సంపాదకీయం: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు పాలక, ప్రతిపక్షాల మధ్య వైరుధ్యమనే ఎడతెగని కుంభవృష్టికి గురై నిరవధికంగా వాయిదాపడుతున్నాయి. ఈ నెల 18న మొదలైన సమావేశాలు ఇంత వరకు దారిన పడకపోడం దురదృష్టకర పరిణామం. పార్లమెంటు సమావేశాలు ఇలా సుదీర్ఘ ప్రతిష్టంభనకు గురికాడం కొత్త కాదు గాని, అవి సవ్యంగా జరిగేలా చూసే బాధ్యతను పాలక పక్షం ఇప్పటికీ గుర్తించకపోడం ఆవేదన చెందవలసిన అంశం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పార్లమెంటు సహా ఉన్నత ప్రజాస్వామిక సంస్థలు సవ్యంగా నడిచేలా చూడవలసిన బాధ్యత అధికార పక్షాల మీదనే వుంటుంది. అంటే ప్రజల తరపున ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు, వెలిబుచ్చే సందేహాలకు సమాధానం చెప్పడం ద్వారా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత వాటిదే.
అవి స్వప్రయోజనానికి అమిత ప్రాధాన్యమిస్తూ జనహితాన్ని పట్టించుకోకపోడం వల్లనే పార్లమెంటుగాని, శాసన సభలు గాని రభసల రణరంగాలై వ్యర్థంగా నిరూపించుకుంటున్నాయి. సభా సమయం వృథా అవుతున్నది. ప్రజల తరపున ఎదురయ్యే ప్రశ్నలకు ప్రభుత్వం సవ్యమైన సమాధానం చెప్పనప్పుడు, అది అందుకు సిద్ధంగా లేనప్పుడు ప్రతిపక్షాలు ప్లకార్డులు పట్టుకోడం, సభలో ధర్నాలకు దిగడం వంటి పద్ధతుల ద్వారా నిరసన తెలపడం కూడా ప్రజాస్వామ్య కర్తవ్యం కిందికే వస్తుంది. అటువంటి చర్యలను చూపి ప్రతిపక్షమే సభా సమయాన్ని వృథాగా తగలవేస్తున్నదనడం వాస్తవం కాదు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు 10 రోజులకు పైగా ఇలా నిర్వ్యాపారంగా పడి ఉండడానికి బాధ్యత పూర్తిగా పాలక బిజెపిదే. అధిక ధరలు, ప్యాక్డ్ నిత్యావసర సామాగ్రిపై జిఎస్‌టి విధింపు అనే కీలక ప్రజాసంబంధ అంశంపై చర్చకు అది సిద్ధంగా లేకపోడమే కారణం.
చిరకాలంగా దేశ ప్రజలను నానాయాతనలకు గురి చేస్తూ, బతుకులను దుర్భరం చేస్తున్న అసాధారణ అధిక ధరలకు కారణం యేమిటో, వాటిని అరికట్టడంలో వైఫల్యానికి కారణాలేమిటో బిజెపి ప్రభుత్వం నోటి నుంచే వినాలని ప్రజలు కోరుకొంటున్నారు. సహేతుకమైన కారణాలతో పార్లమెంటు ద్వారా అది తమ ముందుకు రావాలని ఆశిస్తున్నారు. ఆ బాధ్యత నుంచి తప్పించుకోదలచిన ప్రభుత్వం కూలంకషమైన చర్చకు అవకాశం కలుగకుండా చూస్తున్నది. సమావేశాల చివరిలో చర్చను తూతూ మంత్రంగా జరిపించి ముగింపు చెప్పాలని చూస్తున్నది.
అందుకోసమే ప్లకార్డులు పట్టుకొన్నారని, స్పీకర్, అధ్యక్ష స్థానాల వద్దకు దూసుకు వచ్చారనే కారణాలు చూపి లోక్‌సభ నుంచి నలుగురు, రాజ్యసభ నుంచి పందొమ్మిది మంది సభ్యులను సస్పెండ్ చేయించింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, టిఆర్‌ఎస్ సహా ప్రతిపక్ష సభ్యులను ఇంత మందిని సస్పెన్షన్‌కు గురి చేయడం అసాధారణ పరిణామం. రోజులు గడిచిపోతున్నా ధరలపై చర్చకు సిద్ధం కాకపోడానికి ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థులు కావడమే కారణమని అధికార పక్షం చెబుతున్నది. ఇది విశ్వసించదగిన కారణం కాదు. ఆర్ధిక మంత్రి పరోక్షంలో చర్చకు వేరొక మంత్రి సమాధానం చెప్పొచ్చు. సమావేశాలకు ముందే ప్రభుత్వతరపు వాదనను సంబంధిత శాఖ సిద్ధపరచి వుంచుతుంది. తక్షణ, అత్యంత ముఖ్యమైన ప్రజా సమస్య మీద ప్రతిపక్షం వేసే ప్రశ్నలకు సమర్ధవంతంగా సమాధానం చెప్పే స్థితి ప్రభుత్వానికి కరవైంది. అది చేతులెత్తేయక తప్పని పరిస్థితి ఎదురైంది. ప్రజల ముందు పలచబడిపోతామన్న భయంతోనే పాలక పక్షం అవరోధాలు సృష్టిస్తున్నది. ప్రతిపక్షాలకు గల ప్రశ్నించే హక్కును కాలరాస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నది. గత యేడాది వర్షాకాల సమావేశాలు కూడా గలాభాలు, గందరగోళాలు, నిరసనలు, వాకౌట్‌లతో నిష్ఫలంగా తెల్లారిపోయాయి. 30 శాతం సమయం కూడా సద్వినియోగం కాలేదు. ఇప్పుడు సైతం అదే పోకడ, అదే వాలకం కనిపిస్తున్నాయి.
ఇప్పటికి పది రోజులుగా 25 శాతం కార్యక్రమాలూ జరగలేదు. ప్రస్తుత వర్షాకాల సమావేశాలు గత పది రోజులలో గట్టిగా పది గంటలు పాటు సభ విధులను నిర్వర్తించలేదు. ఎందుకిలా జరుగుతున్నది, పార్లమెంటరీ చర్చ అవసరంపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోడం వల్లనే ఇలా సంభవిస్తున్నదా అనే ప్రశ్నకు అవకాశం కలుగుతున్నది. తాము ప్రజాస్వామ్యంతో ఎంతగా ఎన్ని వికృత క్రీడలు ఆడుకున్నా, చేతికి చిక్కిన సీతాకొక చిలుకను రెక్కొక ముక్కగా చిదిమి బాధించినా అదేమిటని అడిగే చైతన్యం ప్రజలలో కరవైనందునే బిజెపి పార్లమెంటుతో ఇలా ఆడుకుంటున్నది. గతంలో 2018 బడ్జెట్ సమావేశాలు దాదాపు మొత్తంగా తుడిచి పెట్టుకొనిపోయాయి. సభలో యే అంశం పైన అయినా ఎంత తీవ్ర విభేదాలు తలెత్తినా కొద్ది సేపటి తర్వాత వాటిని మరచిపోయి ఉభయ వర్గాలు మళ్ళీ మామూలుగా కలిసిపోడం గతంలో వుండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా జరుగుతున్నది. ఉభయ వర్గాల సభ్యులు శాశ్వత శత్రువులను తలపిస్తున్నారు. ఇది ప్రజలకు సమాధానపడే బాధ్యత నుంచి పాలక పక్షం ఉద్దేశపూర్వకంగా తప్పుకోడం కిందికే వస్తుంది.