Thursday, May 2, 2024

10 మంది బిజెపి ఎంపీల రాజీనామా

- Advertisement -
- Advertisement -

3 రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రత్యక్షం

న్యూఢిల్లీ: రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన బిజెపికి చెందిన 10 మంది ఎంపీలు బుధవారం తమ రాజీనామాలను లోక్‌సభ, రాజ్యసభ సభాపతులకు సమర్పించారు. రాజీనామాలు సమర్పించిన ఎంపీలలో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్ కూడా ఉన్నారు. తొమ్మిది మంది లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యుడు కిరోరీ లాల్ మీనా తమ రాజీనామాలను సమర్పించారు. వీరిలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, రాకేష్ సింగ్, రాజ్యవర్ధన్ రాథోర్, దియా కుమారి, ఉదయ్‌ప్రతాప్ సింగ్ కిరోరి, లాల్ మీనా, రితీ పాఠక్, అరుణ్ సావ్, గోమతి సాయి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన మరికొందరు ఎంపీలు కూడా త్వరలోనే రాజీనామా చేయనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుకా సింగ్‌తోపాటు బాబా బాలక్‌నాథ్ కూడా రాజీనామా చేయవలసి ఉంటుంది. బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా నాయకత్వంలో ఈ 10 మంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. అనంతరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను కలుసుకుని తమ రాజీనామా లేఖలను అందచేశారు. పార్టీ అధ్యక్షుడు, నడ్డాను, ప్రధాని మోడీని కలుసుకున్న తర్వాతే రాజీనామా చేయాలన్ననిర్ణయాన్ని ఆ 10 మంది ఎంపీలు తీసుకున్నారని పారీ వర్గాలు తెలిపాయి.

మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందిన బిజెపి నాయకుడు ప్రహ్లాద్ సింగ్ పటేల్ తాను ఎంపీ పదవికి రాజీనామా చేసిన విషయాన్ని దృవీకరించారు. త్వరలోనే కేంద్ర క్యాబినెట్‌కు కూడా రాజీనామా చేస్తానని ఆయన తెలిపారు. బిజెపి ఎంపీలు అరుణ్ సావ్, గోమతి సాయి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కాగా ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్, దియా కుమారి, రాజ్యసభ సభ్యుడు కిరోరీ లాల్ మీనా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. కాగా..ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఎవరినీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News