప్రధానకార్యాలయం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘‘మీకెందుకు ముస్లింలంటే అంత ద్వేషం? మీకు ఇస్లామోఫోబియా వ్యాధి పట్టుకుంది’’ అన్నారు.

‘‘దేశ స్వాతంత్ర్య సమరంలో ముస్లింలు త్యాగాలు చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలంటూ మదర్సాలు ఫత్వాలు కూడా జారీచేశాయి’’ అని అసదుద్దీన్ ఓవైసీ వివరించారు.

‘‘దమ్ముంటే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మణిపుర్ కు వెళ్లాలి. అక్కడ పోలీసుల ఆయుధాలు కూడా ఎత్తుకుపోయారు’’ అని తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా ముస్లింల ఆస్తులకు ముప్పు వాటిల్లగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దస్తావేజులు, యాజమాన్య హక్కు పత్రాలు లేకపోతే ఎవరైనా వక్ఫ్ /ముస్లింల ఆస్తులను స్వంతం చేసుకునే ముప్పు ఉంటుందని అన్నారు. ‘వక్ఫ్ బై యూజర్’ అన్నది తొలగిస్తే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువేనని ఆయన వివరించారు.

‘‘ఆర్ఎస్ఎస్ మనస్తత్వం ఉన్న వాళ్లు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారు. ఇక హిందూ ధర్మాదాయ భూముల ఆక్రమణల గురించైతే చెప్పనవసరం లేదు’’ అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా కాశీ, మథురలోని మా మసీదులను లాగేసుకోవాలని చూస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అయితే 30000 మసీదులు తమవేనని, ముస్లింలవి కావని అంటోంది’’ అంటూ ఆయన వివరించారు.

‘‘ప్రధాని నరేంద్ర మోడీ అలజడులున్న మణిపూర్ కైతే వెళ్లడం లేదు కానీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు’’ అని నిందించారు. ‘మణిపుర్ లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ మహిళలను బలాత్కరిస్తున్నారని వార్తలు వస్తున్నాయి’ అని కూడా తెలిపారు.

‘ఏడాది కాలంగా మణిపుర్ నిప్పుల కాష్టం అయింది. మన ప్రధాని మోడీ ఏమి చేస్తున్నారు? ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ఆయన జాతీయ భద్రతా సలహాదారు ను పుతిన్ వద్దకు పంపారు. జెలెన్స్కీ వద్దకు పంపారు. ఇల్లు తగలబడుతుంటే చీమ కుట్టినట్లు లేదు, కానీ వేరే దేశంలో యుద్ధం జరుగుతుంటే చిందులేస్తున్నారు’’ అని విమర్శించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News