Friday, April 26, 2024

అమెరికా సాయం విరాళం కాదు.. పెట్టుబడి : జెలెన్‌స్కీ

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌కు అమెరికా అందజేసే నిధులు, ఆయుధాలు వంటివి విరాళం కాదని, అది పెట్టుబడితో సమానమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన నేడు కాంగ్రెస్‌లో ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ డబ్బు విరాళం కాదు.. ప్రపంచ భద్రత, ప్రజాస్వామ్యాలకు పెట్టుబడి. నేను ఇక్కడ ఉండటాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఉక్రెయిన్ కుప్పకూలదు. సజీవంగానే ఉండి పోరాడుతుంది. ప్రపంచం దృష్టిలో మేము రష్యాను ఓడించాము.

శాంతి కోసం మేము చేస్తున్న ప్రయత్నాలకు బైడెన్ సహకరించారు. ఆయనకు ధన్యవాదాలు.. అమెరికా బలంగా, సమష్టిగా ఉందని చెప్పేందుకు ప్రతి ఒక్క సభ్యుడు సహకరించాలి అని జెలెన్‌స్కీ అభ్యర్థించారు. జెలెన్‌స్కీ కాంగ్రెస్ సభ లోకి అడుగు పెడుతున్న సమయంలో కొందరు సభ్యులు ఉక్రెయిన్ పతాకాల్ని ప్రదర్శించారు. తన పర్యటనలో భాగంగా జెలన్‌స్కీ శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ రష్యాతో యుద్ధం ఎన్నాళ్లు కొనసాగినా ఉక్రెయిన్‌కు అమెరికా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఉక్రెయిన్ ఎప్పటికీ ఒంటరిది కాదని పేర్కొన్నారు. రెండు బిలియన్ డాలర్ల సరికొత్త ప్యాకేజీని బైడెన్ ధ్రువీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బైడెన్ మాట్లాడుతూ మిత్ర పక్షాలను కలిపి ఉంచడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కొంతమంది మిత్రులు యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన , ఆహార కొరత కారణంగా ఇబ్బందికి గురవుతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఉక్రెయిన్‌కు మద్తతు విషయంలో అందరూ సంఘీభావంతో ఉన్నారన్నారు. యుద్ధం ఆపే ఉద్దేశం పుతిన్‌కు లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News