Friday, September 12, 2025

ఐదు ‘గ్యారంటీ’లకు కేబినెట్ ఆమోదం.. డిగ్రీ పాసైన వారికి…

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన వాగ్దానాకు కట్టుబడి ఉన్నామని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. ఇందులో భాగంగా ఐదు గ్యారంటీలను అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిందని చెప్పారు. కులమత వివక్ష లేకుండా వీటిని అమలు చేస్తామన్నారు.ఇందులో కొన్ని పథకాలను తక్షణమే అమలు చేసేంద్రుకు ఏర్పాటు చేశామని, మహిళల కోసం తీసుకువస్తున్న గృహలక్ష్మి పథకాన్ని మాత్రం ఆగస్టు 15న ప్రారంభిస్తామని సిద్ధరామయ్య చెప్పారు.‘ కేబినెట్ సమావేశంలో భాగంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై విస్తృతంగా చర్చించాం.

ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ హామీలను అమలు చేయాలని నిర్ణయించాం’ అని శుక్రవారం మంత్రివర్గ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సిద్ధరామయ్య చెప్పారు. తనతో పాటుగా ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ కూడా గ్యారంటీ కార్డులపై సంతకం చేశారని చెప్పిన ఆయన హామీలను నెరవేర్చడంతో పాటుగా వాటిని ప్రజలకు అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ ఐదు పథకాలకు సంబంధించిన ప్రాథమిక వివరాలను ఆయన వెల్లడించారు. గృహజ్యోతి పథకం కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని, ఈ పథకం జులై 1నుంచి అమలులోకి వస్తుందని ఆయన చెప్పారు. అయితే అప్పటివరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులను మాత్రం చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.

అలాగే ‘అన్న’ భాగ్య పథకం కింద బిపిఎల్ కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ నెలకు పది కిలోల బియ్యాన్ని అందజేస్తామని. జులై 1నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని చెప్పారు. ‘యువనిధి’ పథకం ద్వారా నిరుద్యోగులకు 24 నెలల పాటు భృతిని అందజేస్తారు. డిగ్రీ పాసైన వారికి నెలకు రూ.3 వేలు, డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.1500 చొప్పున అందజేస్తారు. 2022 23లో పాసయిన ప్రతి ఒక్కరికీ వీటిని అందజేస్తారు. ఇక ‘శక్తి’ పథకం కింద ఆర్‌టిసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణసౌకర్యం ఈ నెల 11నుంచి అమలు చేయనున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఎసి, లగ్జరీ బసులు మినహా మిగతా అన్ని బస్సుల్లో ఈ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News