Friday, April 26, 2024

ఆల్ఫాబెట్‌లో 10,000 ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

 

న్యూయార్క్ : అమెరికా కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలు ఖర్చును తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన ఉద్యోగులలో 10,000 మందిని తొలగించబోతోంది. మెటా, అమెజాన్, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్ తర్వాత ఆల్ఫాబెట్ కూడా సిబ్బందిని తొలగించేందుకు సిద్ధమైంది. ఈ కంపెనీ తన మొత్తం శ్రామిక శక్తిలో 6 శాతం ఉద్యోగులను తొలగించవచ్చని తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం, పేలవమైన పనితీరు ఉన్న ఉద్యోగుల ర్యాంకింగ్, పనితీరు మెరుగుదల ఆధారంగా గూగుల్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించిందని సమాచారం. కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ ద్వారా వచ్చే ఏడాది ప్రారంభంలో పనితీరు బాగాలేని వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నారు.

నిర్వాహకులు ఈ ఉద్యోగుల కోసం రేటింగ్‌లను ఉపయోగించనున్నారు. తద్వారా వారికి బోనస్‌లు, స్టాక్ గ్రాంట్‌లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త విధానం ద్వారా పనితీరు బాగా లేని 6 శాతం అంటే 10,000 మంది ఉద్యోగులను ప్రత్యేక కేటగిరీలోకి తీసుకొనున్నారు. ఆల్ఫాబెట్‌లో మొత్తం 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్‌లో పనిచేసే ఉద్యోగి సగటు జీతం 2,95,884 డాలర్లు(రూ.2.41 కోట్లు) ఉంటుంది.

2022 మూడో త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై సంక్షోభం, మాంద్యం ప్రభావం వల్ల ఆల్ఫాబెట్ లాభం 27 శాతం క్షీణించి 13.9 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఆదాయం 6 శాతం పెరిగి 69.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇటీవల ఆల్ఫాబెట్ సిఇఒ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్‌ను 20 శాతం మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ ప్రకటన ద్వారా ఆయన ఉద్యోగాల కోత సూచనలను ఇచ్చారు. నివేదిక ప్రకారం, తొలగించిన కొంతమందికి ఆల్ఫాబెట్ సంస్థలో కొత్త పాత్రల కోసం దరఖాస్తు చేసుకోవడానికి 60 రోజుల సమయం ఇచ్చింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News