కరీంనగర్: ప్రభుత్వానికి, పాలకవర్గానికి నమ్మకంతో అవకాశమిచ్చిన నగర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలకవర్గం పని చేస్తుందని నగర మేయర్ వై సునీల్‌రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధిలో భాగంగా బుధవారం మేయర్, కమీషనర్ సేవా ఇస్లావత్ 25వ డివిజన్‌లో పర్యటించారు.
కిసాన్‌నగర్‌లో కార్పొరేటర్ ఎడ్ల సరిత అశోక్‌తో కలిసి 50 లక్షల నిధులతో ఎస్‌డబ్లుజీ డైనేజీ పైపులైన్ నిర్మాణం, సిమెంట్ ప్యాచ్ పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో ప్రజలకు అనువుగా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు.
పనులు జరిగే చోట ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని కోరారు. కిసాన్‌నగర్ శివారు ప్రాంత పరిధిలో ఉన్న 25, 26, 24, 3 డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టి ప్రజలకు కావల్సిన మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుర్ర తిరుపతి, డీఈ మసూద్ ఆలీ, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.