నిరంతర ప్రక్రియ: అమెరికా నివేదిక
వాషింగ్టన్ : భారతదేశపు సైనిక పాటవం అంతా కూడా రష్యా సరఫరాలతోనే ముడివడి ఉందని అమెరికా చట్టసభల పరిశోధక విభాగం (సిఆర్‌ఎస్) నివేదిక తేల్చింది. రష్యా నుంచి సరైన సైనిక సామాగ్రి సకాలంలో అందకపోతే భారత సైన్యం సమర్థవంతంగా పనిచేయడం కష్టమని ఈ నివేదికలో తెలిపారు. అయితే ఇటీవలి కాలంలో భారతదేశం ఆయుధాలు, సైనిక సామాగ్రి విషయంలో ఇతర దేశాలపై ఆధారపడటం గణనీయంగా తగ్గింది. ఇది నిజమే అయితే ఇప్పటికీ అత్యంత కీలకమైన మిలిటరీ సిస్టమ్స్ నిర్వహణకు రష్యా సాయం కోసం భారత్ ఎదురుచూడాల్సిందే అని సిఆర్‌ఎస్ రిపోర్టులో తెలిపారు. ఇప్పటివరకూ కూడా ఇండియా పరిస్థితి ఈ విధంగానే ఉందని పేర్కొన్నారు. ఇండియా నిరంతర ప్రక్రియగా రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేయడాన్ని బైడెన్ అధికార యంత్రాంగం తీవ్ర విషయంగానే పరిగణిస్తోంది. రష్యా ఆయుధ సాయం నేపథ్యంలో ఇండియా పట్ల వైఖరిని ఖరారు చేసుకునేందుకు బైడెన్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ప్రధాన అంశం అయింది. అమెరికా ప్రతికూలతల నివారణల చట్టం (క్యాట్సా) పరిధిలో భారతదేశంపై అమెరికా చర్యలకు లేదా ఆంక్షలకు వీలుందా? అనే విషయం పరిశీలనకు వచ్చిన దశలో ఈ నివేదిక వెలుగుచూసింది.. రష్యా ఆయుధాల విక్రయాలు, రక్షణ పరిశ్రమ అనే నివేదికలో భారతదేశం రష్యా నుంచి సైనిక సాయం పొందడాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ నివేదిక స్వతంత్ర పరిశోధక సంస్థ నుంచి వెలువడింది.