Sunday, May 5, 2024

జనవరి 26 నాడే ఎందుకు?

- Advertisement -
- Advertisement -

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి మన దేశానికి 1947 లో స్వాతంత్య్రం సిద్ధించింది. రెండు శతాబ్దాలు ( రెండు వందల సంవత్సరాలు) పరిపాలించిన బ్రిటిష్ వారి నుండి అనేక మంది స్వాతంత్య్ర సమరయోధులు జరిపిన ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా 1946 ఆగస్టు అర్ధరాత్రి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుండి 1947 ఆగస్టు నాడు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. స్వాతంత్య్రం వచ్చిన తరువాత బ్రిటిష్ వారి చట్టాల అనుగుణంగానే పరిపాలన కొనసాగించాల్సిన అవసరం, ఆవశ్యకత ఏర్పడింది. మన నాయకులు మనకు అనుకూలంగా పరిపాలన కొనసాగించడానికి మనకు రాజ్యాంగం అవసరాన్ని గుర్తించి 1947 ఆగస్టు 29 నాడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ను నియమించారు. 229 మందిని కుల, మత, ప్రాంత, భాష, వర్గ, వర్ణ బేధం లేకుండా రాజ్యాంగ రచన కోసం ఎంపిక చేశారు. 70 మందిని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం రచనకు నామినేటెడ్ చేశారు. మొత్తం 299 మంది రాజ్యాంగ రచనకు రేయింబవళ్ళు కష్టపడి ప్రపంచ వ్యాప్తంగా రాజ్యాంగాలను పరిశీలించి, పరిశోధించి మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు (2 సం.ల 11 నెలల 18 రోజులు ) కష్టపడి తయారు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుగుణంగా ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగాన్ని తయారు చేశారు.

రష్యా దేశం నుండి ప్రాథమిక విధులను, అమెరికా దేశం నుండి న్యాయ సమీక్ష అధికారం, ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు విధానం, బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్పీకర్ పదవి, పార్లమెంటు విధానం, ఏక పౌరసత్వం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి ఆదేశిక సూత్రాలకు సంబంధించిన విధానాలు, కెనడా రాజ్యాం గం నుండి కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, జర్మనీ రాజ్యాంగం నుండి అత్యవసర పరిస్థితులు మొదలై నవి తీసుకున్నారు. 1949 నవంబర్ 26 నాటికి రాజ్యాంగ రచన పూర్తి అయినప్పటికి రెండు నెలలు ఆగి జనవరి 26 నాడు పరిపూర్ణ స్వాతంత్య్రం ఆమోదించిన రోజు నుండి అమలు చేస్తే బాగుంటుందని 1950 జనవరి 26 నుండి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

గణ అనగా సమూహం, తంత్రము అనగా సూత్రం, రాయడం అని అర్థం. గణతంత్ర అనగా సమూహం కొరకు రాయడం అనే అర్థం వస్తుంది. గణతంత్ర దినోత్సవం అంటే భారత దేశ ప్రజల కొరకు రాయబడిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినోత్సవం అని అర్థం. రాజ్యాంగంలోని మొదటి పేజీలో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా లిఖించబడిండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యంగా మన దేశానికి నిర్వచింపబడింది. సర్వసత్తాక అంటే భారత దేశ ఆంతరంగిక వ్యవహారాలలో విదేశాల జోక్యాన్ని సహించమని అర్థం. జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు ప్రపంచం లోని ఏ దేశం జోక్యం చేసుకోకపోవడానికి కారణం రాజ్యాంగంలో సర్వసత్తాక రాజ్యాంగంగా పేర్కొనడమే.

ఎస్. విజయ భాస్కర్, 9290826988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News