Tuesday, April 30, 2024

వినయం, విద్వత్తు కలగలిసిన మూర్తి

- Advertisement -
- Advertisement -

సాహిత్య పరంగా తెలియని విషయం తెలుసుకోవడానికి నిఘంటువులు, పదకోశాలు ప్రధాన వనరులు. కొన్ని వేల గ్రంథాలు అవలోకించి, విశ్వవిద్యాలయాలు, సంస్థలు, విద్వాంసులు కలిసి చేయాల్సిన పనిని తానొక్కడే సంవత్సరాల తరబడి కృషి చేసి పాఠకులకు పరిచయం చేసిండు. తెలుగులో సూర్యారాయంధ్ర నిఘంటువు అత్యంత ప్రామాణికమైనదిగా ప్రసిద్ధి. అయితే ఈ నిఘంటువులో చేరని 36 వేల పదాలు సేకరించి 2004లో శ్రీహరి నిఘంటువు’ని వెలువరించిండు. ఇందులో తెలంగాణ మాండలికంలో ప్రసిద్ధి గాంచిన ఎన్నో పదాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ చేసింది మొన్న (ఏప్రిల్ 21న) చనిపోయిన ప్రతిభా సంపన్నుడు ఆచార్య రవ్వా శ్రీహరి.

’శ్రీహరి నిఘంటువు తయారీకి ఆయన ఎనిమిదేండ్ల కాలాన్ని వెచ్చించాడు అంటే ఆయన దీక్షాదక్షత అర్ధమవుతుంది. అంతకుముందు 1973లో సంకేత పదకోశం, 1978లో వ్యాకరణ పదకోశం (గ్రంథాలను తీర్చిదిద్దారు. రిటైరైన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోరిక మేరకు ’తాళ్లపాక కవుల సంకీర్తనా వాజ్మయం’ నిఘంటువుని నాలుగేంద్లు శ్రమించి తయారు చేశారు. దీనిని 2012లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం వారు అచ్చేశారు. ఇట్లా పదకోశాలు, నిఘంటువులు పాఠకులకు మార్గదర్శకాలుగా ఉంటాయి. అయితే సృజనాత్మక రచయితకు దక్కే గౌరవం, గుర్తింపు వీటి నిర్మాతలకు దక్కదు. ఇదే విషయాన్ని ఒకసారి శ్రీహరి సారుతో నేను ప్రస్తావిస్తే. మనం చేసే పని పది మందికి పనికొస్తుందా లేదా అనేదే ప్రధానం. మనకు గుర్తింపు వస్తుందా, లేదా అనేది ద్వితీయ ప్రాధాన్యత గల అంశం అని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రవ్వా శ్రీహరి సారు మార్గనిర్దేశనంలో ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. ఆ సమయంలో కమిటీలో సారుతో కలిసి పనిచేశాను. అట్లాగే తెలుగు అకాదెమీ తెలంగాణ సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ప్రచురించాలని భావించినపుడు దాని ప్రధాన సంపాదక బాధ్యతలు కూడా శ్రీహరి గారికే అప్పగించారు. ఆయన సంపాదకత్వంలో అనేక సార్లు భేటి అయి తెలంగాణ సాహిత్య చరిత్ర రాశాము. ఇందులోనూ నేను కూడా భాగస్వామి కావడం నా అదృష్టం. ఈ సమయంలో ఆయనను చాలా దగ్గరగా చూడడం జరిగింది. కటువైన విషయం చెప్పాల్సి వచ్చినపుడు సైతం మార్ధవంగానే, ఎలాంటి అగ్రహం లేకుండా, ఒక్క అల్బ పదం వాడకుండా చెప్పడం ఆయనకు మాత్రమే సాధ్యం. తనకన్నా వయసులో చిన్నవారిని సైతం అండీ, గారూ అనే పదం లేకుండా ఎన్నడూ సంబోధించలేదు.

