Friday, June 7, 2024

గుల్జార్‌కు జ్ఞాన్‌పీఠ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యలను 58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్‌గా సుప్రసిద్ధుడైన సంపూరణ్ సింగ్ కల్రా హిందీ చిత్ర రంగంలో విశిష్ట కృషి సల్పినవారు. ఆయనను ఈ శకం మేటి ఉర్దూ కవులలో ఒకరుగా పరిగణిస్తుంటారు. చిత్రకూట్‌లోని తులసీ పీఠ్ వ్యవస్థాపకుడు, అధిపతి రామభద్రాచార్య సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక నేత, విద్యావేత్త. ఆయన నాలుగు పురాణ గ్రంథాలతో పాటు 240 పైచిలుకు పుస్తకాలు, పాఠ్య గ్రంథాలు రచించారు. ‘రెండు భాషలలో నుంచి ప్రముఖ రచయితలకు (2023కు) సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ ఉర్దూ సాహితీవేత్త గుల్జార్‌కు పురస్కారం ఇవ్వాలని నిర్ణయించడమైంది’ అని జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

గుల్జార్ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్, తన రచనలకు గాను కనీసం ఐదు జాతీయ సినీ అవార్డులు అందుకున్నారు. గుల్జార్ అద్భుత రచనలలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జై హో’ పాట ఒకటి. ఆ గీతానికి ఆయన 2009లో ఆస్కార్ అవార్డు, 2010లో గ్రామీ అవార్డు అందుకున్నారు. ఆయన కొన్ని అవార్డు విజేత చిత్రాలకూ దర్శకత్వం వహించారు. వాటిలో కోషిష్ (1972), పరిచయ్ (1972), మౌసమ్ (1975), ఇజాజత్ (1977) చిత్రాలు, టెలివిజన్ సీరియల్ మీర్జా గాలిబ్ (1988) కూడా ఉన్నాయి. ‘గుల్జార్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంతో పాటు సాహితీ రంగంలో కొత్త మైలురాళ్లు నెలకొల్పారు’ అని భారతీయ జ్ఞాన్‌పీఠ్ ఒక ప్రకటనలో తెలియజేసింది. రామానంద్ తెగ ప్రస్తుత జగద్గురు రామభద్రాచార్యులు నలుగురిలో రామభద్రాచార్య ఒకరు. ఆయన 1982 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 22 భాషలు మాట్లాడగల రామభద్రాచార్య సంస్కృతం, హిందీ, అవధి, మైథిలితో సహా పలు భారతీయ భాషలలో కవి, రచయిత. ఆయన 2015లో పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News