Friday, April 19, 2024

యువకుడి బ్యాగులో గంజాయి పెట్టి బెదిరింపులు.. ఇద్దరు పోలీసుల సస్పెండ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఒక యువకుడి బ్యాగులో గంజాయి పెట్టి అతడిని బెదిరించి డబ్బు వసూలు చేయబోయిన ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్ సస్పెండ్ అయ్యారు. తమ అధికారాన్ని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ దుర్వినియోగం చేసినట్లు రుజువైందని బెంగళూరులో సోమవారం ఆగ్నేయ డిసిపి సికె బాబా వెల్లడించారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వైభవ్ పాటిల్ అనే యువకుడి బ్యాగులో గంజాయి పెట్టి అతని నుంచి రూ.2,500 ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ డిమాండు చేశారని ఆయన చెప్పారు.
ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే పాటిల్‌కు రూ.22 వేలు స్టైపెండ్ వస్తుందని, బైకులో వెళుతున్న పాటిల్‌ను ఆ ఇద్దరు కానిస్టేబుల్స్ ఆపి అతడిని ప్రశ్నించారని బాబా చెప్పారు.

ఇద్దరిలో ఒకతను పాటిల్ నుంచి బ్యాగు తీసుకుని గంజాయి తాగుతావా అని ప్రశ్నించారు. తాను తాగనని పాటిల్ చెప్పాడని ఆయన తెలిపారు. ఈ సమయంలో అతడి బ్యాగులోకి ఒక కానిస్టేబుల్ గంజాయిని చేర్చాడని, దాన్ని చూపించి అరెస్టు చేస్తానని బెదిరించాడని ఆయన వివరించారు. పాటిల్ నుంచి రూ. 2,500 వసూలు చేశారని, ఇంటికి వెళ్లడానికి కనీసం రూ. 100 ఇవ్వండని పాటిల్ బతిమాలినా ఆ కానిస్టేబుల్స్ ఇవ్వలేదని డిసిపి తెలిపారు.

ఈ సంఘటనపై పాటిల్ వరుసగా ట్వీట్లు చేయడంతోపాటు బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. తనను అనవరంగా డ్రగ్స్ కేసులో ఇరికించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని అతను ఫిర్యాదు చేశాడు. పాటిల్ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన బండేపాల్య పోలీసులు ఆ ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌ను గుర్తించి వారి నుంచి లిఖితప్వూకంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. వారిద్దరూ నేరం చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్ చేశారు. పోలీసులు నచ్చచెప్పడంతో పాటిల్ తాను పెట్టిన ట్వీట్లను తొలగించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News