Wednesday, December 4, 2024

జడ్చర్లలో వెలుగులోకి వచ్చిన జైనుల్లబుద్దీన్ బాబా బాగోతం..

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : నగ్నంగా స్త్రీ పూజ చేస్తే సొమ్ములు, కానుకలు కదిలి వస్తాయి. పూజ చేసే సమయంలో ఫోటోలు, వీడియోలు తిసినా డిస్టర్బ్ చేయరాదు .. పూజలో లీనమైపోవాలి. అంతకుమించి కనకవర్షం కురియాలంటే హైదరాబాద్‌లోని మా గురువు దగ్గర ఓ రోజు నగ్నంగా గడిపితే చాలు … కాసుల వర్షం … కనక వర్షం కురుస్తుంది. అయితే ఓ షరతు ….గురువుతో గడిపే సమయంలో కించిత్ వేరే భావన మదిలో మొదలకూడదు. పరాయి వారితో గడుపుతున్నామనే భావన ఒక సెకండ్ సమయం కూడా ఆలోచించకూడదు. ఒకవేళ అలాంటి ఆలోచన మనసులో వస్తే ఇక అంతే. ధారగా కురిసే కనకవర్షం మధ్యలో ఆగిపోతుంది. ఇక మీ అదృష్టం మరుగున పడి దురదృష్టం ఆవహిస్తుంది. ఫోటోలు, వీడియోలు తీసినా ఏమీ అనవద్దు, ఒక వేళ ఏమైనా అంటే ఇక అంతే. మీకు రావాల్సిన అదృష్టం మాయమైపోతుంది.

ఇవి వారు చెప్పే మాటలు. ఇదంతా వినడానికి విడ్డూరంగా ఉంది. కదూ కానీ ఇది అక్షరాల సత్యం. ఇది ఎక్కడో మారుమూల అడవి ప్రాంతంలో జనజీవనం లేని నిర్జీవ ప్రాంతంలోని సంఘటన కాదు. అత్యంత రద్దీ ప్రాంతమైన బెంగళూరు హైవేను ఆనుకొని, అనుసంధానం చేసుకొని ఉన్న ఖరీదైన జడ్చర్ల పట్టణంలోనిది. ఈ ఘటన మరో విచిత్రం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, అటు కర్ణాటక రాష్ట్రంలోని మహిళలు కూడా ఇక్కడ రావడం విశేషం. మహిళలకు మాత్రమే జైనుల్లబుద్దీన్ బాబా బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. దీంతో జడ్చర్లలో ఈ బాబా దగ్గరికి క్యూ కడుతున్నారు. మహిళలు, రాష్ట్ర రాజధానికి అతి సమీపంలో ఉన్న జడ్చర్ల పట్టణంలో మహిళలకు మాయ మాటలు చెప్పి జైనుల్లబుద్దీన్ నగ్న పూజలు చేస్తున్నాడు. చిత్ర విచిత్రంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నాడు. ఆ ఫోటోల ఆధారంగా మహిళలను బ్లాక్ మెయిల్ చేసి రకరకాల రూపంలో వాడుకుంటున్నాడు. డబ్బులు గుంజుతున్నాడు.

