Friday, September 19, 2025

మరో రెండు లక్షల టన్నుల యూరియా కావాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్‌లో ప్రణాళిక ప్రకారం ఇప్పటి దాక ఏర్పడిన రెండు లక్షల టన్నుల యూరియా లోటును భర్తీ చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహా య మంత్రి అనుప్రియ పటేల్‌ను రాష్ట్ర వ్యసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు. మంగళవారం ఢీల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అ యిన తుమ్మల రాష్ట్రంలో యూరియా అవశ్యకత ను వివరించారు. ఖరీఫ్ సీజన్ ప్రకారం ఇప్పటికే రెండు లక్షల టన్నుల యూరియా లోటు ఉందని మంత్రి వెల్లడించారు. రబీ సీజన్‌లో రైతాంగానికి ఇబ్బంది లేకుండా ముందుగానే ప్రతి నెల రెండు లక్షల టన్నుల యూరియా సరఫరా చే యాలని కోరారు. జియోపొలిటికల్ కారణాల వల్లనే సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యాయ ని, వీలైనంత త్వరగా తెలంగాణకు అవసరమైన యూరియా సరఫరా చేస్తామని కేంద్ర తెలిపినట్లు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. రాష్ట్రంలో వేగంగా ఉద్యానవన పంటలు సాగు పెరుగుతోందని దీని కి అనుగుణంగా రైతుల సౌకర్యం కోసం తెలంగాణకు 16 కృషి విజ్ఞాన కేంద్రాలు కేటాయించాల ని కేంద్ర రైతు

సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రితో తుమ్మల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర రైతులలో అధిక శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, వీరికి బలమైన సాంకేతిక వ్యవసాయ మద్దతు అవసరమని ఆయన చెప్పారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం112.08 లక్షల హెక్టార్లు అని, దీనిలో 49.64 శాతం సాగుభూమిగా ఉందన్నారు. రాష్ట్రంలో 70.60 లక్షల రైతులు 67.14 లక్షల హెక్టార్ల భూమిలో సాగు చేస్తుండగా, సగటు సాగు భూముల పరిమాణం కేవలం 0.89 హెక్టార్లు మాత్రమే అని మంత్రి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో ఉద్యానపంటల సాగు (హార్టికల్చర్) వేగంగా విస్తరిస్తోందని, సుమారు 12.40 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు అవుతున్నట్లు మంత్రి చెప్పారు. వార్షిక ఉత్పత్తి 71.52 లక్షల మెట్రిక్ టన్నులు దాటిందని, అయినప్పటికీ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 16 జిల్లాల్లో మాత్రమే కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మిగిలిన జిల్లాలకు ఈ సౌకర్యం లేకపోవడం పెద్ద లోటు అని మంత్రి తెలిపారు.

ఈ నేపథ్యంలో, ప్రతి జిల్లాలో ఒక కృషి విజ్ఞాన్ కేంద్రం ఉండేలా 16 నూతన కెవికేలు రాష్ట్రానికి మంజూరు చేయాలని ఆయన కోరారు. వీటి పరిపాలనా నియంత్రణను రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండలక్ష్మణ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఇతర సంస్థలతో చర్చించి నిర్ణయించవచ్చని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఎస్‌కేఎల్‌టిహెచ్‌యు ఆధ్వర్యంలో కేవలం పెద్దపల్లి రామగిరిఖిల్లా కెవికే మాత్రమే ఉందని, హార్టికల్చర్‌కు తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నందున, కొత్త కెవికేల్లో గణనీయమైన సంఖ్య ఎస్‌కేఎల్‌టిహెచ్‌యు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే కెవికేలు రైతులకు ప్రాథమిక స్థాయి సాంకేతిక పరిజ్ఞానం చేరవేయడం, తోటల పంటల క్లస్టర్ ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు, ఎగుమతులు, అధిక విలువ కలిగిన పంటలు, ఔషధ, సుగంధ మొక్కల ప్రోత్సాహం, వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయం, నీటి యాజమాన్య పద్ధతులు, డిజిటల్ సాధనాల వాడకంలో రైతులకు మద్దతు ఇస్తాయని ఆయన వెల్లడించారు. కేంద్రం తగిన మద్దతు ఇస్తే, తెలంగాణ వ్యవసాయ అభివృద్ధిలో పెద్ద అడుగు వేసి, రైతుల ఆదాయాలు పెంపొందించి, గ్రామీణ జీవనోపాధి మెరుగుపరచి, దేశవ్యాప్తంగా వ్యవసాయ వృద్ధికి విశేషంగా తోడ్పడుతుందని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రానికి అదనంగా 25వేల పోర్టబుల్ స్ప్రింక్లర్ల సిస్టమ్స్ కేటాయించాలి
రాష్ట్రానికి అదనంగా 25,000 పోర్టబుల్ స్ప్రింక్లర్ల సిస్టమ్స్ కేటాయించాలని మంత్రి తుమ్మల కోరారు. తెలంగాణ వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన రాష్ట్రం కావడంతోపాటు, వర్షపాతం అస్థిరంగా ఉండడం, భూగర్భ జలాలపై అధికంగా ఆధారపడడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ పథకం ఆర్‌కెవివై- పర్ డ్రాప్ మోర్ క్రాప్ ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తోందని మంత్రి వివరించారు. 2025, 20-26 సంవత్సరంలో 16,510 పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించగా, ఇప్పటివరకు 11,000 యూనిట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేశామన్నారు. వాటిలో 9,346 యూనిట్లు ఖరీఫ్ సీజన్లో రైతుల అవసరానికి అనుగుణంగా ఇప్పటికే పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. రబీ సీజన్లో ముఖ్యంగా వేరుశెనగ, పప్పుధాన్యాలు, క్యారెట్, బీట్‌రూట్ వంటి పంటలు వేసే చిన్న, సన్నకారు రైతులు ఈ స్ప్రింక్లర్ల పద్ధతిని అనుసరిస్తామని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో వాటి వ్యయం పెద్ద అడ్డంకిగా మారిందని, రైతుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని సబ్సిడీపై పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లు అందించేలా రాష్ట్రానికి అదనంగా 25,000 పోర్టబుల్ స్ప్రింక్లర్ యూనిట్లు కేటాయించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read: గుట్టలుగా నోట్ల కట్టలు.. ఎసిబికి చిక్కిన మరో అవినీతి తిమింగలం

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News