ఇప్పటికే లక్షన్నర కోట్ల పనులు పూర్తి చేశాం రానున్న మూడేళ్లలో మరో
రెండు లక్షల కోట్ల పనులు పూర్తి చేస్తాం దీంతో తెలంగాణ రూపు రేఖలు
మారిపోవడం ఖాయం ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ ఇంకా మిగిలి ఉంది :
కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రోడ్లు, జాతీయ రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అంకిత భావంతో కృషి చేస్తోందని అన్నారు. రోడ్ల అభివృద్ధి, మౌళిక సదుపాయాల విస్తరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అలాగే రాబోయే మూడు, నాలుగేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు గడ్కరీ ప్రకటించారు. తెలంగాణలో సోమవారం పర్యటించిన ఆయన పలు జాతీయ రహదారులు, రోడ్లు, అండర్ పాస్‌లు తదితర పనులకు ఆయన ప్రారంభోత్సవం, భూమి పూజ చేశారు.
తెలంగాణలో చేపట్టబోయే ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు సంపూర్ణంగా మారిపోతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ ఇంకా మిగిలి ఉందని వ్యాఖ్యానించారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో రూ. 3,900 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే సంగారెడ్డి, రంగారెడ్డిని కలుపుతూ జాతీయ రహదారిపై పటాన్ చెరు నియోజకవర్గంలోని అశోక్ నగర్ వద్ద రూ.172 కోట్ల వ్యయంతో చేపట్టిన ఒకటిన్నర కిలో మీటర్ల పొడవైన ఆరు లైన్ల బిహెచ్‌ఈఎల్ ఫ్లై ఓవర్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో సంగారెడ్డిలోని పలు ప్రాంతాల నుండి పటాన్ చెరు ద్వారా బీరంగుడ మీదుగా లింగంపల్లి ఫ్లైఓవర్ ఎక్కి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హైదరాబాద్ చేరుకునేందుకు మార్గం సుమగమైంది.
నగరంలోని అంబర్ పేట ఫ్లై ఓవర్‌ను కూడా కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాగజ్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ 2014లో తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి తెలంగాణలో జాతీయ రహదారుల పొడవు 2,511 కిలోమీటర్లు ఉండగా, ప్రస్తుతం అది దాదాపు రెట్టింపు అయ్యి 5,000 కిలోమీటర్లకు చేరిందని గుర్తుచేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే రూ.1.5 లక్షల కోట్ల పనులు పూర్తిచేశామన్న కేంద్రమంత్రి ఇది ఆరంభం మాత్రమేనని, రాబోయే 3- నుంచి 4 ఏళ్లలో మరో రూ.2 లక్షల కోట్ల విలువైన పనులు చేపడతామని వెల్లడించారు. ఇవి కచ్చితంగా తెలంగాణ రూపురేఖలను మారుస్తుందని తాను విశ్వసిస్తున్నానని వెల్లడించారు. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలని అన్నారు. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు కానీ ఇపుడు పరిస్ధితులు మారుతున్నాయని తెలిపారు. పేదవారికి కూడు, గూడు, గుడ్డ అవసరం మేము దానికోసం పని చేస్తాం, ప్రతి యువకుడు ఉపాధి పొందాలి, తాను అగ్రికల్చర్ సైన్సులో పని చేసినందుకు 13 డాక్టరేట్ పొందానని తెలిపారు. ఏ ఊరిలో అయితే బావిలో ఒక గంట నీరు వచ్చేదో అదే ఊరిలో ఇపుడు 12 గంటలు నీరు సరఫరా అవుతుందని వెల్లడించారు. తాను ముంబాయిలో మంత్రిగా ఉన్న కాలంలో వాజ్ పెయి ఆదేశంతో గ్రామాలకు కనెక్టివిటీ చేసే కార్యక్రమం తన వయస్సు 33 ఏళ్ళు ఉన్నప్పుడు చేపట్టానని తెలిపారు. ఇదే ఇప్పటి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అని తెలిపారు.
హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరిస్తాం
హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ ఫ్లై ఓవర్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన సందర్భంగా అంబర్‌పేట్ మున్సిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో గడ్కరీ మాట్లాడుతూ హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని విస్తరిస్తామని చెప్పారు. ఆ రహదారిని నాలుగు వరుసల జాతీయ రహదారిగా మార్చుతామని అన్నారు. తెలంగాణలో హైవేలను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. సర్వీసు రోడ్లు, ఫుట్ పాత్‌లు కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. ఆరు ప్రాంతాల్లో అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రూ.లక్ష కోట్ల విలువైన కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే, హైవే ప్రాజెక్టుల పనులు చురుకుగా సాగుతున్నాయని గడ్కరీ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని, యువతకు ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని తెలిపారు. రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు. రద్దీ తగ్గడం, తక్కువ ఖర్చుతో ప్రయాణం సాధ్యపడటం, లాజిస్టిక్స్ సామర్థ్యం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. తద్వారా రాష్ట్ర మౌలిక సదుపాయాల రంగంలో ఇదో కీలక ముందడుగు అవుతుందని వివరించారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గడ్కరీ స్పష్టం చేశారు.