లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ చివరి రోజుకు చేరింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభమై.. ఆ తర్వాత ఫలితం తెలుస్తుంది. అయితే నాలుగో రోజు బ్యాడ్‌లైట్ కారణంగా మ్యాచ్‌ని ముందుగానే నిలిపివేశారు. ఈ విషయంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ (Nasser Hussain) మ్యాచ్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఇంకో అరగంట మ్యాచ్‌ని కొనసాగించి ఉంటే ఫలితం తెలిసేది కదా అని ఆయన పేర్కొన్నారు.
నాలుగో రోజు ఇంగ్లండ్ ఆధిపత్యం చూపించింది. భారత్ నిర్దేశించిన 374 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా హ్యారీ బ్రూక్, జో రూట్ సెంచరీలతో అదరగొట్టారు. మరోవైపు భారత బౌలర్లు కూడా పుంజుకున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి మళ్లీ మ్యాచ్‌పై ఆశలు రప్పించారు. అయితే స్వల్పంగా వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోవడంతో నిర్వాహకులు మ్యాచ్‌ని వాయిదా వేశారు.
ఈ నేపథ్యంలో నాసిర్ హుస్సేన్ (Nasser Hussain) ‘‘సోమవారం వర్కింగ్ డే. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు డబ్బులు చెల్లించారన్న ముఖ్య విషయాన్ని మనం మర్చిపోకూడదు. తుది ఫలితాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు అర్హులు. మ్యాచ్‌ని ఇంకో ఆరగంట లేదా.. 42-43 నిమిషాలు కొనసాగించాల్సింది. ది ఓవెల్‌లో ఫలితం తేలితేనే.. సిరీస్ ఫలితం తేలేది. ఇది ఆదివారమే జరగాల్సింది. నిబంధనల ప్రకారం కవర్లు తొలగించేందుకు వీలు లేదని గ్రౌండ్స్‌మెన్ చెప్పేంత వరకు అంపైర్లు ఆటను ముగించరాదు. కానీ, ఫలితం వస్తుందని అనిపించనప్పుడు ఇలా చేయడంలో తప్పేముంది? నాకైతే కామన్‌సెన్స్ లోపించినట్లు అనిపించింది. ఇది నిజంగా సిగ్గుచేటు’’ అని అన్నారు. హుస్సేన్ మాటలకి టీం ఇండియా మాజీ ఆటగాడు దినేశ్ కార్తీక్ కూడా మద్దతు ఇచ్చారు.