అర్జెంటీనా, చిలీ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టరు స్కేలుపై 7.4 గా నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఉషుయాకి దక్షిణంగా 219 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు తెలియజేసింది. తీవ్ర భూకంపం అనంతరం రెండుసార్లు ప్రకంపనలు కూడా వచ్చినట్టు సమాచారం. ఎటువంటి ప్రాణ , ఆస్తి నష్టం సంభవించలేదని తెలిసింది. తీవ్రభూకంపం నేపథ్యంలో కొన్ని నిమిషాల్లో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
చిలీ లోని మాగెల్లాన్ తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ విభాగం హెచ్చరించింది. అంటార్కిటిక్ భూభాగం లోని బీచ్‌లన్నీ ఖాళీ చేయాలని సూచించింది. తాజా పరిణామంపై చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బొరిక్ స్పందించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. తీర ప్రాంతాన్ని ఖాళీ చేయడంతోపాటు అధికారులు సిద్ధంగా ఉండటమే తమ తక్షణ కర్తవ్యమని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.