ఈ విషయం బయటపడితే పరువు పోతుందని, డబ్బుకు ఆశపడి నగ్నంగా పూజ చేయించుకున్న వందలాది మంది బాధితులు తమ బాధను లోపలే దిగమింగుతున్నారు. చెప్పుకుంటే పరువు పోతుంది. చెప్పకపోతే ప్రాణం పొతుంది. అన్నట్లు మహిళల బాధ అంతా ఇంతా కాదు. చివరకు ఒకరిద్దరు మహిళలు ధైర్యం చేసి ఈ బాబా నగ్న పూజల ముసుగును తొలగించారు. జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి బాబా నగ్న పూజలను, రాసలీలలను వెలుగులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఈ విషయంపై రాష్ట్ర మహిళా కమిషన్ , జాతీయ మహిళా కమిషన్, ఇతర మహిళా సంఘాలు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానిక మహిళలు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా మహిళ కమిషన్ దృష్టికి రాకపోవడం గమన్హారం.
నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలి …
మహిళలకు మాయ మాటలు చెప్పి లైంగికంగా హింసకు గురి చేసిన బాబా జైనుల్లబుద్దీన్ అతని అనుచరులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గి పోలీసులు నామ మాత్రం కేసులు నమోదు చేస్తే ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరిస్తున్నారు. హస్తరేఖలు, పుట్టుమచ్చలు, ఇతర మరకల ఆధారంగా ఉన్నది. ఉన్నటుల్ చెబుతాం. మీరు కోరినట్లుగా జాతకం మారుస్తాం. ఆ తర్వాత మీరు అనుకున్నది జరుగుతుంది. కనకవర్షం కురిపిస్తాం అంటూ అమాయక మహిళలకు పలువురు మాయమాటలు చెప్పి న్యూడ్ ఫోటోలు సేకరించారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగు చూడగా తవ్విన కోద్ది వారి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ఈ ముఠాలో ఓ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెల్సింది. ఈ మేరకు మరో ఇద్దరి పేర్లు వెలుగులోకి రాగా వారి కోసం గాలిస్తున్నట్లు విశ్వనీయవర్గాల సమాచారం.

ఉమ్మడి మహబూబ్‌నగర్ , రంగారెడ్డి జిల్లాల్లో జాతకాలు మారుస్తామంటూ పలువురు సుమారు మూడు నెలల క్రితం తమతమ స్థానిక ప్రాంతాల్లో జ్యోతిష్య కేంద్రాలు పెట్టుకున్నారు. ఇలా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల, నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని కోడుపర్తి, హైదరాబాద్ , వికారాబాద్ జిల్లా ఆమన్‌గల్‌లో ఎవరి ఇళ్ల వద్ద వారు కార్యాకలాపాలు ప్రారంభించారు. తమ దగ్గరికి వస్తే మంచి జరుగుతుందంటూ తెలిసిన వారి నుంచి విసృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా పూలు, పండ్లు, కూరగాయాలు విక్రయించే అమాయక మహిళలకు వల వేశారు. ఇలా పురుషులు సైతం చాలా మందివారికి చిక్కినట్లు సమాచారం. శరీరంపై పుట్టుమచ్చలను తాము స్వయంగా చూసి గుర్తిస్తేనే జాతకం పక్కాగా ఉంటుందని చెప్పారు. ఫోటోలను పైకి పంపిస్తామని, అక్కడ అమ్మవారికి పూజలు చేస్తారని, మీకు అమ్మవారి పూనకం వస్తుందని, ఆ తర్వాత కనక వర్షం కురుస్తుందని, అప్పుడే మాకు కొంత ముట్టాజెప్పాలని నమ్మబలికారు.

అలా ఒక్కొక్కరి వద్ద న్యూడ్ ఫోటోలను సేకరించినట్లు సమాచారం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌తో పాటు రంగారెడ్డి జిల్లాలో బాధితులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన క్రమంలోనూ జాకరం పేరిటఅమాయక ప్రజలను తమ వద్దకు మూడు పర్యాయాలు రప్పించుకొని న్యూడ్ ఫోటోలు సేకరించిన అక్రమార్కులు బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడిన క్రమంలో వారి బాగోతం బట్టబయలైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒకరు ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దీని ఆధారంగా విచారించిన పోలీసులు జైనొద్దిన్ రాములు అనే వ్యక్తులను ఓ పౌల్ట్రీఫాం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని విచారించిన క్రమంలో తిరుపతి, శంకర్ పేర్లు వెలుగులోకి వచ్చినట్లు తెల్సింది. వారిని పట్టుకునేందుకు ఓ పోలీస్ బృందాన్ని కేటాయించినట్లు వినికిడి. దీనిపై పోలీస్ అధికారులను సంప్రదించగా విచారణ జరుగుతోంది. పూర్తయిన తర్వాత వెల్లడిస్తాం అని సమాధానమిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News