శాస్త్రీయ సంగీతాన్ని ఆనందించగలగడం ఒక అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని పొందడం అంత సులభం కాదు. ముందు శాస్త్రీయ సంగీతం పట్ల సహజమైన ఇష్టం, మక్కువ ఉండాలి. తర్వాత, దాన్ని అనుసరించడానికా బాగా నచ్చకపోయినా, ఓపికతో వినడానికి మొండి పట్టుదల లాంటిది అవసరం. చాలా కాలం పాటు అట్లా వింటూ పోతుంటే మెల్లగా అభిరుచి అంకురిస్తుంది.
శాస్త్రీయ సంగీతాన్ని విని, ఆనందించడమే సాధారణ శ్రోతల ప్రధాన ధ్యేయంగా ఉండాలి. కవిత్వం, కథలు మొదలైనవి అర్థం చేసుకోదగిన అంశా లు. సంగీతం మాత్రం కేవలం ఆనందించదగినది. నిజానికి సంగీతంలోని సాహిత్యాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నం ఆనందించడానికి అడ్డంకిగా మారవచ్చు. ముఖ్యంగా ప్రారంభ దశలో. అందుకే, శాస్త్రీయ సంగీతాన్ని వినేటప్పుడు మెదడును స్విచ్చాఫ్ చేసి చెవులను, హృదయాన్ని, మనసును పూర్తిగా తెరవాలి.
నాదాన్ని లోపలికి ఆహ్వానించాలి. సంగీతం దానికదే ఒక భాష. దాన్ని ఆనందించేందుకు వేరే భాష అవసరం లేదు. కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని విదుషి ఎంఎస్ సుబ్బులక్ష్మి (Vidushi MS Subbulakshmi) 1966లో న్యూయార్క్‌లోని కార్నెగీ హాల్ (Carnegie Hall)లో కచేరీ చేసినప్పుడు దాన్ని వినేందుకు వచ్చిన శ్రోతలకు భారతీ య భాషలు రావు. అక్కడ ఆమె సం స్కృతం, తెలుగు, తమిళ కృతులను ఆలపించారు. అయినా ఆ కచేరీకి అనూహ్యస్పందన వచ్చింది. చప్పట్లతో హాలు మారుమ్రోగింది. అక్కడి ఆంగ్ల పత్రికలు ఆమెను వేనోళ్ల పొగిడాయి. తమకు తెలియని భాషలో ఉన్నా.. ఆ కృతులను విని ఎంతగానో ఆనందించారు శ్రోతలు. అదేవిధంగా హిందుస్తానీ సంగీతంలోని తరానాలలో అర్థవంతమైన మాటలు ఉండవు. ధీం, తన, నోం, తదారె, తదాన, తోం, తనోం లాంటి అక్షరాలు, పదాలు మాత్రమే ఉంటాయి.
ఇక కర్ణాటక సంగీతంలోని తిల్లానాలలో మధ్య మధ్య త, ధీం, న, తి, ధిర్, తక, ఝం, నాద్రు మొదలైన అక్షరాలు, పదాలు వస్తాయి. ఇవి అర్థవంతమైన పదాలతో కలిసి మిశ్రమరూపంలో ఉండవచ్చు. ఏదైనా రాగపు ఆలాపన లో కూడా ‘ఆకార్’ గాయనం (కేవలం ‘ఆ’ అనే అక్షరాన్ని సాగదీస్తూ పాడటం) లాంటివి తప్ప పదాలుండవు. అయినా వీటన్నిటి ద్వారా రసం, భావం ప్రసారమై శ్రోతకు అందుతాయి. కాబట్టి, నాదం గొప్పగా ఉన్నప్పుడు భావం దానంతట అదే అనుభవంలోకి వస్తుంది. మెదడుకు పని పెట్టే అవసరం ఉండదు. ఇదంతా శ్రోతలపరంగా చెప్తున్న మాట. కానీ, గాయకులకు, గాయనుల కు తాము పాడే సంగీతంలోని సాహిత్యం సంపూర్ణంగా అర్థం అయి ఉండాలి. అప్పుడే వాళ్లు సరైన భావం స్ఫురింపజేసేలా పాడగలరు.
నిజానికి వారు ప్రాచీన కావ్యాలను చదినినవారై ఉండాలని చెప్పారు జైపూర్- అత్రౌలీ ఘరానాకు చెందిన విదుషి కిశోరీ అమోన్కర్ (ఈమె ప్రసిద్ధురాలైన విదుషి మోగూబాయి కుర్దీకర్ కూతురు). అంటే పాడే వారిది చురుకైన పాత్ర (active role), వినే వారిది మందకొడి పాత్ర (passive role) అన్న మాట. తెలుగు భాషను పూర్తిగా అర్థం చేసుకునేందు కు సుబ్బులక్ష్మి ప్రత్యేకంగా ఒక తెలుగు పండితుడిని మాస్టారు గా నియమించుకుని మన భాషను నేర్చుకున్నారు. గాయనంలో భావప్రసరణను పెంచేందుకు ఇటువంటి కృషి తోడ్పడగలదు. అయితే, ఈ విషయంలో సంగీత కళాకారులందరి అభిప్రా యాలు ఒకేవిధం గా లేకపోవడం గమనించదగినది.
కిశోరీ అమోన్కర్ బాగేశ్రీ రాగంలో పాడిన ద్రుత్ ఖ్యాల్, ‘ఆజ్ సహియోనా జాయ’లోని ఏ పదాల మీదా ధ్యాస పెట్టకపోయినా అందులోని విరహ వేదన వెంటనే మనకు అనుభూతమౌతుంది. అదే విధంగా ఉస్తాద్ వాసిఫుద్దీన్ డాగర్ బిహాగ్ రాగంలో పాడిన ధ్రుపద్‌ను వింటే, ఒక పక్షి ఆకాశంలో తేలియాడుతూ చివరకు భూమ్మీద వాలిన అనుభూతిని పొందుతాం. బిహాగ్ అనే మాట విహంగ్/బిహంగ్ నుంచి వచ్చింది. కానీ ఈ విషయం తెలియకపోయినా ఆ ధ్రుపద్ గాయనంలో పక్షి ఎగరడం, భూమ్మీద వాలడం మన అనుభవంలోకి వస్తాయి. ఇటువంటి మరెన్నో ఉదాహరణలను ఇవ్వవచ్చు. అంటే శాస్త్రీయ సంగీతానికి అంత గొప్ప శక్తి ఉందన్న మాట. అయితే, దాన్ని గ్రహించగలిగే ‘ఆత్మసంస్కారం’ శ్రోతలకు ఉండాలి. అప్పుడే సంగీతాన్ని ఆనందించడం సులభమౌతుంది.
- ఎలనాగ