Sunday, June 9, 2024

లక్ష ఎకరాల్లో పంట నష్టం

- Advertisement -
- Advertisement -

Crop-Damage

 

లక్ష ఎకరాలు.. రూ.510 కోట్లు
మార్చిలో 61 వేలు, ఈ నెలలో 38 వేల ఎకరాల్లో అకాల వర్షాలకు పంట నష్టం, ఇన్‌ఫుట్ సబ్సిడీపై కేంద్రానికి ప్రతిపాదన పంపే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
నేడు మంత్రివర్గ సమావేశంలో చర్చ

మన తెలంగాణ/హైదరాబాద్: నెల రోజుల వ్యవధిలోనే అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. మార్చి నెలలో 61 వేల ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లగా, ఏప్రిల్‌లో 38 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈ రెండు నెలల్లో కలిపి ప్రధానంగా వరి రైతులు 82 వేల ఎకరాల్లో నష్టపోయారు. మొక్కజొన్న 16 వేల ఎకరాలు, జొన్న 1300 ఎకరాల్లో పంటలు నీట మునిగి, నేలకొరిగాయి. అకాల వర్షాలు, వడగండ్ల వానలు అన్నదాతలను ఎంత అతలాకుతలం చేస్తున్నాయో చెప్పడానికి ఈ లెక్కలే ఉదాహరణ. ఈ మేరకు వ్యవసాయ శాఖ తన ప్రాథమిక నష్టం అంచనా నివేదికలో పేర్కొంది. ఈ పంటల విలువ ఇన్‌పుట్ సబ్సిడీ ప్రకారం రూ.510 కోట్లుగా ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. పంట నష్టంపై మంత్రులు, ఎంఎల్‌ఎలు తమ పరిధిలో ఉన్న రైతుల పంటల పొలాలను సందర్శించి, ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

కొందరి రైతులకు పిఎంఎఫ్‌బివై కింద నమోదై ఉన్నారు. వారికి ఇన్సురెన్సు కంపెనీల ద్వారా నష్ట పరిహారం అందుతుంది. అయితే పిఎంఎఫ్‌బివై, వాతావరణ ఆధారిత పంటల బీమాలో నమోదైన రైతుల సంఖ్య 2 లక్షలు మాత్రమే. అయితే రాష్ట్రవ్యాప్తంగా పంటలు సాగుచేస్తున్న రైతులు 50 లక్షల వరకు ఉంటారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన రెడ్డి తెలిపారు. దీంతో పంటల బీమాలో లేని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చే విధంగా శనివారం సిఎం అధ్యక్షత జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి, నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తం ఇన్‌పుట్ సబ్సిడీలో విపత్తు నిర్వహణ కింద 75 శాతం కేంద్రం, 25 శాతం రాష్ట్రం భరిస్తుంది. ప్రస్తుత పంట నష్టం అంచనాలు ప్రాథమికమే కావడంతో పూర్తిస్థాయి అంచనాకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించే యోచనలో ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

 

Crop loss in lakh acres
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News