ఎంతటి పండితుడో అంతకన్నా ఎక్కువ సహృదయుడు, ఎంతటి సహృదయుడో అంతటి విద్వత్తుగలవాడు, ఎంత విద్వత్తుందో అంతటి కార్యశీలి, ఎంతటి కార్యశీలో అంతటి తెలంగాణాభఖిమాని. అట్లా అని ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం నిర్దేశకులుగా తన పనిద్వారా తెలుగువారందరి మన్ననలందుకున్నారు.
తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకోక మునుపే నల్లగొండ జిల్లాకే ప్రత్యేకమైన పదాలను సేకరించి దానికి మాండలిక భాషా లక్షణాలను తెలుపుతూ విపులమైన పీఠికను రాశారు. ఇది నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం గ్రంథంగా 1986లో వెలువడింది. ప్రాచీన కావ్యాల్లో చోటు చేసుకున్న తెలంగాణ మాండలిక పదాలను సేకరించి ’తెలంగాణ మాండలికాలు- కావ్యప్రయోగాలు అనే (గ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో దుడ్డె దూప, కొంచబోవు, ఏరాలు, బొండిగ, బొక్క పదాలు, ’డు ప్రత్యయాంతాలు కావ్యాల్లో ఎట్లా వాడిండ్రో రికార్డు చేసిండు.

తెలంగాణ భాషపై సాధికారికంగా మాట్లాడే విద్వత్తు సార్‌కు మాత్రమే ఉండడంతో అనేక సాహిత్య సభలకు భాషపై మాట్లాదేందుకు మేము నిర్వహించిన అనేక సభలకు ఆహ్వానించాము. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రసంగాలు ఆకట్టుకునేవి. తెలంగాణలో ఎవరైనా తమ మాటల్లో ముత్తెమంత, పిత్తెమంత అనే పదాలు వాడుతూ ఉంటారు. అయితే ఈ పదాలు కావ్యాల్లోనే ఉన్నాయని లెక్కగట్టి తేల్చి చెప్పేవాడు. ’ముత్తైమంత చక్కెర/మసాల అరువెవ్వరన్నా అడిగితే… దాని అర్ధం చాలా స్వల్బ మొత్తం కావాలనడం. అయితే జవాబుగా వాసనకు కూడా లేదు అని చెబుతారు. అంటే ముత్తెమంత (ముత్యమంత) కాదు కనీసం వాసనకు కూడా ఆ వస్తువు లేదు అని చెప్పడం. ఇదీ తెలంగాణ భాష సొబగు అని శ్రీహరి సారు ఆ సమావేశాల్లో చెప్పేవారు. అంటే ఆయన సూక్ష్మదృష్టి, లోతైన అధ్యయనం, అపారమైన అనుభవం అర్థమవుతుంది.

పరిశోధకులకు కల్పతరువు లాంటి అలబ్ధ కావ్య పద్య ముక్తావళి (1983), తెలుగులో తెలుగులో అలబ్ధ వాజ్మయం (1983), గ్రంథాలు భావి పరిశోధకులు మార్గదర్శకాలుగా ఉపయోగ పడుతున్నాయి. శ్రీహరి గారి వ్యాసాలు ఉదయ భారతి (1996), సాహితీ నీరాజనం (2008) పేరిట అచ్చయ్యాయి. వ్యాకరణం, పదకోశం, నిఘంటువు, భాష, పరిశోధన ఇట్లా పలు ప్రక్రియల్లో తెలుగు సాహిత్యాన్ని దాని ఘనతను సులభతరం చేసి పాఠకులకు అందజేసిండు. ఒక్క తెలుగులోనే కాదు సంస్కృతంలోనూ రచనలు చేసిండు. కొన్ని తెలుగు కావ్యాలను సంస్కృతంలోకి తర్జుమా చేసిండు. గుర్రం జాషువా మీది అభిమానంతో ’ఫిరదౌసి, గబ్బిలం కావ్యాలను అదే చంధస్సులో సంస్కృతంలో ఫిరదౌసి, ’తైలపాయికా’ పేరిట అనువదించిండు. వీటితో పాటు సంస్కృతంలో ’మాతృగీతమ్, సంస్కృత వైజయంతీ అనే గ్రంథాలను వెలువరించాడు. వీటికి కొనసాగింపుగా సి.నారాయణరెడ్డి ’ప్రపంచపది), అన్నమయ్య ’సూక్తిసుధా, వేమన శతకము, నరసింహ శతకములను తెలుగు నుంచి సంస్కృతంలోకి తర్జుమా చేసిండు. ఇట్లా రెండు భాషల మధ్యన వారధి నిర్మించిండు.

