న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్, కేబినెట్ మంత్రి ఆతిషి సోమవారం తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ ను కలుసుకున్నారు. కేజ్రీవాల్ మే 7 వరకు జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. కాగా కారాగారం అధికారుల అనుమతి సునీతా కేజ్రీవాల్ కు లభించడంతో వారు జైలుకు వెళ్లి ఆయనను చూశారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడి ఆయనను మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఆతిషి మాట్లాడుతూ జైలులో కేజ్రీవాల్, ‘పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, మొహల్లా క్లినిక్ మందులు అందుతున్నాయా?’ అని అడిగారని చెప్పింది. ఇక పశ్చిమ ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతుగా సునీతా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించిన మరునాడు జైలులో తన భర్తను వెళ్లి చూశారు. తన భర్త ‘సింహం’ అని ఆమె కీర్తించారు. ‘అరవింద్ కేజ్రీవాల్ చేసిన తప్పేమిటి? ఆయన చేసిన తప్పల్లా ఉచిత విద్యత్తు ఇవ్వడమా? ఇదివరలోనైతే అస్తమాను విద్యుత్తు కట్ ఉంటుండేది. ఇప్పుడు 24 గంటలూ విద్యుత్తు లభిస్తోంది. మీ పిల్లల కోసం బడులు కట్టారు. ప్రతి వాడ(మొహల్లా)లో క్లినిక్కులు పెట్టారు. ఇప్పుడు ప్రతి నెల మహిళలకు రూ. 1000 ఇస్తున్నారు. కేజ్రీవాల్ ‘సింహం’’ అన్నారు.
‘నెల రోజులుగా ముఖ్యమంత్రి అయిన నా భర్తను జైలులో బలవంతంగా బంధించారు. ఇప్పటి వరకు ఏ కోర్టు ఆయనను దోషిగా తేల్చలేదు. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందనే వారంటున్నారు. ఒకవేళ దర్యాప్తు 10 ఏళ్లు కొనసాగేట్లయితే అనేళ్లు ఆయనను జైలులోనే ఉంచుతారా? ఇదివరలో అయితే దోషిగా తేలిన వ్యక్తులనే కోర్టు జైలులో పెట్టేది. కానీ ఇప్పుడు ఏమి తేలకుండా, దర్యాప్తు కొనసాగినంత కాలం జైలులో పెట్టే విధానాన్ని వారు తీసుకొచ్చారు’ అని సునీతా కేజ్రీవాల్ అన్నట్లు ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఢిల్లీలో ఆరో దశ ఎన్నిక కింద మే 25న ఏడు లోక్ సభ సీట్లకు ఓటింగ్ జరుగనున్నది. కాగా ఏడు దశల అన్ని ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగనున్నది.