Sunday, April 28, 2024

షర్మిల డబుల్ గేమ్!

- Advertisement -
- Advertisement -

పార్టీలు సిద్ధాంతాలమీదనే పుట్టుకొస్తుంటాయి.. అయితే ఎన్నికల సమయం వచ్చేసరికి సిద్ధాంతాలు కాస్త పక్కకు జరిగి ఆ స్థానంలో, వ్యక్తులు, వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే ప్రాధాన్యతకోసం ముందుకు తోసుకు వస్తుంటాయి. ఇటువంటి పరిణామాలు ఏ పార్టీకీ కొత్త కాకపోయినా.. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పుట్టుకు వచ్చిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి కూడా మినహాయింపు లేకుండా పోయింది. రాజకీయరంగంలో డబుల్ గేమ్ అంటే ఏమిటో కొత్త అర్ధాన్ని వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అవిష్కంరించినంతగా మరే పార్టీ కూడా ఇంతగా ఆవిష్కరించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ముద్దు కాని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం వద్దు అన్నంతగా సాగుతున్న డబుల్‌గేమ్ రాజకీయాలు ఇకపై తెలంగాణ రాష్ట్ర రాజకీయ రంగంలో షురూ కానున్నాయి.

ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డికి రాజకీయ రంగం కొత్తదేమి కాదు. ఎటొచ్చి తాను పెట్టిన పార్టీనే ప్రజలకు కొత్తగా కనిపిస్తుంది. ఆరు దశాబ్దాల కిందటి నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ అన్న పేరు బాగా సుపరిచితమే. అంతటి పాపులారిటీ ఉన్న కుటుంబంలో జన్మించిన షర్మిల కూడా రాజన్న బిడ్డగా చెప్పుకుంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా వేలకిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు. ఉమ్మడి ఏపికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయగా షర్మిల తన సొంతపార్టీ ద్వారా రాజకీయ యవనికపై సరికొత్త రీతిలో తెలంగాణ గడ్డపై అరంగ్రేటం చేశారు.
రెండు నెలల ముందే సీట్ల ప్రకటన
ప్రజాసమస్యలే ప్రాతిపదికగా ఉద్యమాల బాటలో రాష్ట్ర ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిచారు. ఏ పార్టీ అయినా, నాయకుడైనా ఎన్ని ఉద్యమాలు చేసినా, అంతకు మించి మరెన్ని సిద్ధాంతాలు వల్లెవేసినా చివరకు చేరేగమ్యం మాత్రం ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించటం, అధికారానికి చేరువ కావటమే . షర్మిల కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాలకు వైఎస్‌ఆర్‌టిపి అభ్యర్దులను పోటీ చేయిస్తున్నట్టు రెండు నెలల ముందే ప్రకటించారు. పోటీకీ ఆస్తకి ఉన్న వారినుంచి పార్టీలో దరఖాస్తుల స్వీకార ప్రక్రియ కూడా నడిచింది. తాను కూడా పాలేను నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించి తన సీటు తానే ఖరారు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా పాలేరులోనే నివాసం ఉంటానని ప్రజలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మరే నియోజకవర్గంలో లేని స్థాయిలో పార్టీ కార్యాలయాన్ని కూడా పాలేరులో ఏర్పాటు చేసుకున్నారు.

పలుమార్లు పార్టీ ముఖ్యనేతలతో సమీక్షలు సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే షర్మిల మాత్రం ఎన్నికల సమరాంగానికి చేరువ కాకముందే అస్త్ర సన్యాసం చేశారు. ఎన్నో నిద్రలేని రాత్రుల మధ్య అంతర్మధనం చెంది చిట్టచివరకూ ఒక నిర్ణయానికి రాగలిగారు. తనే పాలేరు నియోజకవర్గం నుంచి వైదొలిగారు అంతే కాకుండా పార్టీని కూడా త్యాగాలకు సిద్ధం చేశారు. ఈ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయటం లేదని ప్రకటించా రు. అంతే కాకుండా మరో పార్టీని గెలిపించేందుకు పార్టీ నాయకులంతా త్యాగాలు చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత్రి ఆదేశాలపై గుర్రుమన్న ఒకరిద్దరు నేతలు లోటస్‌పాండ్ గట్టున గళాలను శృతి చేసి త్యాగరాయకీర్తనలను వినిపించాలని ప్రయత్నాలు చేసినా, నిరసన కీర్తనల శబ్దాలు పార్టీ గేటు దాటి లోపలికి కూడా ప్రవేశించలేకపోయాయి.
కాంగ్రెస్ అగ్రనేతలకు చేరువగా…
దేశరాజధాని ఢిల్లీలో అగ్రనేతలు సోనియాగాంధీ రాహుల్‌గాంధీ ప్రియాంకగాంధీ వద్ద షర్మిల తనకు ఉన్న ఆదరాభిమానాలను తన పార్టీ కార్యకర్తల కళ్లకు కట్టినట్టుగా చూపే ప్రయత్నం చేసి కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిపేదిశగా పార్టీ యంత్రాంగాన్ని శృతి చేస్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పలుమార్లు పార్టీ వేదికలపైనే బహిరంగంగా విమర్శించిన షర్మిల తన స్టాండ్‌ను మాత్రం మార్చుకోలేదు. తెలంగాణ ఎన్నికల్లో అధికార బిఆర్‌ఎస్ పార్టీని ఓడించటం, కేసిఆర్ ప్రభుత్వాన్ని మార్చటమే తమ లక్షం అని ప్రకటించారు. కాంగ్రెస్‌పార్టీ విజయానికి చేరువలో ఉందని బలంగా నమ్ముతున్నట్టు వెల్లడించారు. బేషరతుగా కాంగ్రెస్‌పార్టీకి ఈ ఎన్నికల్లో మద్దతు ఇస్తన్నట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌తెలంగాణ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన చేసి రెండురోజులైనా గడవకముందే గేమ్ స్టార్ట్ అనేశారు.

ఎన్నికల వేళ మీడియా సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్‌రెడ్డి రేటెంత రెడ్డి అనేశారు. ఆయన దొంగ అని న్యాయస్థానాల్లో కేసులను ఉటంకించారు.దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదని ప్రజలకు సూచించారు. ఒకవైపు కాంగ్రెస్‌పార్టీకి ఎన్నికల్లో మద్దతు చెబుతూనే మరోవైపు ఆ పార్టీ పిసిసి అధినేతను దొంగ, రేటెంతరెడ్డి అంటూ విమర్శలు సంధించిన తీరు పట్ల రాజకీయ నేతలు ఆశ్చర్యం నుంచి తేరుకోకముదే ఎన్నికల చదరంగంలో డబుల్ గేమ్‌ను స్టార్ట్ చేశారు. షర్మిల ప్రారంభించిన ఈ గేమ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతలనే కాకుండా సొంతపార్టీ కార్యకర్తలను ఆయోమయంలో పడవేసింది.
బుజ్జగింపులు షురూ
వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీలోని గట్టు రామచంద్రరావు వంటి కొందరు ముఖ్యనేతలుగా చలామణి అయిన వారు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అంతటితో ఆగకుండా షర్మిల తమను ఎన్నికల సమయంలో నట్టేట ముంచిందంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. పార్టీ అధినేత షర్మిలను పార్టీ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత వారిలో కొందరిని షర్మిల తన వద్దకు రప్పించుకొని బుజ్జగించడంతో కొందరు మెత్తబడి షర్మిలకు జై కొట్టారు. మరి కొందరు గట్టు నాయకత్వంలో బిఆర్‌ఎస్ పార్టీ బాట పట్టారు. పార్టీ అగ్ర నేతల సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News