ఇంతటి ప్రతిభా సంపన్నుడు సామాన్య చేనేత కార్మిక కుటుంబంలో సెప్టెంబర్ ఏడు, 19483 నాడు నల్లగొండ జిల్లా అమ్మమ్మ ఇంట్లో మునిపంపులలో జన్మించిండు. తల్లిదండ్రులు రవ్వా వెంకటనర్సమ్మ, వెంకటనర్సయ్యలు. యాదగిరి లక్ష్మీనృసింహుడి మీది భక్తితో చుట్టుప్రక్కల ప్రాంతాల వారు ఇట్లా నరసమ్మ, నరసయ్య పేర్లు పెట్టుకోవడం సాధారణ విషయం. ఈయన సొంత గ్రామం ఇప్పటి యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం, వెల్వర్తి. తెలుగు, సంస్కృతం భాషలను, సాహిత్యాన్ని అవలోడనం చేశారు. అందుకే ఏది రాసినా, ఏది చెప్పినా ప్రామాణికంగా ఉండేది. అత్యంత పేదరికంలో ఉండి ఫ్రీగా వసతి, భోజనం దొరుకుతుందనే ఉద్దేశ్యంతో యాదగిరి గుట్ట సంస్కృత పాఠశాలలో చేరిండు.

అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వి.వి. పాఠశాలలో టీచర్‌గా, సారస్వత పరిషత్తులో లెక్చరర్‌గా, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లో ఆచార్యులుగా, ద్రావిడ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా పనిచేసిండు. ఎక్కడ ఉద్యోగం చేసినా తనదైన ముద్రను వేశారు. వ్యక్తిగా అంతకు వందరెట్లు విద్యార్థులు, పరిశోధకులు, అంతేవాసుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇటీవలే ప్రభుత్వ డిగ్రీకళాశాల లెక్చరర్ దాక్టర్ అహల్య, రవ్వా శ్రీహరి జీవితం-సాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నది. ఆ పరిశోధన గ్రంథం కూడా చ్రురితమైనట్లయితే కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి.

ఇంతటి గొప్ప పండితుడికి ఎప్పుడో పద్మశ్రీ అవార్డు రావాల్సి ఉండింది. సాహిత్య అకాడెమీ అవార్డూ బాకీ ఉంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం శ్రీహరి గారి పేరును కేంద్ర ప్రభుత్వానికి పద్మశ్రీ కోసం ప్రతిపాదించాలి. అంతేగాకుండా తెలంగాణ ప్రభుత్వం ఆయన పేరిట ప్రతి సంవత్సరం ఒక సాహితీవేత్తకు అధికారికంగా ’జీవిత సాఫల్య పురస్మారం’ని అందించాలి. యాదగిరిగుట్టలో ప్రభుత్వం నెలకొల్పిన సంస్కృత పాఠశాలను కళాశాల స్థాయికి పెంచి దానికి ’యాదగిరి గుట్ట రవ్వా శ్రీహరి సంస్కృత విద్యాపీఠమ్‌గా దానికి పేరుంచాలి. వీటితో పాటు తెలుగు అకాడెమి గానీ, తెలంగాణ సాహిత్య అకాడెమీ గానీ ఆయన రచనలన్నింటినీ పునర్శుద్రించి (అముద్రితాలుగా ఉన్న వాటితో సహా) తెలంగాణ ప్రతిభను తెలుగు పాఠకులందరికీ తెలియజెప్పాల్సిన అవసరమున్నది.

సంగిశెట్టి శ్రీనివాస్
9849220321

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News