Friday, March 29, 2024

పదేళ్ళ పోక్సో

- Advertisement -
- Advertisement -

 

కామోన్మాదుల నుంచి పిల్లలను కాపాడడానికి పదేళ్ళ క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో (లైంగిక అత్యాచారాల నుంచి బాలలను రక్షించే) చట్టం ఆశించిన ప్రయోజనం కలిగించిందా? ఈ ప్రశ్నకు అవును అని గట్టిగా సమాధానం చెప్పలేము. ఎందుకంటే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఈ కేసులు తగ్గడానికి బదులు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బాలికలను మచ్చిక చేసుకొని లైంగిక హింసకు గురి చేస్తున్న ఉదంతాలు ఉధృతమయ్యాయి. 18 ఏళ్ళ లోపు బాల బాలికలను లైంగిక దాడుల నుంచి కాపాడడం కోసం 2012 నవంబర్ 14 బాలల దినోత్సవం నాడు పోక్సో అవతరించింది. 2016-2020 మధ్య పోక్సో కేసులు 30 శాతం పెరిగాయి. 2019, 2020లలో చెరి 47,000లకు పైగా కేసులు రికార్డయ్యాయి. అంటే రోజుకి 129 ఘటనలు సంభవించాయి.

2017-2020 మధ్య సంభవించిన ఉదంతాల్లో 97 శాతానికి పైగా బాలికలపై జరిగిన అత్యాచారాలే కావడం గమనార్హం. బాలురపై జరిగినవి 2.3 నుంచి 2.8 శాతం మాత్రమే. బాలికలతో పాటు బాలురను కూడా లైంగికంగా వినియోగించుకొనే దుర్మార్గాలను అరికట్టడం కోసం పోక్సోను తీసుకు వచ్చారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవరే కిండర్ గార్టెన్ స్థాయిలోని నాలుగేళ్ళ పసిపాపపై లైంగిక దురాగతానికి పాల్పడిన ఉదంతం బయటపడి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే ఢిల్లీలోని ఒక పాఠశాలలో 11 ఏళ్ళ బాలికపై ఇద్దరు సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంభవించింది. పదేళ లోపు వివాహిత బాలికలు దేశంలో 78 లక్షల 40 వేల మంది వున్నారంటే వారి బాల్యం ఎంతగా బండబారిపోయిందో తెలుస్తున్నది.

15 సంవత్సరాల వయసులోని బాలికను అపహరించి పెళ్ళి చేసుకొన్నానన్న సాకుతో గర్భవతిని చేసిన 31 సంవత్సరాల వ్యక్తికి సంబంధించిన కేసులో అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు ముస్లిం పర్సనల్ లా కింద జరిగే ఇటువంటి వివాహాలు పోక్సో చట్టానికి అతీతం కావని తాజాగా స్పష్టం చేసింది. బాల్య వివాహం అనేది సమాజానికి ఒక శాపం వంటిదని, వివాహితుల్లోని ఏ ఒక్కరైనా మైనర్ అయితే అది పోక్సో చట్టం కింద నేరం అవుతుందని, పెళ్ళి మాటున అయినా బాలలతో లైంగిక చర్యకు పాల్పడడాన్ని ఈ చట్టం నిషేధిస్తున్నదని న్యాయస్థానం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. పోక్సో చట్టం కింద నమోదు అవుతున్న కేసులను గమనిస్తుంటే దేశంలో గల 44 కోట్ల పైచిలుకు బాలల్లో అనేక మంది సురక్షితంగా లేరనే అభిప్రాయం కలుగుతుంది. బాలల హక్కుల రక్షణకు భారత రాజ్యాంగం హామీ ఇస్తున్నది.

ఇందుకు సంబంధించి రూపొందించిన అంతర్జాతీయ ఒప్పందాలపై భారత దేశం సంతకం చేసింది. అయితే బాలలపై లైంగిక అత్యాచారాలను అరికట్టడానికి ఐపిసి (భారతీయ శిక్షా స్మృతి) మినహా వేరే ఏర్పాటు లేదు. ఐపిసి తగినంత పకడ్బందీగా లేకపోడం, 1990లలో గోవాలో పెద్ద ఎత్తున బాలలపై అత్యాచార ఘటనలు జరగడంతో వారి హక్కుల రక్షణ కోసం కొత్త మార్గాలు వెతకడం ప్రారంభమైంది. ప్రఖ్యాత న్యాయమూర్తి విఆర్ కృష్ణయ్యర్ ఇందుకు సంబంధించి ఒక ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. పిల్లలపై జరిగే వివిధ నేరాలను అరికట్టడానికి 2005లో కేంద్ర ప్రభుత్వ మహిళ, శిశు అభివృద్ధి విభాగం ఒక ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఈ విధంగా జరిగిన అనేక ప్రయత్నాలు పోక్సో చట్టం అవతరణకు దారి తీశాయి. అయితే ఈ చట్టం కింద నమోదవుతున్న 43.44 శాతం కేసుల్లో నిందితులు విడుదలైపోతున్నారు.

కేవలం 14.03 శాతం కేసుల్లోనే శిక్షలు పడుతున్నాయి. ప్రతి మూడు పోక్సో కేసుల్లో నిందితులు శిక్షలు పడకుండా బయటపడుతుంటే ఒక్క కేసులో మాత్రమే శిక్ష పడుతున్నది. 2012లో నమోదైన 96 శాతం కేసుల్లో బాధితులైన బాలలకు నేరస్థులతో పూర్వ పరిచయం వున్నట్టు తేలింది. చట్ట ప్రకారం బాలలపై అత్యాచార కేసులను ఏడాదిలో పరిష్కరించాలి. కాని వాస్తవంలో దానిని పాటించలేకపోతున్నాము. కేసులు తేలడానికి ఏళూపూళ్లూ పడుతున్నాయి. దీని వల్ల విచారణ సమయంలో బాధిత బాలలు మానసిక వేదనకు గురవుతున్నారు. కేసులు తొందరగా గట్టెక్కడానికి ప్రత్యేక న్యాయస్థానాల నియామకం కూడా జరుగుతున్నది. అయినా ప్రయోజనం కలగడం లేదు.

మొత్తం పెండింగ్ కేసుల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే వున్నట్టు సమాచారం. కేసు నడుస్తున్న సమయంలో బాధిత బాలలకు సహాయకులను ఏర్పాటు చేయాలన్న నిబంధన అమలుకు నోచుకోడం లేదు. బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో మాట్లాడి కేసులో కీలకమైన ముడులను విప్పడంలో సహాయకులుగా బాలల హక్కుల సంస్థలకు చెందిన వారు ఉపయోగపడతారు. 96 శాతం కేసుల్లో ఈ సహాయకులను నియమించలేదని సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. బాలలపై అత్యాచారమనే అంశమే అత్యంత జుగుప్సాకరమైనది, బాధాకరమైనది. పోక్సో చట్టం కూడా దీనిని అరికట్టలేకపోతున్నదనే చేదు వాస్తవం మరింత వేదనకు గురి చేస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News